Telanganas Mahalakshmi Scheme: మహాలక్ష్మితో మహిళా సాధికారత
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:20 AM
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ 9న శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ‘మహాలక్ష్మీ పథకం’ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చరిత్రాత్మక నిర్ణయాల్లో మహిళలకు...
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ 9న శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ‘మహాలక్ష్మీ పథకం’ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చరిత్రాత్మక నిర్ణయాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం ముందుంది. ఈ పథకం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి ఒక ధైర్యమైన అడుగు. ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణ మహిళల జీవన విధానాన్ని ఇది మార్చేసింది. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు వంటివి ఏవైనా కావచ్చు, మహిళలకు ఇది నిజమైన స్వేచ్ఛను అందించింది. వారి కలల దూరం తగ్గి, అవకాశాలు దగ్గరయ్యాయి. గ్రామాల నుంచి కూడా రాజధానికి మహిళలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 252 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సగటున రోజుకు 30 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. 2025 జూలై 21 వరకు 199.6 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఇప్పటికే రూ.8,402 కోట్లు వారు ఆదా చేసుకున్నారు. మరిన్ని గణాంకాలు చూస్తే, 2025 జూలై 22 నాటికి 200 కోట్లు జీరో–ఫేర్ టికెట్లు జారీ అయ్యాయి. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం నుంచి 94 శాతానికి పెరిగింది. మొదటి 11 రోజుల్లో 62శాతం ప్యాసింజర్లు మహిళలే. రోజుకు 51 లక్షల మంది చొప్పున మొత్తం ప్రయాణికుల్లో 27 లక్షలు జీరో–ఫేర్ టికెట్లు జారీ అయ్యాయి. ఇది మహిళలకు మాత్రమే కాదు, టీజీఎస్ ఆర్టీసీకి కూడా ఆర్థిక బలోపేతం. ఆర్టీసీ రోజువారీ రెవెన్యూ రూ.12–15 కోట్ల నుంచి రూ.18–19 కోట్లకి చేరింది. దేవాలయాల రూట్లలో ప్రయాణం 82 శాతం పెరిగింది. మహాలక్ష్మి పథకం కింద 8,459 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది.
ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 152 బస్సులకు వారు యజమానులుగా ఉన్నారు. రానున్న కొద్ది రోజుల్లో మరో 448 బస్సులు మహిళా సంఘాల ద్వారా నడవనున్నాయి.
నేను రవాణాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత టీజీఎస్‌ఆర్టీసీలో స్థిరత్వం, ఉద్యోగుల సంక్షేమం, సేవల మెరుగుదలపై దృష్టి పెట్టాను. కొత్త బస్సులు, కొత్త రూట్లు, ఆధునిక సేవలు.. మహాలక్ష్మి స్కీమ్‌తో పాటు రవాణా రంగాన్ని మరింత ప్రజాకేంద్రంగా మలుస్తున్నాం. 9,384 బస్సులతో నడుస్తున్న ఆర్టీసీ, మహాలక్ష్మీ ప్రభావంతో 97 బస్ డిపోల్లో పూర్తి ఆక్యుపెన్సీ సాధించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షన్‌లు పెంచి, సంక్షేమాన్ని బలపరిచాం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు.
ప్రజల ఆశీర్వాదాలతో ఏర్పాటయిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీమతి సోనియాగాంధీ, రాహూల్‌గాంధీల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అద్దంపట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తోంది. ఈ కాలంలో మహిళలు, సామాన్య కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. దీర్ఘకాలికంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధానాలు, పథకాలను మా ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు సంక్షేమం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, బీసీల సంక్షేమం, అభివృద్ధి లాంటివి ప్రజల జీవితాల్లో అభివృద్ధికరమైన మార్పును తీసుకువచ్చాయి. మహాలక్ష్మీ పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.500కి గ్యాస్ అందిస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలుచేస్తున్నది. వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తోంది. మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా క్యాంటీన్‌లు... ఇలా ఎన్నో పథకాలు వారు ఆర్థిక వృద్ధిని సాధించేలా అమలుచేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చేసిన త్యాగమయ స్ఫూర్తితో ఆమె నాయకత్వంలో, ప్రజల కోసం, దేశం కోసం ఇక ముందూ మరింత నిబద్ధతతో, బాధ్యతతో, ప్రేమతో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సేవ చేస్తాం. శ్రీమతి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు – ఆమె స్ఫూర్తి ఎప్పటికీ మనకు మార్గదర్శకం!
పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News