Economic Impact of Bihars Labour Migration: విహార భూమిలో వలసల రగడ
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:12 AM
బిహార్ అంటే విహార భూమి. బుద్ధుడు విహరించిన నేల. రోజూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ కుల, మతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు ఇవ్వాలని బుద్ధుడు అవిశ్రాంతంగా బోధించిన జ్ఞానభూమి. మోక్షమైనా, నిర్వాణమైనా...
బిహార్ అంటే విహార భూమి. బుద్ధుడు విహరించిన నేల. రోజూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ కుల, మతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు ఇవ్వాలని బుద్ధుడు అవిశ్రాంతంగా బోధించిన జ్ఞానభూమి. మోక్షమైనా, నిర్వాణమైనా వ్యక్తి కృషి ద్వారానే లభిస్తుంది తప్ప గుడ్డి ఆరాధనతోనూ, యజ్ఞయాగాదులతోనూ రాదని బుద్ధుడు చెప్పింది బిహార్‌లోనే. మానవ విహారానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని రెండున్నర వేల ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన చోటే ఇప్పుడు వలసలు, విహారాలపై రాజకీయాలు చెలరేగుతున్నాయి. రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బిహార్‌లో వలసల సక్రమాలు.. అక్రమాల చుట్టూనే ప్రచారం కేంద్రీకృతం అవుతోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి, హోంమంత్రి ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గతంలో బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసలను ప్రధాన సమస్యగా చేసుకుని ప్రచారం హోరెత్తింది. ఇప్పుడు బిహార్ వంతు వచ్చింది.
వలసలు సక్రమం అయినవైనా, అక్రమం అయినవైనా బిహార్ వాటికి ప్రధాన గమ్యస్థానం కాదు. బిహార్ లోపలికి వచ్చే వారి కంటే పొట్ట చేతపట్టుకుని బయటకి వెళ్లే వారే ఎక్కువ. 1830 నుంచి ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. నితీశ్‌కుమార్ 2005లో బిహార్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అభివృద్ధిపరంగా అద్భుతం జరుగుతోందంటూ ప్రచారం సాగుతున్నప్పటికీ వలసలు పోయే ప్రజల శాతంలో ఆ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. ఎక్కడైనా ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు ఉన్నచోటకే ప్రజలు వలసలు కడతారు. అవి అంతంత మాత్రం ఉన్నచోటుకు వెళ్లటం సాధ్యంకాదు. బంగ్లా అక్రమ వలసదారులు బిహార్‌ను ముంచెత్తుతున్నారని చెప్పటానికి అంకెలు, ఆధారాల కంటే.. ఒక వర్గం ప్రజల వల్లే సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పటంలో రాజకీయ కోణమే కనిపిస్తోంది. ఆ వర్గాన్ని సంతృప్తిపరచే ధోరణితో రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్నాయని ఆరోపించటమూ కష్టం కాదు. కానీ అందుకు హేతుబద్ధమైన సమాచారాన్ని ఇవ్వటమే కష్టం! వలసల గురించి ప్రధానంగా మనకు లభ్యమయ్యే సమాచారం పదేళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల వల్లే వస్తుంది. వీటికి తోడు జాతీయ నమూనా సర్వే సంస్థ (నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్– ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అందించే గణాంకాల వల్ల కూడా వలసల సమాచారం దొరుకుతుంది. ఈ రెండు మూలాల నుంచి వచ్చే సమాచారంలో చాలా పరిమితులు ఉన్నాయని బిహార్ వలసలపై పరిశోధించిన అమ్రితాదత్తా (హైదరాబాద్–ఐఐటీ) ఆధారాలతో వివరించారు.
2001 జనాభా లెక్కల ప్రకారం 79 లక్షల మంది పనుల కోసం బిహార్ నుంచి వెలుపలకు వెళ్లారు. 2011 నాటికి ఆ సంఖ్య కొంత తగ్గి 74.5 లక్షలకు చేరుకుంది. ఇలా తగ్గటానికి 2008లో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణం. అసంఘటిత రంగంపై దీని ప్రభావం అధికంగా పడింది. కార్మికుల్లో అసంఘటిత రంగంలో ఉన్న వారే (85–90%) ఎక్కువ. బిహార్ వలస కార్మికులు అధికంగా ఉపాధి పొందేది ఈ రంగంలోనే. ఆనాటి ఆర్థిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే మన జీడీపీని పరిశీలిస్తే సరిపోతుంది. 2007–08లో మన జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటే ఆర్థిక సంక్షోభం వల్ల అది 6.7 శాతానికి పడిపోయింది. రెండున్నర శాతం జీడీపీ తగ్గిపోవటం మామూలు విషయం కాదు. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా బిహార్‌కు వలసలు కీలకంగా మారిపోయాయి. గ్రామీణ బిహార్‌లో ప్రతి అయిదుగురిలో ఒకరు వలస కార్మికుడిగా పనిచేసే వారే కనపడతారు. కొన్ని గ్రామాల్లో చేసిన సర్వేల్లో వలస కార్మికులు ఉన్న కుటుంబాలు 64.9 శాతం ఉన్నట్లు లెక్కలు తేలాయి.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రజలు వస్తున్నారు. దీన్ని కాదనలేం. సుదీర్ఘ సరిహద్దు ఉండటంతో పాటు వందల ఏళ్ల పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ, బాంధవ్యాలు వలసలను ప్రభావితం చేస్తున్నాయి. అక్రమంగా వలసలు వచ్చిన వాళ్లు ఎంతమంది అనటానికి ప్రభుత్వం దగ్గర లెక్కలు పక్కాగా లేవు. బిహార్‌కు సంబంధించి అదింకా నిజం. బిహార్‌లోని ఉద్యోగాలు, వనరులను బంగ్లా ముస్లింలు కొల్లగొడుతున్నారనటానికి అక్కడి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్వంత ప్రజలు ఎక్కువగా వలసలు పోయే పరిస్థితులు ఉన్నచోట అది సాధ్యమయ్యే పనికాదు. రాజకీయ ప్రచారానికి వాస్తవాలతో పని ఉండదు కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఓట్ల చోరీవల్లే అధికారాన్ని అందుకోలేక పోయామని రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రచారం కూడా ఒకరకంగా అలాంటిదే. ప్రచారాలకూ వాస్తవాలకూ ఎంతో దూరం ఉంటుందనటానికి అస్సాంలో పౌరుల జాతీయ పట్టిక (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్– ఎన్‌ఆర్‌సీ) వ్యవహారాన్ని చూస్తే అర్థం అవుతుంది. 1971 ముందు నుంచీ అస్సాంలో నివసిస్తున్నట్లుగా సాక్ష్యాధారాలు సమర్పించిన వారినే ఎన్‌ఆర్‌సీలో చేరుస్తామని ప్రకటించి ఆ మేరకు కసరత్తును అక్కడ పూర్తిచేశారు. 19.06 లక్షల మంది సాక్ష్యాధారాలను సమర్పించలేక పోయారు. అంటే అస్సాం జనాభాలోని 3.3 కోట్లమందిలో 6 శాతం మంది దగ్గర అవసరమైన పత్రాల్లేవు.
అట్లా లేని వారందరూ ముస్లింలే అయివుంటే అక్రమ వలసదారులందరూ ఆ వర్గం వారేనని చెప్పటానికి ఆస్కారం ఉండేది. పత్రాలను సమర్పించలేని వారి సమాచారాన్ని మతాలవారీగా ప్రకటిస్తే అసలు విషయం బయటపడేది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. వివిధ అనధికార అంచనాల ప్రకారం 12 లక్షల మంది హిందువులు (63%) సాక్ష్యాధారాలను సమర్పించలేక పోయారు. ఈ 12 లక్షల మందికీ పౌరసత్వాన్ని కల్పించటానికే పౌరసత్వ చట్టానికి 2019 డిసెంబర్‌లో సవరణను తీసుకువచ్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. మతాన్ని బట్టి పౌరసత్వాన్ని కల్పించటం రాజ్యాంగానికి విరుద్ధమైందని పేర్కొంటూ పెద్ద ఆందోళనలూ తలెత్తాయి. ముస్లింలు మినహా మిగతా భారతీయ మతాలకు ఆశ్రయమిచ్చే దేశమేదీ ప్రపంచంలో లేకపోవటంతో ఆ సవరణను చేపట్టామని ప్రభుత్వం సమర్థించుకున్నా, అది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పటానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దేశవిదేశాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. పత్రాల్లేని అస్సాం ముస్లింలకు పౌరసత్వం కల్పించటానికి ఇతర ముస్లిం దేశాలు ముందుకు రాకపోతే పరిష్కారం ఏమిటి అన్న దానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఏడు లక్షల మంది ముస్లింలను బంగ్లాదేశ్ అక్కున చేర్చుకుంటుదని కోరుకోవటం అత్యాశే అవుతుంది.
అస్సాంలోనే ఈ పరిస్థితి ఉంటే బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని రూపొందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం! బంగ్లా నుంచి తరలి వచ్చిన హిందువులందరూ అనుమతులన్నీ తీసుకుని భారత్‌లోకి అడుగుపెట్టారని చెప్పలేం. పత్రాల్లేని హిందువుల సంఖ్య అక్కడ చాలా ఎక్కువగా ఉండొచ్చు. బంగ్లాదేశ్‌లో 1951 నాటికి హిందువులు 92,39,603 మంది ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 1,31,30,109కి పెరిగింది. 1947 నుంచి దాదాపు కోటిమందికి పైగా హిందువులు భారత్‌కు దఫదఫాలుగా తరలివచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడూ, మతాల మధ్య వైషమ్యాలు పెరిగినప్పుడూ హిందువులు ఏదోరకంగా సరిహద్దులు దాటటానికే ప్రయత్నించారు. అందులో సఫలమైన వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. పక్షపాతం లేకుండా లెక్కలు తీస్తే పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపురల్లో చాలామంది పత్రాల్లేని వారు తేలతారు.
బిహార్‌లోకి అక్రమంగా వస్తున్న విదేశీ వలస కార్మికుల సంఖ్య ఎంతైనప్పటికీ ఆ సమస్యను రాజకీయంగా పెద్దది చేసే అవకాశం ఉండొచ్చు. కాదనలేం. కానీ అక్కడ నుంచి దేశవిదేశాల్లోని పలు ప్రాంతాలకు వలస కార్మికులుగా బిహార్ ప్రజలు ఎందుకు తరలివెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్న ప్రశ్నే కీలకమైంది. రబ్బరు, చెరకు తోటల్లో పనిచేయటానికి కరేబియన్, గుయానా, సొరినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఫిజీ, మారిషస్‌లకు ఒప్పందపు కూలీలుగా బిహారీలను 1830ల్లో తీసుకువెళ్లారు. ఆ తర్వాత కొన్నేళ్లకు అస్సాం టీతోటల్లో పనిచేయటానికీ తరలించారు. కలకత్తా కార్మిక అవసరాలకు బిహారీలు కావాల్సి వచ్చారు. వందేళ్లపాటు అస్సాం, బెంగాల్‌లకు బిహారీ కార్మికుల యాత్ర కొనసాగింది. కలకత్తా కేంద్రంగా నడిచిన పారిశ్రామిక అభివృద్ధి 1930ల్లో మందగించింది. అదే సమయంలో అస్సాం టీతోటల్లో పనికి గిరాకీ తగ్గింది. దాంతో తూర్పు దిక్కుకు బిహారీల వలసలు సన్నగిల్లాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతా బిహార్‌లో పారిశ్రామికాభివృద్ధి పెద్దగా జరగలేదు. ఉమ్మడి బిహార్‌లోని ఖనిజ సంపద దండిగా ఉన్నా దాన్ని సబ్సిడీ రేట్లకు ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావటంతో స్థానిక అవసరాలకు ఉపయోగించుకోలేక పోయారు. 1960, 1970ల నాటి సస్యవిప్లవమూ బిహార్‌లో ప్రభావమూ చూపలేదు. ఆ విప్లవం పుంజుకున్న పంజాబ్, హర్యానా ప్రాంతాలకు బిహారీలు వలస కార్మికులుగా తరలివెళ్లారు. విస్తరిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అవసరాలకు బిహారీలు పెద్దఎత్తున అవసరమయ్యారు. ముంబాయికీ వెళ్లారు. ఆ వలస కార్మికులను వ్యతిరేకిస్తూ, అడపాదడపా వారిపై దాడులు చేస్తూ, విద్వేషాన్ని చిమ్ముతూ శివసేన బలం పుంజుకుంది. ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత దక్షిణాదికీ బిహారీ వలసలు విస్తరించాయి. వలసలు గ్రామాల్లో చాలా మార్పులను తెచ్చాయి. 50శాతం పైగా ఆదాయాన్ని వలస కార్మికులు గ్రామాల్లోని కుటుంబ అవసరాలకు పంపుతున్నారు. కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి సాపేక్షికంగా మెరుగుపడింది. గ్రామాలతో పోల్చితే కుల ఆధిక్యతల అహంకారం లేని నగరాల్లో తమకు గౌరవప్రద జీవితం లభిస్తోందని బిహార్ వలసకార్మికులు భావిస్తున్నా చిట్టచివరికి సొంత చోటుకు చేరుకోవాలన్న తపన మాత్రం తగ్గటం లేదు. కుటుంబాలకు దూరంగా ఉండటం, అధికశ్రమతో ఆరోగ్యం దెబ్బతినటం, పని ప్రాంతంలో పరాయివారిగానే చూడటం వాళ్ల మనస్సులను సొంతూళ్ల వైపు లాగేలా చేస్తోంది. కరోనా సమయంలో కాలిబాట పట్టిన లక్షలాది వలసకార్మికులే దీనికి నిదర్శనం.
కార్మిక వలసల్లేకుండా, వారి శ్రమలేకుండా ఈనాటి ఆర్థిక వ్యవస్థ రథచక్రాలు కదలవు. వనరులనూ, ఉద్యోగాలనూ కొల్లగొడుతున్నారంటూ వలస కార్మికులకు మతం రంగు పూయటం, విదేశీముద్ర వేయటం వైమనస్యాలను పెంచటానికి మాత్రమే పనికివస్తుంది. ఎన్ని ముద్రలు వేసినా వలసకార్మికులు చిందించిన చెమటచుక్కల ప్రవాహాల నుంచే మన సంపదలు పెరుగుతున్నాయి. మన నగరాలు కళకళలాడుతున్నాయి. మన భవనాల్లో సొగసులు కుదురుకుంటున్నాయి.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News