Share News

Early Reading: కవి అక్షరాల్లో పాఠకుడు దృశ్యాన్ని చూడగలగడం గొప్ప అనుభూతి

ABN , Publish Date - Jul 07 , 2025 | 05:47 AM

ఒక పుస్తకం అని చెప్పలేను కానీ, నిజానికి బాల్యం నుండే నాలో పుస్తక పఠనంపై అమితాసక్తిని పెంచింది మాత్రం వివిధ పత్రికల సండే మ్యాగజైన్స్. ఏ ఒక్క మ్యాగజైన్‌నూ విడిచి పెట్టకుండా చదివేవాడిని...

Early Reading: కవి అక్షరాల్లో పాఠకుడు దృశ్యాన్ని చూడగలగడం గొప్ప అనుభూతి

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

ఒక పుస్తకం అని చెప్పలేను కానీ, నిజానికి బాల్యం నుండే నాలో పుస్తక పఠనంపై అమితాసక్తిని పెంచింది మాత్రం వివిధ పత్రికల సండే మ్యాగజైన్స్. ఏ ఒక్క మ్యాగజైన్‌నూ విడిచి పెట్టకుండా చదివేవాడిని. అందులో వచ్చే కథలను కట్ చేసి దాచిపెట్టుకునే వాడిని. టీనేజ్‌లో యండమూరి ‘యుగాంతం’ నవల చదవడం గుర్తుంది. నేను అత్యంత ఇష్టంగా చదివిన మొదటి నవల అదే. ఆ నవలలోని పాత్రలూ సన్నివేశాలూ ఇంకా గుర్తున్నాయి. ఆ నవల చదివి ‘ప్రాక్సిమా సెంటారీ’ అనే నక్షత్రం గురించి అప్పటి మా స్కూల్ టీచర్ సుజాత నాంపల్లి (కవయిత్రి) గారిని అడిగి తెలుసుకున్న జ్ఞాపకం ఇప్పటికీ మెదులుతుంది.

మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?

టీనేజ్‌ కథలు, నవలలు విరివిగా చదివే అలవాటుండేది. ఎప్పుడైతే కవితలు రాయడం మొదలయ్యిందో నన్ను నేను ఇంకాస్త సానబెట్టుకునే క్రమంలో, సమకాలీన కవులు కవిత్వాన్ని రాసే విధానాన్ని గమనిస్తూ, వస్తు ఎంపిక, శైలి, వాక్య నిర్మాణం ఇలాంటి వాటిపై అధ్యయనానికి ఉపయోగపడే పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నాను.


ముస్లిం అస్తిత్వవాద కవిత్వపరంగా మీపై ఉన్న ప్రభావాలు ఏమిటి?

ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’ కవితా సంపుటి నుంచి ఇటీవల స్కై బాబా సంపాదకత్వంలో వచ్చిన ‘దర్ద్’ సంకలనం వరకూ అనేక విపత్కర పరిస్థితుల్లోనూ అణచివేతపై తిరుగుబాటుగా రావాల్సిన మేరకు సాహిత్యం వచ్చిందనే భావిస్తున్నాను. నేను కవిత్వం రాసే ప్రారంభ దశలో ఈ ప్రభావం నాపై చాలా ఉండేది, ఆ స్ఫూర్తి తోనే ‘నాపై ఎందుకీ కక్ష...?’, ‘బహిరంగ రహస్యం’ లాంటి కవితల్ని రాయగలిగాను. ముస్లిం అమ్మలపై ప్రముఖ కవి అన్వర్ సంపాదకత్వంలో వచ్చిన ‘అమ్మీజాన్’ అనే ముస్లింవాద కవిత్వ సంకలనానికి ప్రేరణ నా కవిత ‘అమ్మీజాన్’ అని తెలిసినప్పుడు, ఆ విధంగా నేనూ ఎంతోకొంత ముస్లిం వాద కవిత్వంలో భాగమైనందుకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ వివక్షను ఎండగడుతూ, పీడకుల్ని వ్యతిరేకించండ తోనే సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పలేం అనే విషయం త్వరగానే అవగతమైంది. మతాల మధ్య సఖ్యత, మనుషుల మధ్య మమకారాలు చిగురించాలంటే భయాలు, అభద్రతను పక్కకునెట్టి, విద్వేషగాలులు ఎప్పుడూ లేనంత బలంగా వీస్తున్న ఈ తరుణంలోనూ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే, సమాజంలో సోదర భావాన్ని, లౌకికత్వాన్ని పెంచే దిశగా కలాలు కదలాల్సిన సందర్భమిది.

ఏ తరహా కవిత్వం మీకు నచ్చుతుంది? మీరు ఎక్కువసార్లు చదువుకున్న కవిత్వ సంపుటి?

తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సునిశితంగా పరిశీలిస్తూ, ప్రతిస్పందనగా తన భావోద్వేగాలను సృజనాత్మకంగా ప్రకటించే సందర్భంలో కవి రాసిన అక్షరాల్లో పాఠకుడు దృశ్యాన్ని చూడగలగడం ఒక గొప్ప అనుభూతి. అలాంటి కవిత్వానికి నేను త్వరగా ఆకర్షితుడినవుతాను. సరళమైన పదాల్లోనే లోలోపలి సంఘర్షణను తాత్వికంగా వ్యక్తపరిచే కవిత్వంతో పాటు, చూస్తున్న, అనుభవిస్తున్న జీవితాలను లయాత్మకంగా వర్ణించగలిగే కవిత్వం నాకు బాగా నచ్చుతుంది.

సుంకర గోపాలయ్య ‘మా నాయిన పాట’ పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివిన జ్ఞాపకముంది.


మీరు తరచు మననం చేసుకునే కవిత్వ పంక్తులు?

ఈ ప్రశ్న చదివిన వెంటనే మదిలో మెదిలిన కవిత– అఫ్సర్ రాసిన ‘అసమ్మతి వాచకం’. ఐదున్నరేళ్ళ క్రితం ‘వివిధ’లో అచ్చయిన ఈ కవితను కట్ చేసి పేపర్ ముక్కను నా పర్సులో దాచుకున్నాను. కాస్త నిరుత్సాహంగా అనిపించిన ప్రతిసారీ ఈ కవితను తీసి చదువుకోవడం అలవాటు. ఐదు భాగాలుగా సాగే ఈ కవిత, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా బతికి, విజయాన్ని సాధించాలనే కాంక్షను రేకెత్తిస్తుంది. కవితలోని ఈ వాక్యాలు తరచుగా గుర్తొస్తూ ఉంటాయి: ‘‘నడుస్తూ, నడుస్తూ పడిపో, దెబ్బ తగల్నే లేదని సంతోషిస్తూ కూర్చోకు, ఇంకాసింత దూరం నడిచి ఈసారి కచ్చితంగా దెబ్బ తగిలేట్టే పడిపో... పడిపోవడంలోని భయం అనేదొకటి ఉందే, దాని కళ్ళల్లోకి పది చూపుల బాణాలు వదులు.’’

(జాబేర్ పాషా తొలి కవితా సంపుటి

‘అగరు ధూపం, ఊదు పొగ’ ఇటీవల విడుదలైంది)

95730 43596

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 05:47 AM