Share News

Telangana Liberation Day: నాటి ప్రజాపోరాటానికి మతం రంగు పులమొద్దు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:28 AM

దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్య్రం రాగా తెలంగాణ (ఆనాటి హైదరాబాద్‌ సంస్థానం) భారతదేశంలో 1948 సెప్టెంబర్‌ 17న విలీనమైంది. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా నిజాం నవాబు ప్రకటించుకున్న నేపథ్యంలో, అప్పటికే ఫ్యూడల్‌ ప్రభువులకు...

Telangana Liberation Day: నాటి ప్రజాపోరాటానికి మతం రంగు పులమొద్దు

దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్య్రం రాగా తెలంగాణ (ఆనాటి హైదరాబాద్‌ సంస్థానం) భారతదేశంలో 1948 సెప్టెంబర్‌ 17న విలీనమైంది. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా నిజాం నవాబు ప్రకటించుకున్న నేపథ్యంలో, అప్పటికే ఫ్యూడల్‌ ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా కామ్రేడ్‌ బద్దం ఎల్లారెడ్డి, ఆంధ్రమహాసభ అధ్యక్షులు కామ్రేడ్‌ రావి నారాయణరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కామ్రేడ్‌ మఖ్దూం మొహియుద్దీన్‌లు సంయుక్తంగా నిజాం నవాబు పాలన నుంచి విముక్తి, భారతదేశంలో విలీనంకై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 1947 సెప్టెంబర్‌ 11న పిలుపునిచ్చారు. వీరోచిత పోరాట ధాటికి నిజాం సైన్యం, అలాగే నిజాం ప్రైవేట్‌ సైన్యమయిన రజాకార్లు కకావికలమయ్యారు. అంతిమంగా 1948 సెప్టెంబర్‌ 17న 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అప్పటి కేంద్రమంత్రి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ యథాతథ ఒప్పందం చేసుకొని హైదరాబాద్‌ ‍స్టేట్‌ను భారతదేశంలో విలీనం చేసారు. అలా ప్రపంచ పోరాట చరిత్రలో స్థానం సాధించుకున్న సెప్టెంబర్‌ 17వ తేదీని విలీన దినంగా అధికారికంగా జరపాలని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ప్రజల కోరికను ఎందుకు తిరస్కరిస్తున్నామో సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది.

నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ ప్రభువుల అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం– మాతృభాష కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన తిరుగుబాటు. ‘‘బాంచన్‌ దొర కాల్మొక్త’’ అన్న వెట్టి మనిషి బందూకులు పట్టిన కమ్యూనిస్టు పోరాటమది. హైదరాబాద్‌ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దాదాపు 90శాతం హిందువులే. వారు నిజాం నవాబుకు గులాములుగా వ్యవహరించడమేగాక నిజాంను మించిన దౌర్జన్యాలు చేశారు. అనేకమందిని ఊచకోత కోయడం, మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించడం, బతుకమ్మలు ఆడించడం, మానభంగాలు చేయడం లాంటి క్రూరమైన నేరాలను చేసిన జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లలో హిందువులూ ఉన్నారు, ముస్లిములూ ఉన్నారు. విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఇంకా అనేక సంస్థానాధిపతులు హిందువులే.


అదే విధంగా నిజాం రాజు ముస్లిం అయినప్పటికీ పేద ముస్లింల జీవితాలలో ఎటువంటి మార్పూలేదు. తెలంగాణలో భూస్వామ్య ముస్లింలు కేవలం 2000 కుటుంబాలే కాగా పేద ముస్లింలు లక్షలాది మంది ఉన్నారు. అందులో 20 లక్షల మంది హైదరాబాద్‌ నగరంలో కడుపేదరికంలో ఉండేవారు. తలారి, గ్రామసేవకులు వంటి అతి స్వల్ప ఆదాయాలతో కూడిన ఉద్యోగాలు, మెకానిక్‌ పనులు, హోటల్‌ పనులు, పంక్చర్లు వేయడం, టైలరింగ్‌, కూరగాయలు, పండ్లు అమ్మడం వంటి అతి తక్కువ ఆదాయాలతో కూడిన పనుల్లో ఉండేవారు. గ్రామాలలో సెంట్‌ భూమి కూడా లేని వారు కూడా ఉన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా చిత్రహింసలకు గురికాబడ్డారు. షేక్‌ బందగీని విసునూరు రాంచంద్రారెడ్డికి చెందిన గుండాలు చంపివేశారు. ప్రఖ్యాత జర్నలిస్టు షోయబుల్లాఖాన్‌ను హైదరాబాద్‌ నడిబజారులో రజాకార్లు క్రూరంగా చంపారు. ఈనాటి ఖమ్మం జిల్లా ఆనాటి వరంగల్‌ జిల్లాలో రజబ్‌ అలీ లాంటి యోధులు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. డాక్టర్‌ రాజ్‌ బహుద్దూర్‌ గౌర్‌తో కలిసి మఖ్దూం మొహియొద్దీన్‌, ప్రొ.అల్లంకుంద్‌ మీరీ, జవ్వాజ్‌ రజ్వీ (సాలార్జంగ్‌ మ్యూజియం ఆనాటి లైబ్రేరియన్‌), ప్రొ. ఖయ్యూం ఖాన్‌ లాంటి అనేక మంది ముస్లిం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్‌ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశారు. మహ్మద్‌ రఫీ ఉస్మానియా యూనివర్సిటీలో నిజాంకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగానున్న అల్లా ఉద్దీన్‌ని నిజాం మూకలు చంపివేశాయి. ఇలా ఎంతోమంది ముస్లింలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. చిత్రహింసలకు, హత్యలకు గురయ్యారు.


ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద రైతాంగం జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముస్లింల, హిందువుల పోరాటంగా చిత్రీకరించడం ఆ సమష్టి త్యాగాల చరిత్రను అవమానపర్చడమే. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం చేసిన పోరాటంలో అణగారిన ముస్లిమైనా, హిందువైనా అన్నదమ్ములే. అణచివేసే ఫ్యూడల్‌ ప్రభువులు హిందువైనా, ముస్లిమైనా వారి వర్గమూ, వర్గస్వభావమూ ఒక్కటే. ఆనాటి పోరాటంలో ఇసుమంత పాత్ర లేని ఆరెస్సెస్‌ గానీ, ఈనాటి బీజేపీ గానీ ఇటువంటి మహోజ్వల పోరాట చరిత్రకు మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓట్ల రాజకీయాల నేపథ్యంలో చరిత్రను వక్రీకరిస్తున్నాయి. ఆరెస్సెస్‌–సంఘ్‌ పరివార్‌లు 1925 నుంచి 1947 వరకు ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరెస్సెస్‌ ఊసే లేదు. నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జాతీయ పతాక ఆవిష్కరణకు కూడా 2001 జనవరి 26 వరకు ఆరెస్సెస్‌ పెద్దలు ఏనాడూ అంగీకరించలేదు. మూడు అనే పదం అశుభానికి సంకేతమని మూడు రంగులతో కూడిన జాతీయ జెండా దేశానికి అరిష్టమని వాదించారు. ఆనాడు మతాలు, కులాలతో సంబంధం లేకుండా అంతా ఒక్కటై చేసిన మహత్తర పోరాటానికి అటువంటి ఆరెస్సెస్, దాని ప్రతినిధి అయిన బీజేపీలు నేడు మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నాయి. రజాకార్ల దాడుల్లో హిందూ పురుషులను ముస్లిం మహిళలు, అలాగే ముస్లిం పురుషులను హిందూ మహిళలు కన్నతల్లులు బిడ్డలను కాపాడుకున్నట్లుగా కాపాడిన ఘటనలు ఉన్నాయి. అన్నదమ్ముల్లా కలిసి అన్ని మతాలవారు జరిపిన వీరోచిత పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైనా దేశభక్తులు ఎలా అవుతారు? ముస్లిం రాజు అయిన నిజాం నవాబు రాజ్యాన్ని పటేల్‌ సైన్యం ఓడించి విమోచన చేసినట్లుగా వాదిస్తూ ఈ పోరాటాన్ని ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు జరిగిన పోరాటంగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.

ప్రజా కంటకులైన ఒక రాజును యుద్ధంలో ఓడిస్తే అతనిని యుద్ధ ఖైదీగా చూడాలి. అలా గాకుండా నాడు నిజాం నవాబుకు రాజ్‌ప్రముఖ్‌గా హోదా కల్పించడంతోపాటు సంవత్సరానికి కోటి రూపాయల రాజభరణాన్ని ఇస్తూ పటేల్‌ సైన్యం నిజాం రాజుతో ఒప్పందం చేసుకున్నది. వేలాది మందిని ఊచకోత కోసిన రజాకార్ల నాయకుడైన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కి వెళ్ళిపోయే విధంగా అనుమతించింది. ఇలాంటి పరిణామాలు నిజాం రాజు, నాటి ప్రభుత్వం కుమ్మక్కు అయిన్నట్లుగా సూచిస్తున్నాయి. అటువంటిది– అప్పుడు యుద్ధం జరిపి విమోచన సాధించినట్లు ఎలా బీజేపీ వాళ్ళు పేర్కొంటారు? గాంధీజీని హత్యచేసిన ఆరెస్సెస్‌ను నిషేధించిన సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ను కూడా బీజేపీ హైజాక్‌ చేస్తున్నది.


సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండి, నేడు కర్ణాటకలో భాగమైన కల్యాణ కర్ణాటక, మరఠ్వాడా ప్రాంతాలలో హైదరాబాద్‌ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలే ఎప్పటి నుంచో అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2021 సంవత్సరం నుంచి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు. ఈనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రజా పాలన దినోత్సవం పేరిట పోరాట స్మృతులను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నది. సెప్టెంబర్‌ 17ను కచ్చితంగా అధికారికంగా విలీనం లేక మహత్తర రైతాంగ పోరాటం పేరుతో జరపవలసిన బాధ్యత ఈనాటి కాంగ్రెస్‌పై ఉన్నది.

కూనంనేని సాంబశివరావు

శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 01:28 AM