Andhra Pradesh Districts: జిల్లాల ఏర్పాటు ఎవరికోసం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:49 AM
జగన్ ప్రభుత్వం 2021 చివరలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలను 13 నుంచి 25కు పెంచింది. అయితే జగన్ చేసిన జిల్లాల ఏర్పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించింది. దానికి ప్రధాన కారణం భౌగోళిక స్థితిని బట్టి కాక లోక్‌సభ సభ్యుల ఏరియాను బట్టి...
జగన్ ప్రభుత్వం 2021 చివరలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలను 13 నుంచి 25కు పెంచింది. అయితే జగన్ చేసిన జిల్లాల ఏర్పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించింది. దానికి ప్రధాన కారణం భౌగోళిక స్థితిని బట్టి కాక లోక్‌సభ సభ్యుల ఏరియాను బట్టి జిల్లాలు ఏర్పాటు చేయడం. ఎంపీల జిల్లా పరిధి ఒకే విధంగా ఉంటే ఎంపీలు, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అన్న భావనతో ఏర్పాటు చేసినట్టు జగన్ ప్రభుత్వం చెప్పుకుంది. జిల్లాల ఏర్పాటు ప్రజల కోసమా లేకపోతే ఎంపీలు, కలెక్టర్ల కోసమా? వీరిద్దరూ ఉన్నది ప్రజలకోసం అన్నది ఆ ప్రభుత్వం ఆలోచించలేదు. రేపు లోక్‌సభ సీట్లు పెరిగితే మళ్లీ జిల్లాల పరిధి మారుస్తారా! ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల్లో కొన్ని మార్పులు, కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ క్రమంలో ఒక అసెంబ్లీ స్థానం రెండు జిల్లాల్లో వచ్చినా ఫరవాలేదు. ప్రస్తుతం జగ్గంపేట అసెంబ్లీ, అలాగే అనపర్తి నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికార్లతో ఎంపీ, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవడం సమస్యే కాదు. అసలు ప్రజాసమస్యలు 90 శాతం మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. అలాంటప్పుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే... కలెక్టర్, ఇతర అధికారులతో పనుల కోసం పదే పదే కలిసే పని ఏముంది? భౌగోళిక స్థితి, ప్రజలకు అందుబాటు అనేది జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల సౌలభ్యం ప్రాతిపదికగా చర్య తీసుకోవాలి. కొన్ని విస్తీర్ణం రీత్యా చిన్న జిల్లాలు అయినా ఫరవాలేదు. ఈ సందర్భంగా కొన్ని పట్టణాలు/ప్రాంతాలు ప్రాతిపదికగా ఈ క్రింద పేర్కొన్న కొత్త జిల్లాల ఏర్పాటుకు పరిశీలించమని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి. 1. రంపచోడవరం కేంద్రంగా మరొక ఏజెన్సీ జిల్లా, 2. జంగారెడ్డిగూడెం కేంద్రంగా జిల్లా (గోదావరికి పశ్చిమాన ఉన్న ఏజెన్సీ మండలాలు కలిపి), 3. మార్కాపురం కేంద్రంగా జిల్లా, 4. నాయుడుపేట కేంద్రంగా జిల్లా.
మారిశెట్టి జితేంద్ర, రాజమహేంద్రవరం
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News