Devanahalli Farmers Protest: దేవనహళ్లి రైతుల విజయం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:59 AM
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా ఉండే దేవనహళ్లి తాలూకాలోని, చెన్నరాయపట్న మండలంలోని 13 గ్రామాల్లో ఏరో స్పేస్ పార్కు (వైమానిక ఆవరణ ప్రాంగణం) రెండోదశ నిర్మాణం కోసమని...
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా ఉండే దేవనహళ్లి తాలూకాలోని, చెన్నరాయపట్న మండలంలోని 13 గ్రామాల్లో ఏరో స్పేస్ పార్కు (వైమానిక ఆవరణ ప్రాంగణం) రెండోదశ నిర్మాణం కోసమని చెబుతూ ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు’ (KIADB) ద్వారా 1777 ఎకరాల సాగుభూమిని సేకరించటానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO), కర్ణాటక ప్రభుత్వం రెండూ కలిసి మొదటి దశ ఏరో స్పేస్ పార్కును దేవనహళ్లిలో స్థాపించాయి. ఇప్పటికే ఏరో స్పేస్ పార్కు మొదటి భాగానికి, ఫోక్సో కంపెనీకి, అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయానికి, బెంగళూరు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకున్నారు. అభివృద్ధి కోసం రైతులు మరిన్ని త్యాగాలు చేయాలని 2021 ఆగస్టులో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బీఆర్ బొమ్మై ప్రభుత్వం ఎయిరో స్పేస్ పార్క్ రెండవ భాగం నిర్మాణం కోసం భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనికి వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతులు ‘భూ స్వాధీన విరోధి హోరాట సమితి’ పేరు మీద సమీకృతులై వివిధ వామపక్ష రైతు సంఘాల, ప్రజాస్వామ్యవాదుల సహాయ సహకారాలతో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఈ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోలీసులు రైతుల మీద వందల కొద్దీ క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి, కళాకారుల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. ప్రకాశ్‌రాజ్ లాంటి సినీనటులు రైతులకు మద్దతుగా నిలబడ్డారు. రైతాంగ సమస్యలపై నిరంతరం ఆందోళన చేస్తున్న, మాధవరెడ్డి నాయకత్వంలో ఉన్న AIKMKS అనుబంధ కర్ణాటక రాజ్య రైతు సంఘం రైతులు ఆందోళన చేస్తున్న చెన్నరాయపట్న ధర్నా స్థలం నుంచి పాదయాత్ర చేపట్టి, రైతులంతా మరింత పట్టుదలతో నిలబడాలని కోరింది. రైతులు విజయం సాధించే వరకు 1,198 రోజులు వివిధ దశలలో సాగించిన పోరాటానికి వివిధ రైతుసంఘాలతో కలిసి అండగా నిలబడింది.
ఆగస్ట్ 2021లో ఏరో స్పేస్ పార్కు రెండవ దశ కోసం భూసేకరణకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వం నుంచి అధికారిక నోటీసులు జనవరి 2022 తొలి వారంలో వచ్చాయి. ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాల్సిన గ్రామసభలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించలేదు. 2022 జనవరి చివరలో, కేఐఏడీబీ జారీ చేసిన నోటీసులను తగలబెట్టడంతో రైతులు తమ నిరసనను ఆరంభించారు. ఫిబ్రవరిలో చెన్నరాయపట్న నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. 2022 ఆగస్టు 15న పోలీసులు జరిపిన లాఠీచార్జీలో రైతులు గాయపడ్డారు. 2022 సెప్టెంబర్ 15న బెంగళూరు ఫ్రీడం పార్క్ దగ్గర రైతులు ధర్నా చేశారు. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతులు తమ నిరసనోద్యమాన్ని బెంగళూరుకు మార్చుకొన్నారు. 2023లో తాము అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఏరోస్పేస్ పార్క్ రెండవదశ భూసేకరణను ఆపు చేస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్య దేవనహళ్లి రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోకపోవటంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు.
2025 జూన్‌లో సిద్ధరామయ్య ప్రభుత్వం భూముల కోసం రైతులకు ఇచ్చిన చివరి నోటిఫికేషన్ తరువాత, ఈ పోరాటం పెద్ద మలుపు తీసుకొన్నది. సంయుక్త హోరాట కమిటీ ఇచ్చిన ‘చలో దేవనహళ్లి’ పిలుపులో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు క్రూరమైన అణచివేతను ప్రయోగించారు. ముఖ్యమంత్రితో రెండు సమావేశాలు జరిగి, పోరాటం తీవ్రమవుతున్న దశలో ఈ నిర్బంధం జరిగింది. భూసేకరణను రద్దు చేయటం వలన వచ్చే న్యాయపరమైన అడ్డంకుల గురించి తెలుసుకోవటానికి 10 రోజుల సమయం కావాలని జూలై 4న జరిగిన మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కోరారు. అయితే ‘ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్’ (AILAJ) కలగజేసుకొని, దేవనహళ్లి భూసేకరణ విషయంలో ఒక వివరణాత్మక ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం, భూసేకరణను ఆపటానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని స్పష్టంగా ప్రకటించింది.
రైతులు దీర్ఘకాలికంగా సాగిస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించటానికీ, వారి ఐక్యతను భగ్నం చేయటానికీ, ప్రలోభ పెట్టటానికి అధికారపక్ష నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. తమ భవిష్యత్తుకు మూలమైన భూమిని వదులుకోలేమని, ప్రభుత్వం ఎరచూపిన తాయిలాలను రైతులు తిప్పికొట్టటంతో చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. జూలై 15న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భూసేకరణను వెంటనే ఆపివేయాలని అధికారులను ఆదేశించక తప్పలేదు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేయటంలో పాలక పార్టీలు పోటీపడి అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను పెంచి పోషిస్తున్నాయి. ఆ విధానాలలో భాగంగానే గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను దగా చేయాలని చూసినా, మూడు సంవత్సరాలు తమ భూముల కోసం రాజీలేని పోరాటం చేసి, రైతులు విజయం సాధించారు. అయితే ఇది తాత్కాలిక విజయం మాత్రమే. ఈ విజయం వెలుగులో కర్ణాటక రైతులు బడా కార్పొరేట్ శక్తుల నుంచి తమ భూముల రక్షణ కోసం మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలి.
కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి రైతుల భూ పోరాటం దేశవ్యాప్తంగా అక్రమ భూసేకరణలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాలకు ఉద్యమ స్ఫూర్తిని, ఉత్తేజాన్ని అందిస్తున్నది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాలను సోలార్ విద్యుత్తు పరికరాల తయారీ కోసం అప్పజెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా రైతాంగం సాగిస్తున్న పోరాటానికి దేవనహళ్లి రైతుల విజయం స్ఫూర్తినిస్తున్నది.
ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News