Share News

Suryapet Naming Issue: బీఎన్‌రెడ్డి సూర్యాపేటగా మార్చాలి

ABN , Publish Date - Nov 19 , 2025 | 02:03 AM

నల్లగొండ జిల్లాలో పేరుగాంచిన ఎస్సారెస్పీ ఫేజ్‌–2 ప్రధాన కాలువకు మాజీమంత్రి దివంగత ఆర్.దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని పలువురు (ముఖ్యంగా...

Suryapet Naming Issue: బీఎన్‌రెడ్డి సూర్యాపేటగా మార్చాలి

నల్లగొండ జిల్లాలో పేరుగాంచిన ఎస్సారెస్పీ ఫేజ్‌–2 ప్రధాన కాలువకు మాజీమంత్రి దివంగత ఆర్.దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని పలువురు (ముఖ్యంగా వీర తెలంగాణ పోరాటంలో భాగస్వాములైన వారు, వారి వారసులు, వామపక్షాల కార్యకర్తలు) కోరుతున్నారు. 2008, మే 9 నాటి భీమిరెడ్డి నరసింహారెడ్డి సంస్మరణ సభలో నాటి మంత్రులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అయితే, ఆ కాలువకు దామోదర్‌రెడ్డి పేరు పెట్టాలని ఇప్పుడు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ప్రత్యామ్నాయంగా ‘కొత్త జిల్లా అయిన సూర్యాపేటకు బి.ఎన్ పేరు పెట్టండి’ అని ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా పని చేశారాయన. తాగు, సాగు నీటి కోసం చట్టసభలలో పోరాటం చేశారు. అందులో భాగమే ఎస్సారెస్పీ కాలువ సాధన.

భీమిరెడ్డి నర్సింహారెడ్డి దళితుల్లో దళితుడిగా ఉన్నారు. బీసీల్లో బీసీగా ఉన్నారు. మట్టి మనుషుల్లో చెమట చుక్కలా ఉన్నారు. తానే బహుజనమయ్యారు. తాను పుట్టి పెరిగిన నల్లగొండ జిల్లా తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కోసం అంతులేని పోరాటం చేశారు. శ్రీరాంసాగర్ వరద కాలువ నీటితో సూర్యాపేట ప్రాంతంలోని లక్షలాది ఎకరాల బీళ్ల నోళ్లు తడపాలని పట్టుదలతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి పథకం సిద్ధం చేయించారు. ఈ నీటి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందేవారు కూడా బహుజనులే. ఈ మహానాయకుని గురించి పాఠ్యపుస్తకాల్లో ఎలాగూ ఉమ్మడి పాలకులు రాయలేదు. తెలంగాణ అనంతరం కూడా అలాంటి ఆలోచన చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఎస్సారెస్పీ కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ విషయమై క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఆయన పోరాట కేంద్రం అయిన సూర్యాపేట జిల్లాకు బి.ఎన్ పేరు పెట్టి గౌరవించాలి. ఈ డిమాండ్లతో నేడు ఇందిరాపార్క్‌ వద్ద ఉదయం 10 గం.లకు ధర్నా నిర్వహిస్తున్నాం.

ప్రొఫెసర్ కే. విద్యాసాగర్‌రెడ్డి,

మిజోరం యూనివర్సిటీ

ఈ వార్తలు కూడా చదవండి..

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 02:03 AM