Cooperative Federalism: సహకార స్ఫూర్తితోనే దేశ శ్రేయస్సు
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:45 AM
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తొక్కి పెట్టడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానిపై భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు లేఖ రాయడం వంటివి ఇటీవల కేంద్ర–రాష్ట్ర సంబంధాలను...
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తొక్కి పెట్టడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానిపై భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు లేఖ రాయడం వంటివి ఇటీవల కేంద్ర–రాష్ట్ర సంబంధాలను మరోసారి చర్చనీయాంశం చేశాయి. ఈ వివాదాన్ని మరింత పెంచాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశమంతా రాజకీయాలకు అతీతంగా, ఐక్యంగా నిలబడింది. కానీ కశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి జరిపిన సమీక్షా సమావేశానికి మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకపోవడం ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న విలువ’కు అద్దం పడుతోంది. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలు కావాలంటే ఏకీకృత మార్కెట్, జీఎస్టీ ఏక పన్ను వంటి కేంద్రీకృత విధానాలు అవసరం. రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అవలంబించడం వీటి అమలుకు ప్రతిబంధకంగా ఉంటుంది.
కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విభేదాలతో కాకుండా సహకారంతో పనిచేయాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థ అయినా, అమెరికా, కెనడా వంటి క్లాసికల్ ఫెడరల్ వ్యవస్థలతో పోలిస్తే భిన్న స్వభావం కలిగి ఉంది. ఇది సహకార ఫెడరలిజం అనే భావనపై ఆధారపడినా, ఆచరణలో కేంద్రాధిపత్యంగా మారింది. ఈ కారణంగా కాలక్రమంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో విభేదాలు, వివాదాలు, ఆర్థిక అసమానతలు, గవర్నర్ల రాజకీయ పాత్ర వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నేడు రాష్ట్రాల అభివృద్ధి ప్రాధాన్యాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలను సంప్రదించకుండానే వాటి పరిధిలోని సహకార రంగం, ఉమ్మడి జాబితాలోని విద్య, వైద్యం వంటి రంగాలలో ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది. అంతర్ రాష్ట్ర మండలి అటకెక్కింది. ప్లానింగ్ కమిషన్ రద్దయి, దాని స్థానంలోని నీతీ ఆయోగ్ పూర్తిగా ఏకపక్ష సంస్థగా రూపుదిద్దుకుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే పథకాలకు కేంద్ర నిధులు నిలిపివేయడం లేదా రాజకీయ ప్రేరణతో ఆలస్యం చేయడం వంటివి సాధారణమయ్యాయి. రాజ్యాంగంలోని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, నీతీ ఆయోగ్ సాయంతో వచ్చే నిధుల పంపిణీ పక్షపాత ధోరణితో ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తాము ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నా, తమకు కేంద్రం నుంచి తక్కువ నిధులు వస్తున్నాయని విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల అధికారాలను నామమాత్రం చేసి, మోదీ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ ప్రతి అయిదేళ్లకోసారి కేంద్ర–రాష్ట్ర ఆదాయాన్ని పంచుతుంది. జనాభా ఆధారంగా దీనిని పంచడంతో, జనాభా నియంత్రణ పటిష్ఠంగా పాటించిన తమకు నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో రాష్ట్రాల వాటాను మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా పెంచడం వల్ల పేద రాష్ట్రాలకు భారమవుతోంది. జీఎస్టీ పరిహారం నిలిపివేయడం కూడా రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రంపై ప్రభావం చూపుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్‌ఐఏ వంటి కేంద్ర సంస్థలు రాష్ట్ర అనుమతి లేకుండా దర్యాప్తులు, అరెస్టులు చేయడం ద్వారా రాజకీయ దుర్వినియోగం జరుగుతోంది.
గవర్నర్ పదవిని రాజ్యాంగం ‘రాష్ట్ర నామమాత్ర ప్రధాన అధికారి’గా పేర్కొన్నప్పటికీ, వాస్తవంలో అది కేంద్రానికి అనుబంధమైన రాజకీయ సాధనంగా మారింది. కేంద్రం నియమించిన గవర్నర్, చాలాసార్లు ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తూ పనిచేస్తున్నారు. బిల్లులను దీర్ఘకాలం అడ్డుకోవడం, సభలో మెజారిటీ నిరూపణపై జోక్యం, ప్రభుత్వం ఏర్పాటు, రద్దు విషయాల్లో రాజకీయ ప్రభావం వంటి వివాదాస్పద నిర్ణయాలకు గవర్నర్లు కేంద్రంగా మారారు. ఇటీవల తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో ఇటువంటి ఉదాహరణలు కనిపించాయి.
రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండేలా గవర్నర్లను నియమించాలని, రాజకీయ నియామకాలు తగ్గించాలని 1983లో సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. కానీ అవి ఆచరణలోకి రాలేదు. తరువాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పుంచీ సారథ్యంలో ఏర్పడిన కమిషన్ 2010లో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో దాదాపు 273 సిఫార్సులు చేసింది. నేటి సమస్యకు అవి పరిష్కారం చూపుతాయి.
ఆ సిఫార్సుల ప్రకారం... గవర్నర్ నియామకానికి, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. గవర్నర్‌ను ‘కేంద్ర ప్రతినిధి’గా కాకుండా రాష్ట్ర రాజ్యాంగ అధికారిగా చూడాలి. జాతీయ భద్రత, ఉగ్రవాదం, అంతర్గత భద్రత వంటి అంశాలపై కేంద్ర–రాష్ట్రాల సహకారం బలపరచాలి. అంతర్రాష్ట్ర మండలిని స్థిరమైన సంస్థగా చేయాలి. ఇది కేంద్ర–రాష్ట్రాల మధ్య సమన్వయ వేదికగా ఉపయోగపడాలి. దీని సమావేశాలు క్రమబద్ధంగా జరగాలి. ఆర్థిక వనరుల పంపకాన్ని న్యాయంగా చేయాలని, రాష్ట్రాలకు మరింత పన్నుల వాటా ఇవ్వాలని ఈ కమిషన్ సూచించింది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, ప్రాంతీయ అసమానతల దృష్ట్యా పునఃపరిశీలన చేయాలి. కేంద్ర పథకాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచాలి. కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం తప్పనిసరని పేర్కొంటూ, ఉగ్రవాదం, వలసలు, జాతీయ భద్రత వంటి అంశాలు ‘కాన్కరెంట్ లిస్ట్’లోకి తేవాలని కమిషన్ సూచించింది. కేంద్రం–రాష్ట్రాల మధ్య వివాదాలు త్వరగా పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది.
కేంద్ర–రాష్ట్ర సంబంధాలు భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటివి. నేడు అవి అత్యంత బలహీనంగా, అపనమ్మకాలతో ఉన్నాయి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. అందుకే రాజ్యాంగం ఉద్దేశించిన ‘సహకార ఫెడరలిజం’ స్ఫూర్తిని అమలుచేయడం, రాజకీయ అవసరాలకు గవర్నర్ పదవిని వాడుకోకుండా ఉండడం, ఆర్థిక సమానత సాధించడం అత్యవసరం. కేంద్రం, రాష్ట్రాలు ఒకదానికొకటి ప్రతిబంధకంగా కాకుండా, భాగస్వామిగా చూడాలి.
వీటిని దృష్టిలో ఉంచుకుని సర్కారియా కమిషన్, పుంచీ కమిషన్ వంటివి చేసిన సిఫార్సులు అమలుకాకపోవడం విచారకరం. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర పెత్తనం పెరుగుతూ, రాష్ట్రాల హక్కులు కుంచించుకుపోతూ సహకార ఫెడరలిజానికి భిన్నంగా కేంద్రాధిపత్యం పెరుగుతోంది. దీన్ని సరిచేసి, అసలైన ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా విధానాలు మారాలి. అప్పుడు మాత్రమే దేశ శ్రేయస్సు, అభివృద్ధి, ఐక్యత సాధ్యం.
ఎ. అజశర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News