Nobel Peace Prize 2025: అమెరికా ఆత్మీయురాలికే నోబెల్ శాంతి
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:36 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి తనకే కావాలని ప్రకటించి ఆ ప్రయత్నం చేయటంతో ఈసారి అవార్డు ఎంపిక ఆసక్తికరంగా మారింది. బహుమతి కోసం పరోక్షంగా ప్రయత్నించటం సహజమే కానీ, తనకి...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి తనకే కావాలని ప్రకటించి ఆ ప్రయత్నం చేయటంతో ఈసారి అవార్డు ఎంపిక ఆసక్తికరంగా మారింది. బహుమతి కోసం పరోక్షంగా ప్రయత్నించటం సహజమే కానీ, తనకి ఇవ్వమని ఆ స్థాయి మనిషి బహిరంగంగా హుంకరించటం అరుదు. ఇలా చేసి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన స్థాయిని తానే తగ్గించుకోవటంతోపాటు, చివరకు ఎంపిక కాలేక అవమానం పాలయ్యారు.
గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన రూజ్‌వెల్ట్ (1906), వుడ్రో విల్సన్ (1919), జిమ్మి కార్టర్ (2002), బరాక్ ఒబామా (2009)లు నోబెల్ శాంతి బహుమతులు అందుకున్నారు. గత రెండు శతాబ్దాలుగా ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా అమెరికా పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుంటుందనేది వాస్తవం. ఈ నిజం నేపథ్యంలో అసలు అమెరికా ఏ అధ్యక్షుడైనా ఈ అవార్డుకి అర్హుడేనా అన్నది ఎక్కువమంది విజ్ఞుల అనుమానం. అయితే నోబెల్ ఎంపిక కమిటీ ట్రంప్‌ను బుజ్జగించటానికి అతని అనుంగు అనుచరురాలు, అమెరికా కీలుబొమ్మ అయిన వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ఈ అవార్డు ప్రకటించింది. ఆమె కూడా తమ మైత్రిని ఏ మాత్రం దాచుకోకుండా ఈ అవార్డుని ట్రంప్‌కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.
వెనిజులా ప్రజా నాయకుడు చావెజ్‌ని 2002లో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన కుట్రలో ఈ మచాడో కీలక భాగస్వామి. కానీ ప్రజల ఆగ్రహ ఉద్యమంతో చావెజ్ విడుదలయ్యాడు. రాజద్రోహం ఆరోపణలపై విచారణ జరిపి మచాడోకి 28 సంవత్సరాల జైలుశిక్షని కోర్టు విధించింది. కాని పెద్దమనసుతో చావెజ్ ఆమెకి క్షమాభిక్ష పెట్టారు. అప్పట్లోనే (2005) ఆనాటి అమెరికా అధ్యక్షులు జార్జి డబ్ల్యూ బుష్ మచాడోని వైట్‌హౌస్‌కి పిలిపించుకుని చర్చలు జరిపాడు. వెనిజులా నాయకుడు చావెజ్ దేశ ప్రయోజనాల కోసం చమురు, ఉక్కు పరిశ్రమల్ని జాతీయం చేయటంతో దేశంలోని పెద్ద వ్యాపారులకి, అమెరికా ఆధిపత్యానికి తీవ్ర విఘాతం కల్గింది. దాంతో వీరంతా చావెజ్‌పై తీవ్రమైన అక్కసుతో ఉన్నారు. అలాంటి ఒక బడా ఉక్కు వ్యాపారి కూతురే ఈ కొరినా మచాడో. తన దేశంలో ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం, కొందరు ప్రజల సజీవ దహనం లాంటి హింసకు కారకురాలైన ఈ ‘శాంతి పురస్కార గ్రహీత’ తన దేశంలో ప్రభుత్వాన్ని మార్చటానికి సహకరించాలని ఇజ్రాయెల్, అర్జెంటీనా లాంటి దేశాలకు లేఖలు రాశారు. గాజా మారణకాండ నేపథ్యంలో నెతన్యాహుని సమర్థిస్తూ ‘ఇజ్రాయెల్ స్వేచ్ఛకు నిజమైన మిత్రుడని’ ఈమె కొనియాడారు. ఈ ఎంపికను వర్తమాన ప్రపంచంలో అనేకమంది ప్రజాస్వామిక ప్రియులు వ్యతిరేకిస్తుండటంలో ఆశ్చర్యం లేదు.
ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినవారిలో పాలస్తీనా పిల్లలకు, స్త్రీలకు, కాందిశీకులకు మానవతా సాయం చేస్తూ, ఇజ్రాయెల్ అమెరికాల నిర్బంధాన్ని సైతం ఎదుర్కొంటున్న ‘ప్రొటిల్లా’ వంటి సంస్థ కూడా ఉన్నది. అలాంటి ఎంపికలను కాదని– తన దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేయటానికి వెనుకాడక, మాదక ద్రవ్యాలను అరికట్టే పేరుతో ట్రంప్ చేయాలని చూస్తున్న దురాక్రమణ వ్యూహానికి మద్దతు పలుకుతున్న ‘దేశద్రోహి’కి, వెనిజులా తీరంలో యుద్ధ నౌకల్ని మోహరించిన అమెరికాని సమర్థిస్తున్న మచాడోకి శాంతి బహుమతి ఇచ్చారు. నోబెల్ దృష్టిలో శాంతికి హింసకి ఉన్న నిర్వచనాలేమిటో మెజారిటీ ప్రజలకు అర్థం కావటం లేదు. ఇది మనస్సాక్షిలేని నిర్ణయమని దీనిని పునఃపరిశీలించాలని అమెరికా – ఇస్లామిక్ దేశాల మండలి డిమాండ్ చేసింది. మచాడోతో పోల్చితే ప్రజల దృష్టిలో చాలా మెరుగైన వారి పేర్లను కొందరు ప్రస్తావిస్తున్నారు. అసలు నామినేట్ అయిన మొత్తం 244 మంది వ్యక్తులు 94 సంస్థల వివరాలు ప్రకటిస్తే ఈ ఎంపిక ఎంత ఏకపక్షమో ప్రపంచానికి అర్థమవుతుంది.
ట్రంప్ పాకులాడినా ఎంపిక చేయలేదని అన్పించుకున్న ఈ ఎంపిక కమిటీ కనీసం తమ ఎంపికను ప్రకటించే వరకు కూడా లీక్ కాకుండా కాపాడుకోలేకపోయింది. దేనితో అయినా జూదం ఆడగల, జూదాన్ని ప్రోత్సహించగల కార్పొరేట్ శక్తులు తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం పాలీమార్కెట్‌లో మచాడో ఎంపిక విషయాన్ని లీక్ చేయించి, ఆమెపై బెట్టింగ్‌ను 3.75శాతం నుంచి 73శాతానికి పెంచాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హార్స్‌విలెన్ నార్వే టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ప్రకటించారు. నోబెల్ బహుమతుల ఎంపిక పకడ్బందీగా, పారదర్శకంగా ఉంటుందన్న అభిప్రాయంలోని డొల్లతనాన్ని ఈ విషయం ఋజువు చేస్తున్నది. ఇప్పటివరకు మన దేశంలోని అకాడమి ఎంపికల్ని చూసి అవాక్కవుతున్న మనం విశ్వవ్యాప్తంగా ఎంపికలన్నీ ఒకేరకం అని సరిపెట్టుకొని కొంత ఉపశమనం పొందుదాం. సామ్రాజ్యవాదులు తన పంజా దేని మీదకైనా విసరగలరని అర్థం చేసుకుందాం.
చెరుకూరి సత్యనారాయణ
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News