Drugs Free Andhra Pradesh: కూటమి లక్ష్యం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:46 AM
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 5.6శాతం మంది మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. మన దేశంలో 30 ఏళ్ల లోపు యువకుల్లో 190 మిలియన్ల మంది మాదకద్రవ్యాల వాడకానికి గురవుతున్నారు...
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 5.6శాతం మంది మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. మన దేశంలో 30 ఏళ్ల లోపు యువకుల్లో 190 మిలియన్ల మంది మాదకద్రవ్యాల వాడకానికి గురవుతున్నారు. నేరాలు, హింస, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు... ఇవన్నీ మత్తుపదార్థాల దుష్పరిణామాలే. విద్యార్థులు, యువత చదువులు వదిలి, సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు.
వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది. మన్యం గంజాయి తోటలుగా మారింది. కేంద్ర ఏజెన్సీలు కూడా షాక్ అయ్యేలా గంజాయి, హెరాయిన్, కొకైన్ రవాణా పెరిగింది. పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో సైతం గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను గత వైసీపీ ‘గంజాయి ఆంధ్రప్రదేశ్’గా మార్చింది. జగన్‌రెడ్డి పాలనలో ఆన్‌లైన్ షాపింగుల ద్వారా విదేశాలకు సైతం గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరిగింది. వైసీపీ పాలనలో మన్యంలో సుమారు 10 వేల నుంచి 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుండేదని అంచనా. పార్టీలు, వేడుకల్లో డ్రగ్స్‌ను ఏరులై పారిస్తూ, యువత జీవితాలతో వైసీపీ ఆడుకుంది.
తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటకు తెస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన నాటి నుంచే రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పాలనలోకి రాగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అడుగడుగునా ‘ఈగల్’ సైన్యాన్ని వేటకు దించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నార్కోటిక్ పోలీసు స్టేషన్, విశాఖ, పాడేరు, అమరావతిలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ విభాగాలు, 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్, రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గిరిజన, మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్‌ల ద్వారా గుర్తించి, ప్రత్యేక పోలీస్ బృందాలు వాటిని ధ్వంసం చేశాయి. అల్లూరి జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను కఠినంగా నిర్వహించి, గంజాయి రవాణాను కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. బాధ్యులపై కేసులు నమోదు చేయడంతో పాటు, గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే నష్టాలపై గిరిజన రైతులు, స్థానికులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు, రవాణా జోలికి వెళ్లకుండా భయాన్ని కలిగించే వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులతో ‘పరివర్తన’ పేరిట సమావేశాలు నిర్వహించారు. గంజాయి సాగు మాని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని సూచించారు.
గిరిజన రైతులకు సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడిమామిడి, అవకాడో, మెరింగా, డ్రాగన్ ఫ్రూట్, మామిడి వంటి 3,86,772 మొక్కలను పాలకులు పంపిణీ చేశారు. వాటిని పెంచుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలు కల్పిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో గంజాయి రవాణాను అరికట్టేందుకు తనిఖీలను మరింత కఠినంగా నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల కేసుల సత్వర పరిష్కారానికి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నివారించడానికి ఒడిశా నుంచి వచ్చే రైళ్లను లక్ష్యంగా చేసుకుని వారానికి మూడుసార్లు ఉమ్మడి ఆపరేషన్‌ను నిర్వహించింది. సాగుదారులు, స్మగ్లర్లు, అమ్మేవారు, చివరికి వినియోగదారుల్ని కూడా వదలకుండా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టే ఈగల్ విభాగం– రాష్ట్రంలో గంజాయి మొక్కే కాదు, వాసన కూడా లేకుండా చేసేందుకు నడుం బిగించింది.
విద్యాసంస్థల్లోనూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు కీలక చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్స్‌ను 4,786 స్కూళ్లు, కళాశాలల్లో ఏర్పాటు చేసింది. ‘మహాసంకల్పం’ పేరుతో సమావేశాలు జరుపుతోంది.
కూటమి ప్రభుత్వం మత్తు మందుల అక్రమ అమ్మకాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి, ప్రిస్క్రిప్షన్ లేకుండా NRX/RX మత్తు మందులు అమ్ముతున్నవారిని, గడువు ముగిసిన మందులపై తేదీలు మార్చి అమ్ముతున్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ఔషధ నిబంధనల ఉల్లంఘనపై కూడా ఎటువంటి సడలింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మత్తుకు బానిసైన వారిని కూడా కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 56 డీ–అడిక్షన్ సెంటర్లతో పాటు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలతో కూడిన వరల్డ్–క్లాస్ పునరావాస కేంద్రాలను మూడింటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యసనం బారిన పడినవారికి కొత్త జీవితాన్ని అందిస్తోంది. ఈ కేంద్రాల్లో పూర్తి ఉచితంగా అత్యాధునిక వైద్య చికిత్స, మనోవైద్య నిపుణుల కౌన్సెలింగ్, దీర్ఘకాలిక పునరావాస సహాయం, కుటుంబ సభ్యులకు ప్రత్యేక మార్గదర్శకత్వం అందుతోంది. పాఠశాలలు, పోలీసు వ్యవస్థ, ఎన్జీఓలతో జతకట్టి మత్తుపదార్థాల దుష్పరిణామాలపై పాలకులు భారీ స్థాయిలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలతో కలిసి మరింత శక్తిమంతమైన ప్రచారం, అంతర్రాష్ట్ర కార్మికులపై ప్రత్యేక నిఘా వంటి కార్యక్రమాలు కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రభుత్వం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అంటూ యువతను నాశనం చేస్తోంది. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్య నేతలకు దగ్గరివాడు పులగం కొండారెడ్డి. ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తూ ‘ఈగిల్’ టీంకి అడ్డంగా దొరికిపోయాడు. అయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా డ్రగ్స్ పట్ల, యువత భవిత పట్ల తన వైఖరి చాటుకున్నాడు జగన్మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో ‘గంజాయి మత్తు’ అనే మాటే వినిపించకూడదు అని కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పెరిగిన గంజాయి మహమ్మారిని సమర్థవంతంగా అరికడుతోంది. టోల్‌ఫ్రీ నంబర్ 1972, వాట్సాప్ 8977781972 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు కూటమి ప్రభుత్వం పిలుపునిస్తోంది. ‘డ్రగ్స్–ఫ్రీ ఆంధ్ర’ కోసం అందరూ కలిసి ముందుకు సాగితే, యువత భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
బీద రవిచంద్రయాదవ్
శాసనమండలి సభ్యుడు
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News