Share News

Swachh Andhra: స్వచ్ఛత ఉంటేనే స్వస్థత

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:07 AM

మానవాళికి తిండీ నీరూ ఎంత అవసరమో, చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమూ అంతే ముఖ్యం. ఇంటి చుట్టూ చెత్త, మురికి చేరితే అంటు వ్యాధులకు దారి తీసి, అనారోగ్య సమస్యలకు...

Swachh Andhra: స్వచ్ఛత ఉంటేనే స్వస్థత

మానవాళికి తిండీ నీరూ ఎంత అవసరమో, చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమూ అంతే ముఖ్యం. ఇంటి చుట్టూ చెత్త, మురికి చేరితే అంటు వ్యాధులకు దారి తీసి, అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. వాటి నుంచి బయటపడేందుకు డబ్బు వెచ్చించాలి. రెక్కాడితే గానీ డొక్కాడని వారు పనులకు వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులకు లోనవుతారు. అందుకే మనం ఇంటినీ పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని, స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆనంద, ఆరోగ్య, ఆర్థిక ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత.

స్వచ్ఛాంధ్ర ఉద్యమం ఈనాటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ‘పచ్చదనం– పరిశుభ్రత’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు జరిపి, పల్లెలు–పట్టణాల్లో పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కలిగించారు. వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేసి, చిట్టడవుల్లో కూడా భారీగా మొక్కలు నాటించి, పోషించి, అటవీ విస్తీర్ణాన్ని కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచారు. ఆ అనుభవాన్ని గుర్తించి, ఆయన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని రూపొందించి, ఈ స్వచ్ఛతా ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నది.


ప్రస్తుతం చెత్తాచెదారం తొలగించడంతో పాటు చెత్త నుంచి సంపదను సృష్టించే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది తొలినాళ్లలో మొదలుపెట్టిన ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ప్రధానంగా మున్సిపల్, పంచాయతీ రాజ్, విద్య, ఆరోగ్యం, దేవాదాయ, పర్యావరణ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి శాఖకు స్పష్టమైన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు (KPIs) నిర్ణయించి, పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఓ ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నెలకో థీమ్‌తో ప్రతి మూడవ శనివారం క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలతో మమేకమై చెత్తను నిర్మూలించే కార్మికుల కష్ట సుఖాలు కూడా తెలుసుకుంటూ వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారు. పేరుకుపోయిన చెత్తను తొలగించడం, మొక్కలు నాటించడం, పరిసరాలను శుభ్రం చేయించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించడం, ఈ–వేస్ట్ మేనేజ్‌మెంట్, కంపోస్ట్ తయారీ వంటివెన్నో వినూత్న కార్యక్రమాలు పరిశీలిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రే స్వయంగా పాలుపంచుకుంటున్నారు.

స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో రోజుకు సుమారు 8,900 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు 1,500 పైగా ఎలక్ట్రిక్ వాహనాలనూ, ఆధునిక యంత్రాలనూ మున్సిపాలిటీలకు ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వ హయాంలో కొండల్లా పేరుకుపోయిన 85.9 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఇప్పటికే తొలగించారు. వచ్చే జనవరి లోపు మిగిలిన చెత్తను తొలగించి, భవిష్యత్తులో పోగుపడే అవకాశం లేకుండా, ఇంటింటా హోమ్ కంపోస్టింగ్, కిచెన్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించనున్నారు. వైజాగ్, గుంటూరు నగరాల్లో ఇప్పటికే రెండు ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వాటి నుంచి సుమారు 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఇంకో ఆరు ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే ఈ ప్రక్రియలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోంది.


ఇప్పుడు చాలా గ్రామాలు బహిరంగ మల విసర్జనను నివారించడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పట్ల ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాయి. అలాంటి గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) Plus Model గ్రామాలుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. రాష్ట్రంలోని 15,995 గ్రామాల్లో ఇప్పటికే 8,814 ODF+ మోడల్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. 2026 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను ODF+గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగడం హర్షణీయం. గ్రామీణ ప్రాంతాలలో మేజిక్ డ్రైన్స్ లాంటి కొత్త ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

మరో వైపు వ్యర్థాలను నిరుపయోగంగా ఎక్కడంటే అక్కడ పడవేసి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో పునర్వినియోగంలోకి తీసుకువచ్చే వలయార్థిక విధానాన్ని ‘సర్క్యులర్ ఎకానమీ’ అంటారు. ఈ విధానం వల్ల పర్యావరణ పరిరక్షణతో బాటు పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక ఉద్యోగ కల్పన, ఆర్థికాభివృద్ధి సమకూరుతుంది. ఈ దిశగా దేశంలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘‘సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ 2025–30’’ ప్రకటించింది. ఈ విధానం ప్లాస్టిక్, ఈ–వేస్ట్, టెక్స్టైల్, బ్యాటరీలు వంటి అన్ని వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వాడి పడవేసే అలవాటును విడిచి ‘Recover–Reuse–Recycle’ పద్ధతికి దారి చూపుతోంది. తద్వారా కాలుష్య నియంత్రణ కూడా సాధ్యమవుతోంది. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుతో బాటు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారికి 75 శాతం వరకు పెట్టుబడి రాయితీతో పాటు భూకేటాయింపు, విద్యుత్ రాయితీ వంటి వివిధ ప్రోత్సాహకాలు ఇచ్చి, రీసైక్లింగ్ పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది.


రాష్ట్రంలో ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. కాబట్టి, బాధ్యత గల పలు శాఖలు ప్రభుత్వ రంగంలో పనిచేసే పారిశుధ్య యంత్రాంగం, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. వాటికి బదులు బయో– డీగ్రేడబుల్ ఉత్పత్తుల ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలి. వీటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించింది.

ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేయాలనే సంకల్పంతో, బాగా పనిచేసి సానుకూల మార్పునకు నడుం బిగించిన వ్యక్తులకు, శాఖలకు, స్వచ్ఛంద సంస్థలకు గౌరవం ఇచ్చి, ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసే లక్ష్యంతో ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2025’కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని 21 విభాగాల్లో దాదాపుగా 1,20,000 సంస్థలు పోటీలో పాల్గొన్నాయి. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, మూడు దశల్లో పరిశీలన చేసి రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులనూ, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులనూ ప్రకటించారు. స్వచ్ఛత మన అందరి బాధ్యత అని తెలియపరిచే కార్యక్రమం ఇది. రానున్న రోజుల్లో స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలందరూ భాగస్వాములవుతారని ఆశిద్దాం.

డా. పి. క్రిష్ణయ్య, ఐఏఎస్ (రిటైర్డ్)

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 05:07 AM