గతం తెలిసీ కాళేశ్వరంపై ఎందుకీ నిందలు
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:38 AM
సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా పదే పదే వేస్తున్న ప్రశ్న: తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది? ఇది వింటున్నప్పుడల్లా నిజంగానే వారికి సమాధానం తెలియదా...
సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా పదే పదే వేస్తున్న ప్రశ్న: తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది? ఇది వింటున్నప్పుడల్లా నిజంగానే వారికి సమాధానం తెలియదా? అనిపిస్తుంది.
2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాణహిత –చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, నీటిని ఎత్తిపోస్తూ చేవెళ్ల వరకు తరలించాలని భావించారు. ప్రాజెక్టు పనులను 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే, తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పనులు తప్ప అన్ని ప్యాకేజీల్లో ఏక కాలంలో పనులు ప్రారంభం అయినాయి. ఇదిలా ఉండగానే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.40,300 కోట్లకు సవరించి, 2010లో ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 2014 జూన్ వరకు ఈ ప్రాజెక్టుపై అప్పటికి ఖర్చు చేసింది రూ.7వేల కోట్లు మాత్రమే. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని ఏపీ ప్రతిపాదించగా, అప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే బ్యారేజీ ఎత్తు 148 మీటర్లు మించకూడదని అభ్యంతరం తెలిపింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిధుల కేటాయింపులో జాప్యం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వంటివి కూడా ఆలస్యానికి కారణమయ్యాయి. కొన్ని ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లు పనులు అర్ధాంతరంగా వదిలేసి, సామగ్రిని వెనక్కి తీసుకెళ్లిన సందర్భాలున్నాయి.
ప్రాణహిత ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. మరి ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదల్లేకపోయింది? మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ అయినా, తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ అయినా– తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అలాగని బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తే ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుంది. ఎత్తిపోయడానికి తగినంత నీరే ఉండదు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలియదా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని భావించారు. బ్యారేజీ ఎత్తు గురించి మహారాష్ట్రతో ఎన్నోసార్లు చర్చలు జరిపారు కానీ, ఏకాభిప్రాయం కుదరలేదు. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే అనుకున్నంత స్థాయిలో నీటి లభ్యత ఉండదని సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు పేర్కొన్నాయి. ఎత్తిపోతల పథకం మరింత ప్రభావవంతంగా ఉండాలంటే ఇందులో భాగమైన అన్ని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించాయి. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై అనుమానాల నేపథ్యంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎత్తిపోతలకు సరిపడా నీటి లభ్యత పెరుగుతుందని గుర్తించారు. ఆ తర్వాత ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి రీడిజైన్ చేయించారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే– ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో 90 శాతం ప్రాణహిత–చేవెళ్ల డిజైనే. ప్రాణహిత పథకంలో తుమ్మిడిహట్టి నుంచి నీటిని ఎత్తి ఎల్లంపల్లిలో నింపాల్సి ఉండగా, రీడిజైన్ ద్వారా గోదావరి నదిపైన కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర, ఎగువన అన్నారం, సుందిళ్ల దగ్గర, మొత్తం మూడు పెద్ద బ్యారేజీలు నిర్మించి, ఆ నీటిని అంచెలంచెలుగా ఎల్లంపల్లి వరకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి వివిధ రిజర్వాయర్లకు తరలిస్తారు.
ప్రాణహితకు రీడిజైన్ చేసి, కొత్త బ్యారేజీల నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నేను అడిగేది ఒక్కటే.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన అంచనా వ్యయం రూ.17,875 కోట్లు. ఏ పనీ చేయకుండానే ఆ వ్యయాన్ని ఏడాదిన్నరలోనే రూ.38,500 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కేంద్రానికి డీపీఆర్ పంపినప్పుడు రూ.40,300 కోట్లకు పెంచారు. ఇది 2010లో. కాళేశ్వరం మొదలైంది 2016–17లో. ఎనిమిదేండ్ల తర్వాత కూడా అదే అంచనా వ్యయంతో, కొత్తగా మూడు పెద్ద బ్యారేజీలు, మూడు అనుబంధ పంప్ హౌజ్‌లు, అనేక రిజర్వాయర్లతో నిల్వ సామర్థ్యాన్ని, పంపింగ్ సామర్థ్యాన్ని పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం సాధ్యమేనా?
కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరం డిజైన్ కేసీఆర్ చేతితో గీయలేదు. మేడిగడ్డలో బ్యారేజీని గుడ్డిగా అనుమతించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ–ఇంజినీరింగ్‌లో, ముఖ్యంగా బ్యారేజీల స్థలాల ఎంపిక, నీటి లభ్యత అంచనా వంటి సాంకేతిక అంశాల్లో వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ కీలకపాత్ర పోషించింది. ఇది ఒక ప్రముఖ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు వ్యాప్కోస్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లైడార్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా 2016 జనవరి 17న వ్యాప్కోస్ మూడు బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఈ నివేదిక ఆధారంగానే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమైన విషయం ఏంటంటే...: ప్రాణహిత నది వెన్‌గంగా, వార్ధా అనే రెండు నదుల సంగమం. వార్ధా మహారాష్ట్రలో పుడితే, వెన్‌గంగా మధ్యప్రదేశ్‌లో పుడుతుంది. అవి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తూ మహారాష్ట్రలోని గడ్చిరోలి దగ్గర కలుస్తాయి. అక్కడి నుంచి దీన్ని ప్రాణహిత నది అని అంటారు. అంతకుముందు వార్ధాలో మరో ఉప నది పెన్‌గంగా మహారాష్ట్రలోని చాందా జిల్లాలో కలుస్తుంది. అంటే, ప్రాణహిత నది అనేది వెన్‌గంగా, పెన్‌గంగా, వార్ధా అనే మూడు నదుల కలయిక అన్నమాట. ఇక గోదావరి, ప్రాణహిత నదులు తెలంగాణలోని కాళేశ్వరం వద్ద కలుస్తాయి. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం ప్రాణహిత నీళ్లే ఆ ప్రాజెక్టుకు ఆధారం. కానీ, ప్రాణహిత నది తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత కాళేశ్వరం వద్ద గోదావరి నదిని కలిసే ముందు 116 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఆ నది కుడివైపున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నో వాగుల (1.పెద్దవాగు, 2.ఎర్రవాగు, 3.వట్టివాగు, 4.నీల్వాయి, 5.గొల్లవాగు, 6.చెలిమెల వాగు, 7.ర్యాలివాగు, 8.జైపూర్ వాగు) నుంచి వరదనీటిని తీసుకువస్తుంది.
ఈ 116 కిలోమీటర్ల ప్రవాహంతోనే ప్రాణహిత నది గోదావరిలోకి 120 టీఎంసీల నీటిని తీసుకువస్తుంది. భవిష్యత్తులో మహారాష్ట్రలో వెన్‌గంగా, వార్ధా నదులపై ప్రాజెక్టులు కట్టుకున్నా.. ఈ 120 టీఎంసీల లభ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రాణహిత ప్రాజెక్టుకు రీడిజైన్ చేయడానికి తుమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడంతో పాటు ఇది మరో ముఖ్యమైన కారణం.
మే 15వ తేదీన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సరస్వతీ పుష్కరాలకు వెళ్లి కాళేశ్వరం దేవాలయం వద్ద స్నానం చేశారు. ఎండకాలం కూడా గోదావరి నీళ్ల పరవళ్లను చూసిన వాళ్లు.. ‘ఓహో మేడిగడ్డ వద్ద ఇంత మేర నీటిని ఒడిసిపట్టుకోవచ్చని కేసీఆర్ ముందే ఊహించారేమో... దార్శనికత, దూరదృష్టి అంటే నిజంగా ఇదే కావచ్చు..’ అని వారిరువురు మనసులో తప్పక అనుకొని ఉంటారు.
బోయినపల్లి వినోద్‌కుమార్
పార్లమెంటు మాజీ సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News