Telangana Politics: పౌర సమాజం మూడో కన్ను తెరవాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:11 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి (అక్టోబర్ 7) 22 నెలలు. సాధారణంగా మనుషులకు 21 సంవత్సరాలు నిండితే మానసికంగా కొంత పరిణతి వస్తుందని భావిస్తారు. ఐదేళ్ల పరిపాలనకు...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి (అక్టోబర్ 7) 22 నెలలు. సాధారణంగా మనుషులకు 21 సంవత్సరాలు నిండితే మానసికంగా కొంత పరిణతి వస్తుందని భావిస్తారు. ఐదేళ్ల పరిపాలనకు ఓటర్ల నుంచి అనుమతి పొందిన ఏ ప్రభుత్వమైనా 22 నెలల కాలంలో రాజకీయ పరిణతితో, తన పాలనా ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటుందని ఆశిస్తాం. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పరిణతితో వ్యవహరించడం లేదనే విషయం పౌర సమాజానికి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వంపై సాధారణ ప్రజలలో రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తిని కూడా పౌర సమాజం గమనిస్తోంది.
గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించి, ప్రజల పక్షాన పని చేసింది పౌర సమాజం. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని, ఫాసిస్టు పోకడలు కలిగిన బీజేపీని రాష్ట్రంలో బలపడకుండా చూడాలని’’ ప్రజలకు పిలుపు ఇచ్చింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు చేసిన తప్పులను విస్తృతంగా ప్రచారం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ప్రచారం పరోక్షంగా ఉపయోగపడింది. ఈ ప్రచారం సాగిస్తున్న కాలంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులు, ఆ పార్టీ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో సాగిన అవినీతి, ఆ పార్టీ నాయకుల ఫ్యూడల్ మనస్తత్వాల పట్ల పౌర సమాజానికి స్పష్టత ఉంది. కానీ దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే పౌర సమాజం ఆనాడు తన రాజకీయ వైఖరిని నిర్ణయించుకుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే భ్రమ కూడా ఆనాడు పౌర సమాజానికి లేదు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరెస్సెస్‌పై సాగిస్తున్న సైద్ధాంతిక పోరాటం, రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు, కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి ముందుకు రావడం వంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ గత ప్రభుత్వాల పాలనా తీరుకు కొంత భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉంటుందని పౌర సమాజం ఆశించింది.
ప్రజా సంఘాలు, పౌర సమాజ బృందాలతో నిత్య సమన్వయంతో, ప్రజల సమస్యలపై లోతైన చర్చలతో, విచక్షణతో కూడిన, పర్యావరణ హితమైన అభివృద్ధి నమూనాతో రేవంత్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని పౌర సమాజం ఆశించింది. దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, మతపర మైనారిటీలు, ఆర్థికంగా పేద ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రాధాన్యతలతో ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని భావించింది. ఆరు గ్యారంటీలతో పాటు, ప్రజాస్వామిక పాలన 7వ గ్యారంటీగా ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజల హక్కులను హరించడంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం చేయబోదని కూడా ఆశించింది. కానీ గత 22 నెలలలో ఈ ఆశలేవీ నెరవేరలేదు.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి దశలో తప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రి పౌర సమాజ ప్రతినిధులను, ప్రజాసంఘాల ప్రతినిధులను కలవడమే లేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పౌర సమాజంతో చర్చించడం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వం లాగే ప్రజా సంఘాల కార్యకర్తల ముందస్తు అరెస్టులు, గ్రామాలలో ప్రజల సభలకు అనుమతి నిరాకరణ, ప్రజలను కలవడానికి వెళుతున్న పౌర సమాజ, ప్రజా సంఘాల ప్రతినిధులను అరెస్టు చెయ్యడం వంటి చర్యలకు పాల్పడుతున్నది.
కాంగ్రెస్ పార్టీ తన అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు అమలు కావడం లేదు. ముఖ్యంగా వికలాంగులు, వితంతు మహిళలు, వృద్ధులు సహా లక్షలాది పేదలకు అందాల్సిన కొత్త ఆసరా పింఛన్ల ప్రక్రియ మొదలు కాలేదు. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధుల అమలుకు నిర్దిష్ట ప్రణాళికే లేదు. ఆదివాసీలకు అడవిపై హక్కులు దఖలు పడేలా, వారికి సాముదాయక హక్కులు కల్పించకపోగా, పులుల సంరక్షణ, అభయారణ్యాల పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొడుతోంది.
రాష్ట్రంలో 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామనీ, వారికి రైతు భరోసా సహాయం అందిస్తామనీ; వ్యవసాయ కూలీలను కూడా రైతు బీమా పరిధిలోకి తీసుకువస్తామనీ; సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తామనీ, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామనీ, శాస్త్రీయ పంటల ప్రణాళిక రూపొందిస్తామనీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు.
గిగ్, ప్లాట్‌ఫారం కార్మికులకు సమగ్ర చట్టం తెస్తామనీ, హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనీ, బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామన్న హామీలు అమలు కాలేదు. అలాగే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామనీ, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. పదివేలు వేతనం ఇస్తామనీ, అన్ని ప్రభుత్వరంగ సంస్థలలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామనీ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదు.
విద్యా రంగానికి హామీ ఇచ్చినట్లుగా 15 శాతం బడ్జెట్ కేటాయించకుండా, విద్యా రంగంలో వేసిన కమిషన్ ఇప్పటికే ఇచ్చిన సిఫారసులను అమలు చేయకుండా, కొత్త జీవో జారీ చేసి మరో కమిషన్ వేయడం ఇంకా జాప్యం చేయడానికే. ఇప్పటికే సమస్యలతో ఇబ్బందిపడుతున్న వేలాది ప్రభుత్వ స్కూళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను బాగు చేయకుండా, ఒక్కో స్కూల్‌కు 200 కోట్ల రూపాయలతో 100కు పైగా కొత్త స్కూళ్లకు నిధులు కేటాయించడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, మళ్ళీ 30 వేల కోట్లు అప్పు చేయడమంటే రాజకీయ నేతలను, కాంట్రాక్టర్లను పోషించడానికే అని అర్థం.
సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులు లేకుండానే మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ నది పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రాష్ట్రమంతా 8, 12 లేన్ల రహదారుల పేరుతో రేవంత్ ప్రభుత్వం ముందుకు తెస్తున్న అభివృద్ధి నమూనా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అమలు చేసిన పాత అభివృద్ధి నమూనాకు భిన్నమైనది కాదు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా, కేసీఆర్ తెచ్చిన 2016 భూసేకరణ చట్టం అమలు చేసి, రైతుల నుంచి లక్షలాది ఎకరాలను గుంజుకునే నమూనా ఇది. దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములు లాక్కునే రియల్ ఎస్టేట్ అభివృద్ధి నమూనా.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఈ విషయాలపై లోతుగా సమీక్షించుకుని, జరిగిన తప్పులను, నడుస్తున్న మార్గాన్ని సవరించుకోవాలి. పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో చర్చించి, సరైన విధానాలు అమలుచేయాలి. ప్రాధాన్యతలు నిర్ణయించుకుని, ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం చేజేతులా తన ప్రతిష్ఠను పోగొట్టుకుంటుంది. రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ కూటమి పెరుగుదలకు కారణమవుతుంది. ప్రభుత్వ తప్పులను పౌర సమాజం ప్రశ్నించకపోతే, ప్రజల గొంతు బలహీనమవుతుంది. పౌర సమాజం తన ప్రతిష్ఠను కోల్పోతుంది. అది మొత్తం సమాజానికి మరింత నష్టం.
n కన్నెగంటి రవి
సామాజిక కార్యకర్త
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News