Tirumala Brahmotsavam: పట్టు వస్త్రాల సమర్పణలో చంద్రబాబు రికార్డు
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:07 AM
మానవాళికి మహోత్సవాలుగా భక్తులు భావించే తిరుమల–తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు...
మానవాళికి మహోత్సవాలుగా భక్తులు భావించే తిరుమల–తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి, తొలిసారి 1995 సంవత్సరంలో తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ప్రారంభించారు. 2003లో బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వెళుతుండగా అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో గాయపడిన ఆయన, బ్రహ్మోత్సవాలకు వెళ్లలేక పోయారు. 1995 నుంచి 2002, 2014నుంచి 2019 వరకు, 2024 నుంచి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరపున ఇప్పటివరకు మొత్తం 15సార్లు పట్టువస్త్రాలు సమర్పించిన మహద్భాగ్యం చంద్రబాబుకే దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఇన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం చంద్రబాబుకు కలగడం కలియుగ దైవం కృప వల్లే అని చెప్పాలి. ఇటువంటి అవకాశం మరొకరికి దక్కదు కూడా.
తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పట్ల గొప్ప భక్తి కలిగి ఉంటారు చంద్రబాబు. తన జీవితంలో ఎన్నో సమస్యల నుంచి అలిపిరిలో బాంబు దాడి జరిగి సురక్షితంగా బయటపడటం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల వల్లేనని పలు సందర్భాలలో ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు చేపట్టడంలో కూడా ఆయన ముందున్నారు. తరచూ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుపతిలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 1985 ఏప్రిల్ 6న ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ప్రారంభంలో ఈ కార్యక్రమంలో పరిమితంగానే భోజనం అందించేవారు. క్రమేణా నేడు రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు అన్నదానం జరుగుతోంది.
తిరుపతి, తిరుమల ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ సేవలు, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో, మౌలిక వసతులను పెంపొందించడంలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలకు, ఆలయ అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన అనేక ప్రైవేటు అనుమతులను రద్దు చేశారు. తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్తులను వేరే శాఖలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ సేవలలో 100 శాతం మార్పులు రావాలని, భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చాలని, ఆలయ నిర్వహణలో పారదర్శకత, లడ్డు ప్రసాదం నాణ్యత పెంచాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పేరుతో ఆలయ సొమ్మును దుర్వినియోగం చెయ్యవద్దని హెచ్చరించారు. భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన దర్శనాలు, వసతులు కల్పించాలనే లక్ష్యంతో దిశానిర్దేశం చేశారు. తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన జరగాలని, మినహాయింపులు ఉండకూడదని సూచించారు.
తిరుమల లడ్డూ మహాప్రసాదం పవిత్రతను, విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను గత ప్రభుత్వం దిగజార్చింది. గత అయిదేళ్లుగా తిరుమల తిరుపతిలో జరిగిన ఘోరాతి ఘోరాలు, పాపాలు హిందూ సమాజాన్ని కలవరపెట్టాయి. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, 15 నెలలుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో తిరుపతికి దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తులతో పాటు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర రాజకీయ నాయకులు తిరుమల పవిత్రతను కాపాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నారు.
కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం పార్లమెంటు సభ్యులు
వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News