కేంద్ర ప్రభుత్వం.. పెన్షన్ పిల్లిమొగ్గలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:09 AM
మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనే పథకాన్ని 2025 ఏప్రిల్ 1 నుండి అమలయ్యేలా 24 జనవరి 2025న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది....

మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనే పథకాన్ని 2025 ఏప్రిల్ 1 నుండి అమలయ్యేలా 24 జనవరి 2025న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 2004 నుండి అమలవుతున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్థానంలో దీనిని ఎంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు.
2004 వరకు దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒకే పెన్షన్ స్కీం ఉండేది. దీనినే పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అని పిలుస్తున్నారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓపీఎస్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఎన్‌పీఎస్‌ను కంపల్సరీ చేస్తూ 2004 జనవరి 1 నుండి అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇందులో చేరేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించింది. ఈ ఎన్‌పీఎస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1 నుండి అమలవుతోంది. దీనినే సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) అని కూడా రాష్ట్రంలో పిలుస్తున్నారు.
ఈ ఎన్‌పీఎస్‌కు ఓపీఎస్‌కు ప్రధాన తేడా ఏమిటంటే ఓపీఎస్‌లో ఉద్యోగి వాటా చెల్లింపు ఏమీ ఉండదు. ఉద్యోగికి ఆఖరి నెల జీతంలో సగం పెన్షన్ కింద లభిస్తుంది. దానితో పాటుగా కమ్యుటేషన్, కరువు భత్యం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత పెన్షన్ వస్తుందో గ్యారంటీ ఉంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి తన జీతంలో పది శాతం వాటా ఈ ఫండుకు చెల్లించాలి. దీనిని యాజమాన్య 14 శాతం వాటాతో కలిపి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి ఆ షేర్ మార్కెట్లో విలువను బట్టి వారికి పెన్షన్ చెల్లిస్తారు. అంటే ఉద్యోగికి పెన్షన్ ఎంత వస్తుందో గ్యారంటీ లేదు. అందుకే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలోనూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలోనూ కూడా వ్యక్తమయింది. వివిధ రూపాల్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో నాటి జగన్ ప్రభుత్వం దీనిపై మాట తప్పినందుకు ఉద్యోగుల ఆగ్రహానికి గురై, అధికారం కూడా కోల్పోవలసి వచ్చింది. ఉద్యోగుల ఈ ఆవేదనను అర్ధం చేసుకుని కొన్ని బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో ఓపీఎస్‌ను పునరుద్ధరించడానికి నిర్ణయించాయి. కానీ, కేంద్రం వద్ద ఉన్న ఉద్యోగుల ఎన్‌పీఎస్ నిధులను వీరికి తిరిగి ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీని రద్దుకూ నిరాకరిస్తోంది.
ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చడానికి మోదీ ప్రభుత్వం నేడు యూపీఎస్ పేరున ఒక కొత్త నాటకానికి తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్సు కార్యదర్శి టివి సోమనాధన్ నేతృత్వంలో ఎన్‌పీఎస్‌లో మెరుగుదలకు ఒక కమిటీని వేసింది. ఓపీఎస్ పునరుద్ధరణ తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని, అనేక ఉద్యోగ సంఘాలు ఈ కమిటీని బహిష్కరించాయి. వారు ఊహించినట్లుగానే ఎన్‌పీఎస్‌లోని అనేక అంశాలను అలాగే ఉంచుతూ, ఓపీఎస్‌లోని కొన్ని అంశాలను కుదిస్తూ ఈ కమిటీ సిఫార్సు చేసింది. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ యూపీఎస్ పథకాన్ని తీసుకువచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జిపీఎస్) లాంటిదే స్థూలంగా ఇది కూడా.
ఎన్‌పీఎస్ పథకంలోని నిధులన్నీ షేర్ మార్కెట్లో పెట్టడం ద్వారా అది పుంజుకోవడానికి, కార్పొరేట్ శక్తులు లాభపడడానికే ఉద్దేశించబడింది తప్ప అందులో ఉద్యోగుల ప్రయోజనాలు ఇసుమంత కూడా లేవు. ఇంకో రకంగా చెప్పాలంటే నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్ల పరం చేయడానికే ఎన్‌పీఎస్ రూపొందించబడింది.
నేటి ఈ యూపీఎస్‌ది కూడా అదే లక్ష్యం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీన్ని పెన్షన్ అని కాకుండా ఎస్యూర్డ్ పేఅవుట్ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరో 4.5 శాతం నిధులను అదనంగా జమ చేస్తుంది. ఉద్యోగి వాటా 10 శాతం, కేంద్ర ప్రభుత్వ 18.5 శాతం వాటాతో ఈ యూపీఎస్ పథకం నడుస్తుంది. దీని ద్వారా షేర్ మార్కెట్లో పెట్టే పెన్షన్ నిధులు మరింత పెరిగి, కార్పొరేట్లకు మరిన్ని లాభాలు సమకూరుతాయి. 2024 జూలై చివరి నాటికి ఎన్‌పీఎస్ ద్వారా 99,77,165 మంది ఉద్యోగుల పెన్షన్ నిధులు షేర్ మార్కెట్లో 10,53,850 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అదనపు వాటాతో ఇది మరింత పెరుగుతుంది. పోనీ ఇదేమైనా మెరుగ్గా ఉందా అంటే, అనేక అంశాలలో ఎన్‌పీఎస్ కంటే అధ్వానంగా ఉంది.
ఓపీఎస్ పథకంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు కూడా కరువు భత్యం చెల్లిస్తారు. పే కమిషన్ ద్వారా వేతన సవరణ జరిగినప్పుడల్లా పెన్షన్ కూడా సవరించబడుతుంది. కానీ యూపీఎస్‌లో ఆ అంశాలు ఎక్కడా పేర్కొనలేదు. అలాగే కనీస ఫేమిలీ పెన్షన్ ఓపీఎస్‌లో 14,130 రూపాయలు కాగా, యూపీఎస్‌లో కేవలం 6000 రూపాయలు మాత్రమే. ఓపీఎస్‌లో ఫేమిలీ పెన్షనర్‌కు 80 సంవత్సరాల వయసు నిండితే అదనంగా 20 శాతం, దానిపైన కూడా కరువు భత్యం, 90 సంవత్సరాలు నిండితే 40 శాతం, 95 సంవత్సరాలు నిండితే 50 శాతం, 100 సంవత్సరాలు నిండితే వంద శాతం చెల్లిస్తారు. యూపీఎస్‌లో ఆ సదుపాయం ఏమీ లేదు.
దీనిలో చేరాలా వద్దా అనే ఆప్షన్ ఉద్యోగులకు ఒకసారి మాత్రమే ఇస్తారు. ఒకసారి చేరిన తరువాత ఇక బయటకు వెళ్లడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావనే ఇందులో లేదు. ఇటువంటి అనేక లోపాలు, షరతులతో కూడిన ఈ గందరగోళ యూపీఎస్ చాలా లోపభూయిష్టమయినది. అమలు ప్రారంభమయితే మరిన్ని లోపాలు బయటపడతాయి. ఏ రకంగా చూసినా ఇది ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయం కాజాలదు. ఏదో చేసేస్తున్నామని భ్రమలు కలిగించి, కార్పొరేట్లకు మరింత సేవ చేయడానికి ఉద్దేశించబడినదే ఈ మోసపూరిత యూపీఎస్. ఈ విషయం నోటిఫికేషన్ 4వ పాయింటు ద్వారా స్పష్టమవుతుంది. అందులో యూపీఎస్‌లో చేరిన సభ్యుల ఎన్‌పీఎస్ నిధిని దీనికి బదిలీ చేస్తారని పేర్కొన్నారు కానీ ప్రభుత్వం ఎన్‌పీఎస్ నిధులను ఓపీఎస్ అమలు చేసే రాష్ట్రాలకు బదిలీ చేయడానికి మాత్రం నిరాకరిస్తోంది. దీన్ని బట్టే తెలుస్తోంది ప్రభుత్వ ఉద్దేశం ఉద్యోగుల ప్రయోజనం కాదని. మోదీ ప్రభుత్వ ఈ జిమ్మిక్కులు అర్థం చేసుకునే ఉద్యోగులు దీన్ని ఏకోన్ముఖంగా తిరస్కరిస్తున్నారు. ‘పెన్షన్ ఉద్యోగి ప్రాధమిక హక్కు-, బిక్ష కాదు’ అనే సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇలాంటి పెన్షన్ పిల్లిమొగ్గలు ఇకనైనా ఆపాలి. కార్పొరేట్ సేవ విడనాడి, ఉద్యోగుల కష్టార్జిత పొదుపు సొమ్ము వారికే చెందేలా ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి.
ఎ. అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News