Share News

Prashant Kishor Analysis: పీకే జీరో నుంచి హీరో కాగలడా

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:34 AM

అధునాతన సామాజిక మాధ్యమాల యుగం మనది. మేధాపరమైన చర్చ కంటే– ఒక చిన్న, పదునైన సౌండ్‌బైట్‌ అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది. కనుకనే బిహార్‌లో ఓట్ల లెక్కింపు రోజున, సంచలనాత్మక ఫలితాలపై నా వార్తా వ్యాఖ్య ప్రారంభమవనున్నదని...

Prashant Kishor Analysis: పీకే జీరో నుంచి హీరో కాగలడా

అధునాతన సామాజిక మాధ్యమాల యుగం మనది. మేధాపరమైన చర్చ కంటే– ఒక చిన్న, పదునైన సౌండ్‌బైట్‌ అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది. కనుకనే బిహార్‌లో ఓట్ల లెక్కింపు రోజున, సంచలనాత్మక ఫలితాలపై నా వార్తా వ్యాఖ్య ప్రారంభమవనున్నదని సూచిస్తూ నేను చేసిన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెన్వెంటనే వైరల్‌ అయింది. బిహార్‌ ప్రజాస్వామ్య పోరులో హీరోగా ప్రభవించవలసిన జన్‌సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ జీరోగా ఉండిపోయాడనేదే నేను చేసిన వ్యాఖ్య. అవును, ఆ వ్యూహ శూరుడు విజయ శూన్యుడుగా మిగిలిపోయాడు మరి. 2014 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రచార వ్యూహాలను రచించి, పీకేగా భారతీయ జనతా పార్టీ శ్రేణులలో ఆదరాభిమానాలు పొందిన ప్రతిభాశాలి ప్రశాంత్‌ కిశోర్‌. మోదీ కొలువును వీడి, సొంత మార్గంలో ముందుకు సాగిన అదే పీకే, బిహార్‌లో తనకొక రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు తొలిసారి ప్రయత్నించి, ఘోరంగా విఫలమవడం బీజేపీ శ్రేణులను అమితంగా ఆనందభరితులను చేసింది. అదలావుంచితే పీకే పరాజయంపై నా వ్యాఖ్య ఆయన మద్దతుదారులకు ఏ మాత్రమూ నచ్చలేదు. నాపై కొండెత్తున మండిపడ్డారు. నేనా వ్యాఖ్యను ఎటువంటి దురుద్దేశంతోనూ చేయలేదు. ఇది స్పష్టం. పీకే అభిమానులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను రూపొందించి, వాటి విజయాలకు కారకుడైన ఈ ప్రతిభాశాలి, రాజకీయ నాయకుడుగా పరిణమించిన తరువాత ఆయన భవిష్యత్తుపై మీడియాలో అనేక ఊహాగానాలు సాగాయి. అంతిమంగా బిహార్‌ ఓటర్లు తమ తీర్పు చెప్పారు: జన్‌సురాజ్‌ పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేదు. కేవలం 3.4 శాతం ఓట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో అడగవలసిన సమంజసమైన ప్రశ్న: ఎన్నికల రాజకీయాలలో ఆయనకు తొట్టతొలుతనే విజయం ఎందుకు లభించలేదు? రాజకీయ నాయకుడుగా భవిష్యత్తు లేని వ్యక్తి అని పీకే గురించి ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం సరైన విషయమేనా?

మన దేశంలో శీఘ్రంగా అధికారానికి రాగల ఒక కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పడమనేది చాలా కష్టం. ఇటీవలి కాలంలో అటువంటి సాఫల్యాన్ని సాధించిన అసాధ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారు. ఆ తరువాత పంజాబ్‌లో సైతం తన పార్టీకి అధికారాన్ని సాధించగలిగారు. ‘అవినీతిపై భారత్‌ పోరు’ ఉద్యమంలో కీలక పాత్ర వహించడం ద్వారా ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని సాధించుకున్నది. పంజాబ్‌లో అకాలీదళ్‌– బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనపై తీవ్ర అసంతృప్తికి లోనైన సిక్కు ఓటర్లు ఆమ్‌ఆద్మీ పార్టీకి పట్టంగట్టారు. పంజాబ్‌లో అధికారానికి వచ్చే నాటికే ఆమ్‌ఆద్మీ పార్టీ యశో కాంతులు మసకబారాయి. మరిన్ని రాష్ట్రాలలో ఆ పార్టీ విస్తరణ, అధికార సాధన అసాధ్యమైపోయింది. గత శతాబ్ది తుది దశకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి రామారావు అనితర సాధ్యమైన రాజకీయ చరిత్ర సృష్టించారు. అదే కాలంలో అసోంలో వలసకారుల వ్యతిరేక ఉద్యమం నిర్వహించిన విద్యార్థులు ‘అసోం గణ పరిషత్‌’ అనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారానికి వచ్చారు. అయితే వారి అధికార వెలుగులు ఎంతో కాలం ప్రకాశించలేదు.


ఆ తరహా విజయాలు సాధించడం ప్రశాంత్‌ కిశోర్‌కు అసాధ్యం. ఎందుకని? సామాజిక జీవితంలోను, రాజకీయ వ్యవహారాలలోను కుల అనుబంధాలే ప్రథమ గణ్యత పొందే బిహార్‌ ఆయన రాజకీయ కర్మక్షేత్రం కావడమే. 2024లో గాంధీ జయంతి రోజున జన్‌సురాజ్‌ పార్టీని నెలకొల్పిన క్షణం నుంచి 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేదాకా ప్రశాంత్‌ కిశోర్‌ ప్రజల మధ్యే ఉంటూ వచ్చారు. బిహార్ నలుమూలలా పల్లె పల్లెనూ ఆయన సందర్శించారు. ప్రజలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటినెలా పరిష్కరిస్తుందో ఓటర్లకు ఓర్పుతో, నేర్పుగా వివరించారు. సకల సామాజిక వర్గాలకు ఆమోదయోగ్యమయ్యే రీతిలో జన్‌సురాజ్‌ను నిర్మించేందుకు ప్రాధాన్యమిచ్చారు.

నిజానికి ఆయన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను రూపొందించే వృత్తిలోనే కొనసాగి ఉంటే మరింతగా కోటీశ్వరుడు అయివుండేవారు. అయినా రాజకీయాలలోకి ప్రవేశించారు. వ్యక్తిగత ఆకాంక్ష, విజయగర్వాతిశయం, చిక్కులను ఎదుర్కొనే తెగువ.. కారణం ఏదైతేనేమి పీకే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదీ ఒక అసాధారణ మార్గంలో. ఎనలేని ఆత్మవిశ్వాసంతో ‘జన్‌సురాజ్‌’ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సాహసించారు. ఎంతో శ్రమించారు. ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా సముపార్జించుకున్నారు. ప్చ్‌.. వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఓట్లు డిజిటల్‌ విశ్వం నుంచి ఊడిపడవు. వీధులలో విశ్వసనీయత పొందితేనే అవి లభ్యమవుతాయి. అందుకు ప్రజల నమ్మకం పొందాలి. బహుజన్‌ సమాజ్‌ పార్టీని నెలకొల్పిన కాన్షీరామ్‌ శక్తిమంతుడు అయినప్పటికీ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ఆయనకు చాలా కాలం పట్టింది. ఆయన ఒకసారి సుప్రసిద్ధంగా ఇలా చెప్పారు: ‘మొదటి ఎన్నికను ఓడిపోవడానికి పోరాడాను, ఇతరులను ఓడించడానికి రెండోదాన్ని పోరాడాను, మూడోది విజయం సాధించేందుకు పోరాడాను’. మంచి రోజుల్లోను, చెడ్డ రోజుల్లోను ఒక రాజకీయ పార్టీని నడిపే కష్టతరమైన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలన్నదే కాన్షీరామ్‌ మాటల సారాంశం. బీఎస్పీ వ్యవస్థాపకుడు అభివృద్ధిపరిచిన కులాధారిత ప్రజాసమీకరణ వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నించారు. అందుకు సామాజిక మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా ఓటర్ల మద్దతును, ముఖ్యంగా బిహార్‌ సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీకే ప్రయత్నించారు. ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయాల పట్ల అశేష జనులు ఆకర్షితులయ్యారు, సందేహం లేదు. అయితే ఆయనకు కులపరమైన గుర్తింపు లేదు. సంస్థాగత బలమూ లేదు. ప్రజల ఆదరాభిమానాలను మరింతగా సంఘటితం చేసుకునేందుకు అవసరమయ్యే పటిష్ఠమైన పార్టీ యంత్రాంగం ఆయనకు లేకపోయింది.


అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు యువ స్వచ్ఛంద కార్యకర్తలపై ఆధారపడినట్లుగానే పీకే సైతం యువ కార్యకర్తల ఆలంబనతో జన్‌సురాజ్‌ను ఒక సువ్యవస్థిత రాజకీయ సంస్థగా నిర్మించేందుకు ప్రయత్నించారు. ఒక వ్యవస్థాగత వ్యతిరేకిగా ప్రజల మనసుల్లో నిలిచేందుకు ఆరాటపడ్డారు. బిహార్‌లో దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న నితీశ్‌కుమార్, లాలూప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పీకే కృషి చేశారు.

పీకే తన విమర్శనాస్త్రాలను నితీశ్‌, లాలూ పార్టీలపై పెద్ద ఎత్తున ఎక్కుపెట్టారు. అయితే ఓట్ల సాధనలో వాటి శక్తి పరిమితమైనదే. బిహార్‌లో రెండు ప్రధాన కూటముల (ఎన్డీఏ, ఎమ్‌జీబీ)కు కలిపి మొత్తం ఓట్ల వాటా ఇంచుమించు 80శాతం మేరకు ఉన్నది. కులపరమైన అనుబంధాల ఆలంబనతోనే వాటికీ బలం చేకూరింది. మరి కొత్తగా ప్రవేశించిన రాజకీయ నాయకుడు ఎవరైనా నిలదొక్కుకోవాలంటే ఈ కులపరమైన అనుబంధాలను ఛేదించవలసి ఉన్నది. ‘బిహార్‌ ఫస్ట్‌’ అనే ఆకర్షణీయమైన నినాదం ఎంతమాత్రమూ పనిచేయదు.. ఎందుకని? బిహారీ ఉప జాతీయవాదం కంటే కుల గుర్తింపులు బలంగా ఉండడమే (బిహార్‌లో ఏకీకృత సాంస్కృతిక, భాషా గుర్తింపు లేదు. ఉమ్మడి గుర్తింపు భావాన్ని సృష్టించడానికి ఛత్‌ పూజ పండుగ లేదా మధుబని పెయింటింగ్‌ల వంటి సాంస్కృతిక చిహ్నాలను ప్రోత్సహించినా ఆశించిన ఫలితాలు సమకూరలేదు). ఓటు వేయవచ్చేసరికి ప్రతి బిహారీ కూడా కుల గుర్తింపునకు ప్రాధాన్యమివ్వడం పరిపాటి. ఎన్నికల ఫలితాలతో ప్రశాంత్‌ కిశోర్‌కు ఈ కఠోర వాస్తవం అవగతమయి ఉంటుంది.


‘యువ’ ఓటర్లే తాను ఆశిస్తున్న మౌలిక మార్పుకు దోహదం చేస్తారని ప్రశాంత్‌ కిశోర్‌ భావించారు. బిహార్‌ ఓటర్లలో 22శాతం మంది 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారే. అయితే ఇంతకంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లు మహిళలు. మన ఎన్నికలలో జయాపజయాలకు వీరే నిజమైన నిర్ణయాత్మక శక్తులు అనడంలో అతిశయోక్తి లేదు. యువ ఓటర్లు ఆదాయ స్థాయి ప్రాతిపదికన చీలిపోయి వున్నారు. అయితే మహిళా ఓటర్లు నితీశ్‌ కుమార్‌కు అత్యంత విశ్వసనీయమైన మద్దతుదారులుగా ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం తొలుత అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహిళలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలే అందుకు ప్రధాన కారణమని మరి చెప్పనవసరం లేదు. మద్య నిషేధం ఎత్తివేత ప్రశాంత్‌ కిశోర్‌ ఇచ్చిన హామీలలో ఒకటి. దీనిపై పెద్ద చర్చే జరిగింది. గ్రామీణ మహిళా ఓటర్ల దృష్టిలో అది వివేకవంతమైన నిర్ణయం కాదు. మద్య నిషేధాన్ని మహిళా ఓటర్లు అందరూ సమర్థించారు. ఆర్థిక ప్రయోజనాల కంటే ప్రజారోగ్యం, శాంతిభద్రతలు మొదలైన అంశాలు ఎక్కువ ప్రభావం చూపాయి. బిహార్ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించినప్పుడు యువజనులు పీకే గురించి విశేషంగా మాట్లాడుకోవడం గమనించాను. అయితే మహిళలు ఎవరూ ఆయన గురించి పట్టించుకున్నట్లు ఏ మాత్రం కన్పించలేదు. అంతిమంగా మహిళల ఓట్లే బిహార్‌ ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశాయి.

జన్‌సురాజ్‌ పరాజయంతో ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా? అవును, కాదు. అవును– పీకే బ్రాండ్‌ మీడియా ఆధారిత రాజకీయ మార్కెటింగ్‌కు పరిమితులు ఉన్నాయని స్పష్టమయింది. అయితే, రాబోయే దశకంలో బిహార్‌ రాజకీయాలు నితీశ్‌–లాలూ అనంతర యుగంలోకి నిలకడగా ప్రవేశించనున్నాయి. ప్రత్యామ్నాయ నాయకత్వాలను అవి ఆశిస్తాయి, అన్వేషిస్తాయి. ప్రశాంత్‌ కిశోర్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి, బలమైన అట్టడుగు స్థాయి సంస్థాగత నిర్మాణం, విస్తృత సామాజిక సంఘీభావాన్ని కూడగట్టుకుని తనను తాను సర్వజనామోద నాయకుడుగా పునరావిష్కరించుకోగలిగితే బిహార్ చరిత్రకు ఆయనే వేయగలిగే మార్గం ఒకటి తప్పకుండా ఉంటుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 01:34 AM