Share News

Buddhavarapu Venkataratnam: నిబద్ధతకు మారుపేరు బుద్ధవరపు

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:30 AM

నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస వరకు నిలబడిన పత్రికా రచయిత బుద్ధవరపు వేంకటరత్నం (నవంబర్‌ 17, 1925 – నవంబర్‌ 9, 2025). స్వతంత్ర భారతదేశ తొలితరం తెలుగు పత్రికా సంపాదకులలో ఆయన ఒకరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం...

Buddhavarapu Venkataratnam: నిబద్ధతకు మారుపేరు బుద్ధవరపు

నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస వరకు నిలబడిన పత్రికా రచయిత బుద్ధవరపు వేంకటరత్నం (నవంబర్‌ 17, 1925 – నవంబర్‌ 9, 2025). స్వతంత్ర భారతదేశ తొలితరం తెలుగు పత్రికా సంపాదకులలో ఆయన ఒకరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని నాయకంపల్లిలో పుట్టారు. సామర్లకోట, రాజమండ్రిలలో విద్యాభ్యాసం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో చదివినప్పుడు రచయితలు నండూరి రామ్మోహనరావు, కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం వారి సహాధ్యాయులు. 1940లో వేంకటరత్నం తరుణప్రాయంలోనే ఆరెస్సెస్‌ పట్ల ఆకర్షితులయ్యారు. ఆ కాలంలో నాగపూర్‌ నుంచి తెలుగు ప్రాంతానికి ప్రచారకులుగా వచ్చిన వీఎల్‌ దేశ్‌ముఖ్‌ ఉపన్యాసం విన్న వేంకటరత్నం స్వయంసేవక్‌గా, అటు తరువాత ప్రచారక్‌గా (1944) మారారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పనిచేసిన ఆయన 1948లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయాల వ్యాప్తి కోసం ఏర్పడిన ‘జాగృతి’ తెలుగు వారపత్రికకు వ్యవస్థాపక సంపాదకులు అయ్యారు. 1948 చివరలో ప్రారంభమైన జాగృతి తొలి సంచికతోనే నిషేధానికి గురైంది. గాంధీజీ హత్య నేపథ్యంలో ఆరెస్సెస్‌ను నిషేధించిన క్రమంలోనే ఆ సంస్థ ఆశయాల కోసం ఏర్పడిన జాగృతిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అయితే నాటి కృష్ణాజిల్లా కలెక్టర్‌ క్రోంబితో వాదించి పత్రికను పునః ప్రారంభించడానికి అనుమతి తెచ్చుకున్నవారు వేంకటరత్నం. విజయవాడ కేంద్రంగా వెలువడిన జాగృతి కోసం ఆయనతో పాటు బండారు సదాశివరావు, విశ్వనాథయ్య తదితరులు పనిచేశారు.

గాంధీజీ హత్య తరువాత ఆరెస్సెస్‌ మీద తీవ్ర దుమారం మొదలయింది. అయితే అవన్నీ దుష్ప్రచారంలో భాగమని, గాంధీ హత్యకు ఆరెస్సెస్‌కు సంబంధం లేదని ప్రత్యేక న్యాయస్థానం తరువాత వెల్లడించింది. కానీ ఇంతలోనే ఎంతో నష్టం జరిగింది. ఎందరో స్వయం సేవకులను జైళ్లకు పంపించారు. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కొనడానికి ప్రాంతీయ భాషలలో పత్రికలు ప్రారంభించాలని ఆరెస్సెస్‌ రెండో సర్‌ సంఘచాలక్‌ గురూజీ (గోల్వాల్కర్‌) ఆశయం మేరకు కొన్ని పత్రికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రధర్మ పత్రికకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, పాంచజన్య పత్రికకు అటల్‌ బిహారీ వాజపేయి అలా సంపాదకులుగా నియమితులయ్యారు. తెలుగు పత్రికకు బుద్ధవరపు నియమితులయ్యారు. వీరు ముగ్గురు సన్నిహితులు కూడా. 1948 నుంచి 1957 వరకు వేంకటరత్నమే జాగృతి సంపాదకులు.


వేంకటరత్నం కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త. గురూజీ ఆదేశం మేరకు ఆయన పత్రికా రచన కొత్తగా చేపట్టారు. గాంధీజీ హత్యానంతర పరిణామాలు, భారత్‌–పాక్‌ తొలి యుద్ధం, కాందిశీకుల సమస్యలతో నాటి సంక్షుభిత భారతం ఎలా ఉన్నదో జాగృతి నాటి సంచికలు ప్రతిబింబిస్తాయి. ఆ పరిణామాల మీద ఆయన ఇచ్చిన వివరాలు, విశ్లేషణలు ఎంతో లోతుగా కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, నిజాం పతనానంతరం తెలంగాణలో పరిస్థితులు వంటి వాటి గురించి ఆయన గొప్ప చారిత్రక దృష్టితో కథనాలు వెలువరించారు. సాహిత్యం వేంకటరత్నం అభిమానాంశం. చారిత్రక అంశాలే ఇతివృత్తంగా స్వయంగా కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితల కథలను ఆయన విరివిగా ప్రచురించారు. జైసోమనాథ్‌ వంటి చారిత్రక నవలల అనువాదాలు కూడా ప్రచురించారు. జాతీయ అంతర్జాతీయ అంశాలపై చాలా మంది ప్రముఖుల వ్యాసాల అనువాదాలు కూడా ఆనాటి జాగృతిలో తరచుగా దర్శనమిచ్చేవి.

1960 దశకం నుంచి కరణీకం (యెర్రమిల్లి, తూర్పుగోదావరి జిల్లా) ఆరంభించి, 80 దశకంలో ఆ వ్యవస్థ రద్దయిన తరువాత హైదరాబాద్‌లో మళ్లీ పత్రికా రచయితగా జీవితం ఆరంభించారు. ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఒక కాలు తొలగించారు, నాలుక కూడా తెగింది. దాదాపు రెండు దశాబ్దాలు మంచం మీదే ఉన్నా, ఏనాడూ నిరాశకు లోనవ్వలేదు. ఎవరు వచ్చినా జ్ఞాపకాలు పంచుతూ నిండు నూరేళ్లు జీవించారు.

పి. వేణుగోపాలరెడ్డి

ఏకలవ్య ఫౌండేషన్‌, జాగృతి పూర్వ సంపాదకుడు

(హైదరాబాద్‌ కాచిగూడలోని జాగృతి కార్యాలయంలో

నేడు బుద్ధవరపు వేంకటరత్నం సంస్మరణ సభ)

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 01:30 AM