Share News

India National Symbols: జాతీయ చిహ్నాలలో విశాల దృక్పథం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:30 AM

జాతీయ చిహ్నాల రూపకల్పనలో ఆత్మనూన్యత ప్రభావం ఉందనుకోవడం సరికాదు. స్వయంసేవకుడైన ప్రధానమంత్రి ఆ విధమైన అభిప్రాయంతో ఉండటం, స్వయంగా ఆ వ్యాఖ్యలు కూడా...

India National Symbols: జాతీయ చిహ్నాలలో విశాల దృక్పథం

జాతీయ చిహ్నాల రూపకల్పనలో ఆత్మనూన్యత ప్రభావం ఉందనుకోవడం సరికాదు. స్వయంసేవకుడైన ప్రధానమంత్రి ఆ విధమైన అభిప్రాయంతో ఉండటం, స్వయంగా ఆ వ్యాఖ్యలు కూడా చేయడం బాధాకరం. వాస్తవానికి మన జాతీయ చిహ్నాల రూపకల్పన చాలా విశాల దృక్పథంతో జరిగింది. భారతదేశం అనేక రకాల మత విశ్వాసాలకు నెలవు అనేందుకు మన జాతీయ పతాకం ప్రతీక. వాస్తవానికి భారత రాజ్యాంగ సభ ఆమోదించిన జాతీయ పతాకంలో ఏ రంగుకీ మతం అంటగట్టలేదు.

వందేమాతరం ఉద్యమానికి ముందు భారతదేశానికి ఓ జాతీయ పతాకమంటూ లేదు. మత ప్రాతిపదికన జరిగిన బెంగాల్ విభజన మూలంగా తలెత్తిన వందేమాతరం ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7, 1907న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ వద్ద తొలిసారి జాతీయ పతాకం ఆవిష్కరించారు. తొలి జాతీయ పతాకాన్ని సచీన్ద్ర ప్రసాద్ బోస్ రూపొందించారు. రెండవ అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ జరుగుతున్న సందర్భంగా తొలిసారి అంతర్జాతీయ వేదికపై మేడం బికజీ రుస్తుం కామా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ పతాకాన్ని హేమచంద్ర కనుంగో రూపొందించారు. 1917లో హోమ్ రూల్ ఉద్యమంలో బాలగంగాధర్‌ తిలక్, అనీబిసెంట్ జనంలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఓ జాతీయ పతాకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. 1921లో సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్నపుడు గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో పింగళి వెంకయ్య ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులతో మధ్యలో చరఖాతో జాతీయపతాకాన్ని రూపొందించారు.

1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్‌లో జాతీయపతాకం రూపకల్పనకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని, మధ్యలో తెలుపు రంగుపైన చరఖాను పెడుతూ, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను కొద్దిపాటి మార్పులతో ఆమోదించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆంగ్లేయులు నిర్ణయించినపుడు మహాత్మాగాంధీ ఆమోదంతో చరఖా స్థానంలో అశోక చక్రాన్ని పెడుతూ ప్రస్తుతం మనం చూస్తున్న జాతీయ జెండా రూపకల్పన అయింది. 22 జూలై, 1947న ఈ జాతీయ జెండాను రాజ్యాంగసభ ఆమోదించింది.


మన జాతీయ చిహ్నాలు నూటికి నూరుపాళ్లు భారతీయమైనవే, భారతదేశ అంతరాత్మను వ్యక్తీకరించేవే. జనంలో దేశభక్తిని నింపడానికి ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు నిర్వహించిన నరేంద్ర మోదీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకున్న మర్మం... తిరంగా జెండా స్థానంలో సంఘ్ ఎగురవేసే ధర్మధ్వజ్ లేదా భగ్వాధ్వజ్‌ను ప్రతిష్టించడమా?

కుమార్‌బాబు గౌరాబత్తిన

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

For More TG News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 12:31 AM