Bojja Tarakam: పీడిత జన హృదయ తారకం
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:42 AM
అణగారిన ప్రజల ఆశాజ్యోతి, దళిత, పౌర హక్కుల నాయకుడు, ప్రజా న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ నాయకుడు, కవి, రచయిత, గొప్ప వక్త బొజ్జా తారకం మన నుంచి భౌతికంగా దూరమై తొమ్మిదేళ్ళు దాటింది. ఇంకా ఆయన స్ఫూర్తి సమాజంలోని...
అణగారిన ప్రజల ఆశాజ్యోతి, దళిత, పౌర హక్కుల నాయకుడు, ప్రజా న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ నాయకుడు, కవి, రచయిత, గొప్ప వక్త బొజ్జా తారకం మన నుంచి భౌతికంగా దూరమై తొమ్మిదేళ్ళు దాటింది. ఇంకా ఆయన స్ఫూర్తి సమాజంలోని పీడిత ప్రజల ప్రేమికులకు, ప్రగతిశీల శక్తులకు బాసటగా నిలుస్తూనే ఉంది. బొజ్జా తారకం 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా కందికుప్ప గ్రామంలో బొజ్జా అప్పలస్వామి–మావుళ్ళమ్మ దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా జన్మించారు. ‘‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా ప్రజానీకానిది’’ అని కవి కాళోజీ అన్నట్లుగా బొజ్జా తారకం విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు పీడిత ప్రజల అభివృద్ధి కోసమే పోరాడి ఒక ఉజ్వల చరిత్రను మన కళ్ల ముందు నిలిపారు.
దేశంలోని ఉత్పత్తి సాధనాలు ఉత్పత్తి శక్తులకు దక్కినప్పుడే, ముఖ్యంగా భూమి పీడిత ప్రజలకు దక్కితేనే వారికి రెండు పూటలా భోజనంతో పాటు సమాజంలో గౌరవం దక్కుతుందని భావించేవారు తారకం. ఈ దేశంలో భూమి కోసం, ఉత్పత్తి సాధనాల కోసం ఉత్పత్తి శక్తులు చేసే పోరాటం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించాలని ఆయన నమ్మారు. మార్క్స్ సిద్ధాంతంతో పాటు, అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని మేళవించిన ఉజ్వల పోరాటమే ఈ దేశంలో వర్గ–కుల నిర్మూలనను సాధిస్తుందని ఆయన విశ్వసించారు. అందుకు అనుగుణంగా సైద్ధాంతిక ఆలోచనను కూడా అక్షర రూపంలో పెట్టి ‘కులం– వర్గం’ అనే పుస్తకాన్ని 1996లో మొదటి ప్రచురణగా తీసుకువచ్చారు. తారకం గారి ‘పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమి చేయాలి’ అనే పుస్తకం లాగే ఈ ‘కులం–వర్గం’ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. కుల–వర్గ నిర్మూలన కోసం పని చేస్తున్న ప్రతి వ్యక్తికీ శక్తికీ ఇది చేరింది. ఈ పుస్తకాలతోపాటు ఆయన ఇతర రచనలైన ‘నది పుట్టిన గొంతుక’, ‘దళితులు–రాజ్యం’, ‘నేల, నాగలి, మూడెద్దులు’, ‘ఎస్సీ ఎస్టీ నిధులు: విదిలింపు–మళ్ళింపు’, ఇంకా డా. బి.ఆర్. అంబేడ్కర్ మూల రచనల నుంచి కొన్ని తెలుగు అనువాదాలు, వందలాది వ్యాసాలు, కవితలు తెలుగు సమాజం మీద చాలా ప్రభావం చూపాయి.
ఈ దేశానికి పట్టిన చీడయిన కులవ్యవస్థకు పునాదిగా ఉన్న మనుధర్మశాస్త్రాన్ని తగలపెట్టకుండా, ఆ శాస్త్రం ద్వారా ఆచరించబడుతున్న కుల, వర్ణ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించకుండా, దేశంలోని దళిత, ఆదివాసీ ప్రజలకూ, స్త్రీలకూ ఆత్మగౌరవం దక్కదన్నది బొజ్జా తారకం ప్రగాఢ విశ్వాసం. ఆ వెలుగులో జరిగిన పోరాటాలైన కారంచేడు, తిమ్మసముద్రం, పదిరికుప్పం, చుండూరు, లక్ష్మీదేవిపేట పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. సమాజంలోని ప్రగతిశీల శక్తుల సంఘీభావం సంపాదించారు. న్యాయస్థానాలలో ఆయా సంఘటనలలోని దోషులను శిక్షించే విధంగా నికార్సయిన ఉద్యమకారునిగా, పీడిత ప్రజల పౌర హక్కుల న్యాయవాదిగా అలుపెరుగని పోరాటం చేశారు. ఒకవైపు న్యాయస్థానాలలో ప్రజలవైపు నిలబడి అత్యంత నైపుణ్యంతో వాదనలు కొనసాగిస్తూనే, మరోవైపు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు.
కార్మిక నాయకునిగా, దళిత నాయకునిగా, పౌరహక్కుల నాయకునిగా నిస్వార్థంగా ప్రజా స్వామిక వ్యవస్థలో ఈ ప్రజలకు నాయకత్వం వహించాలని చాలా ఎన్నికలలో పోటీచేసినా, అధికారం, డబ్బు, మద్యం, ఆశ్రిత పక్షపాతం, రిగ్గింగ్‌తో గెలిచే ఎన్నికలలో ఓడిపోయారు. కానీ పీడిత ప్రజల మనసులను గెలిచారు. దేశ ఎన్నికల స్వరూపాన్ని బహిర్గతం చేశారు. సమాజంలో పీడన, అణచివేత, శ్రమ దోపిడీ ఉన్నంతవరకు ప్రజా పోరాటాలు ఫీనిక్స్ పక్షి లాగ ఉవ్వెత్తున లేస్తూనే వుంటాయని, వాటికి తమవంతు కర్తవ్యంగా సహకారం అందించాలని బోధిస్తూ ఆచరణలో తానూ భాగమయ్యేవారు. ఇందులో భాగంగానే అనేక కార్మిక సంఘాలకు న్యాయ సలహాదారుడిగా, రిపబ్లికన్ పార్టీ, పౌర హక్కుల సంఘం, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకుడిగా చివరిశ్వాస వరకు కొనసాగారు.
తారకం గారితో కలిసి ప్రజాస్వామిక ఉద్యమాలలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా 2004 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పార్టీలతో జరిపిన చర్చలలో ‘భూమి’ ప్రధాన ఎజెండాగా మారిన సమయంలో ‘ప్రజాభూమి కమిషన్’ ఏర్పాటులో తారకం ఆ కమిషన్‌కు చైర్మన్‌గా, నేను కన్వీనరుగా ఎన్నికయ్యాం. మానవహక్కుల నాయకులు, అమరులు నరేంద్రనాథ్, ఆదివాసీ నాయకులు, అమరులు శిడం శంభులు కో–కన్వీనర్లుగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా భూస్వాముల, కబ్జాదారుల, పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో చిక్కిన భూమి వివరాలు, ప్రభుత్వం దగ్గర పేదలకు పంచేటందుకు ఉన్న భూమి వివరాలు సేకరించాం. ఇలా కలిసి పనిచేసిన రెండు, మూడు సంవత్సరాలూ నాకు ఎంతో విలువైనవి.
దళిత, ఆదివాసీ, ఇతర పీడిత ప్రజలకు భూమి దక్కాలని తారకం గారు నిరంతరం చేసిన కృషి, ఆ దిశగా జరిగే పోరాటాలకు ఆయన ఇచ్చిన మద్దతు మాటల్లో వివరించలేనిది. తారకం గారు 2014లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి గురయ్యారు. ఆఖరి క్షణాల్లో కూడా రోహిత్ వేములకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇటు న్యాయస్థానంలోను, అటు ప్రజాక్షేత్రంలోనూ పోరాడారు. సెప్టెంబర్ 16, 2016 రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. తారకం మన మధ్యలో భౌతికంగా లేకపోయినా, పీడిత ప్రజల పట్ల ఆయన నిబద్ధత, ఆయన ఆచరించిన విలువలు, చేసిన న్యాయ, ప్రజా పోరాటాలు చిరకాలం సజీవంగా ఉంటాయి.
చిక్కుడు ప్రభాకర్
కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
(నేడు బొజ్జా తారకం 9వ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News