Share News

Bhanumathi The Melodious Queen: మధుర విషాద కాళింది భానుమతి

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:29 AM

వివిధ కళల సమాహారంతో పండిత, పామరులను అలరిస్తున్న ఏకైక మాధ్యమం చలనచిత్రం. తెలుగులో నిర్మించబడిన ఉదాత్త, కళాత్మక, కుటుంబ చిత్రాల కారణంగా 1950–1981 ప్రాంతాన్ని తెలుగు చలనచిత్ర ‘స్వర్ణయుగం’గా...

Bhanumathi The Melodious Queen: మధుర విషాద కాళింది భానుమతి

వివిధ కళల సమాహారంతో పండిత, పామరులను అలరిస్తున్న ఏకైక మాధ్యమం చలనచిత్రం. తెలుగులో నిర్మించబడిన ఉదాత్త, కళాత్మక, కుటుంబ చిత్రాల కారణంగా 1950–1981 ప్రాంతాన్ని తెలుగు చలనచిత్ర ‘స్వర్ణయుగం’గా అభివర్ణిస్తున్నారు. ఎంతోమంది మహానటులు, నటీమణులు తెలుగు ప్రేక్షకుల మనస్సులపై గాఢమైన ముద్రనువేసి చిరస్మరణీయులయ్యారు. వారిలో అభినేత్రి, మధుర గాయని, కథా రచయిత్రి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత భానుమతీ రామకృష్ణ ఒకరు.

భానుమతి 1925 సెప్టెంబర్‌ 7న ఒంగోలు సమీపంలోని దొడ్డవరం గ్రామంలో బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులిద్దరికీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండడంతో సహజంగానే భానుమతికి సంగీతం పట్ల అభిలాష కలిగింది. పద్నాలుగేళ్ల వయసులోనే సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘వరవిక్రయం’లో కాళింది పాత్రను పోషించడమే కాక, ఆ సినిమాలో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించారు. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ భానుమతిని ప్రశంసించి ‘మధుర విషాద కాళింది’ అని తన పుస్తకంపై రాసి ఆమెకు బహూకరించారు. తదుపరి సంవత్సరాల్లో విశ్వనాథ కవిరాజు అనే హాస్య రచయిత భానుమతికి కథలు ఎలా రాయాలో సూచనలిచ్చారు. 1943లో తన నాలుగో చిత్రం ‘కృష్ణప్రేమ’లో నటిస్తుండగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ పి.ఎస్‌ రామకృష్ణను భానుమతి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సినిమా రంగానికి దూరంగా ఉండాలనుకున్నారామె. కానీ, నాటి ప్రసిద్ధ ‘వాహినీ’ డైరెక్టర్ బి.యన్.రెడ్డి, నటుడు లింగమూర్తి ఆమెను ఒప్పించి ‘స్వర్గసీమ’ (1946)లో నటింపజేశారు. ఆ చిత్రంలో ‘ఓహో పావురమా’ పాటతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు భానుమతి మరింతగా దగ్గరయ్యారు. అగ్రనటిగా, గాయనిగా గుర్తింపు పొందారు.


భరణి సంస్థ పతాకంపై ‘లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి’ మొదలైన చిత్రాలను నిర్మించారు భానుమతి. ఈ మూడు చిత్రాలూ తన నట జీవితంలో ఆణిముత్యాలని చెబుతూ నిర్మాత భానుమతిని అక్కినేని ప్రశంసించారు. బి.యన్.రెడ్డి నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మల్లీశ్వరి’. ఈ సినిమాలో భానుమతి తన విలక్షణ నటనతో పాటు, అపూర్వ గానంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘సెల్యులాయిడ్‌పై దృశ్య కావ్యం’ అంటూ సినీ పండితులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. విప్రనారాయణ చిత్రంతో భానుమతికి తెలుగు సినీ లోకంలో అగ్రపీఠం లభించింది. తాను నిర్మించిన కొన్ని చిత్రాల్లో తండ్రి కోరికపై ‘నగుమోము గనలేని’, ‘శరణం నీ దివ్యచరణం’, ‘శరణం భవ కరుణామయి’, ‘ఏ తావునరా నిలకడ నీకు’, ‘శాంతము లేక సౌఖ్యము లేదు’, ‘ప్రక్కల నిలబడి’ వంటి శాస్త్రీయ సంగీత పాటలను ఆలపించారు. ఆరోగ్యకర హాస్యం తొణికిసలాడేలా ‘అత్తగారి కథలు’ను భానుమతి రచించారు. ఆ కథలు ఇలా సాగుతాయి.. అత్తగారు సత్తెకాలం మనిషి. అన్నీ తనకే తెలుసుననుకునే అమాయకురాలు. ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో ఆ అత్తగారికి తెలియదు. తోటలో పనిచేసే పాలవాడికి ఇద్దరు భార్యలు. ‘మీరిద్దరూ సవతులైనా పోట్లాడుకోరేమే’ అంటుంది అత్తగారు. బారిష్టర్ పార్వతీశంలాగా భానుమతి ‘అత్తగారు’ ఒక విశిష్టమైన పాత్ర. ఈ కథల గురించి ప్రముఖ రచయిత ‘భరాగో’ (భమిడిపాటి రామగోపాలం) విలువైన వ్యాసాలతో ఆమె స్మృతి సంచికను 2006లో ప్రచురించారు. శారదా అశోకవర్ధన్, ఇంద్రగంటి జానకీబాల వంటి ప్రముఖ రచయిత్రులు భానుమతి జీవిత విశేషాల గురించి పుస్తకాలు రాశారు.

భానుమతి మాట పెళుసు, కానీ మనసు నవనీతం. ఈ పురుషాధిక్య సమాజంలో ‘స్త్రీ శక్తి స్వరూపిణి. ఆత్మవిశ్వాసంతో మహిళలు ఉన్నతంగా ఎదగగలర’ని ఆమె నిరూపించారు. ‘నాకు లభించిన సంగీత సాహిత్యాలు దేవీ ప్రసాదాలు. నిజాన్ని నిష్ఠురంగా మాట్లాడే నన్ను కొంతమంది గర్విష్టిగా భావిస్తే అందుకు నేను బాధ్యురాలిని కాను’ అనేవారు. సినీరంగంలో ఎన్నో విజయాలు సాధించినా, తాను సగటు మధ్యతరగతి గృహిణిగానే ఉండడానికి ఇష్టపడేవారు. ప్రతిరోజూ దేవీపూజతో, ఆధ్యాత్మిక చింతనతో సంగీత సాహిత్య గోష్ఠులతో గడిపేవారు. సినీ రంగంలో ఎవరితోనూ అతిగా సాన్నిహిత్యం పెంచుకునేవారు కాదు. తనకు తాను గిరి గీసుకుని ‘తామరాకు మీద నీటిబొట్టు’ (ఈ పేరుతో ఆమె నిర్మించిన టీవీ సీరియల్ 2001లో ప్రసారం అయింది)లా భానుమతి జీవించారు. ‘అత్తగారి కథలు’ను కూడా తాను అత్తగా, గీతాంజలి కోడలుగా సీరియల్ నిర్మించారామె.


భానుమతిని అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. ‘పద్మశ్రీ’ (1966), ‘పద్మభూషణ్’ (2000) వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో పాటు ‘అత్తగారి కథలు’కు ‘ఆంధ్ర సాహిత్య అకాడమి’ పురస్కారం, ఆవిడ ఆత్మకథ ‘నాలో నేను’కు కేంద్ర ప్రభుత్వం పురస్కారం లభించాయి. ఇవేగాక తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’, అన్నాదురై చేతుల మీదుగా ‘నటనకు వ్యాకరణం’ అనే బిరుదు పొందారు. వీటితో పాటు రాజాలక్ష్మి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం (2004) ఆమెను వరించాయి. ఎం.జి.ఆర్. ఆమెను కొంతకాలం తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించారు.

పలు సందర్భాల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, పీవీ రాజమన్నార్, బెజవాడ గోపాలరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, ఖాసా సుబ్బారావు, మాలతీచందూర్ దంపతులు, వాసిరెడ్డి సీతాదేవి వంటి ప్రముఖులు భానుమతి విలక్షణతను, పాండిత్యాన్ని ప్రశంసించారు. శివాజీ గణేశన్, శోభన్‌బాబు, జానకి, కృష్ణకుమారి, మనోరమ వంటి తారలు ఆమెను ఎంతగానో అభిమానించేవారు. తెలుగు సినీ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా జీవించిన భానుమతి మధుమేహం సంబంధిత ఆరోగ్య సమస్యలతో 2005 డిసెంబర్ 24న కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి వారిని తెలుగు ప్రజలు ఎలా మరువలేరో, అలాగే భానుమతి అభినయ కౌశలాన్ని, గాన మాధుర్యాన్ని, బహుముఖ ప్రజ్ఞనూ చిరకాలం జ్ఞాపకం చేసుకుంటారు.

డా. పి.దక్షిణామూర్తి

(నేడు భానుమతి శతజయంతి)

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 04:29 AM