Share News

మళ్లీ ప్రగతి పట్టాలపై భాగ్యాంధ్ర

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:33 AM

జగన్‌ ప్రభుత్వ జమానాలో చతికిలపడిన కీలక రంగాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కాయకల్ప చికిత్స సత్ఫలితాలు అందిస్తోంది. ఇందుకు ఉదాహరణ...

మళ్లీ ప్రగతి పట్టాలపై భాగ్యాంధ్ర

జగన్‌ ప్రభుత్వ జమానాలో చతికిలపడిన కీలక రంగాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కాయకల్ప చికిత్స సత్ఫలితాలు అందిస్తోంది. ఇందుకు ఉదాహరణ ప్రభుత్వంలో తగ్గిన దుబారా, క్రమంగా పెరుగుతున్న రాష్ట్ర ఆదాయం. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే రంగాల్లో ఒకటైన వాణిజ్య శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,420 కోట్ల రాబడిని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలల్లోనే వాణిజ్య శాఖ వసూళ్లు రూ.41,382 కోట్లు చేరాయి. మరో రెండు నెలల కాలంలో ఇంకో రూ.8,000 కోట్లు పైబడి రాబడి వస్తుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలపై అదనపు భారం మోపకుండానే సంప్రదాయ విధానాలలో మార్పులు తెచ్చి, సాంకేతిక పరిజ్ఞానం జోడించడంతో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులు తెలియజేశారు. పరిపాలనలో మార్పు చోటుచేసుకోగానే అధికారుల పనితీరు సైతం మెరుగైంది. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ.


వాణిజ్యశాఖతో పాటు జీఎస్టీ, వ్యాట్‌ వసూళ్లల్లో కూడా అధికారులు సమర్థంగా పనిచేస్తూ, లోపాలను సరిచేస్తుండటంతో ఈ రంగాల్లో కూడా ఆదాయం పెరుగుతోంది. ఇక, మద్యం అమ్మకాల ద్వారా జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాకు జమ అయిన మొత్తం కంటే కొందరి వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిందే ఎక్కువ కావడంతో, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పారదర్శక విధానాలు అనుసరించిన కారణంగాను, మద్యం అమ్మకాలను విధిగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా చేయడం వల్ల రాష్ట్రానికి సమకూరే ఆదాయం గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా మైనింగ్‌ రంగం ద్వారా గతంలో కంటే అధిక మొత్తం ఆదాయం లభించే అవకాశం ఏర్పడింది.

జగన్‌ పాలనలో విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో మొదలైనప్పటికీ, ఆర్థిక విధ్వంసం కొంత కనపడే విధంగా, కొంత కనబడని విధంగా జరిగింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా నిలిపివేయడం; మూడు రాజధానుల పేరుతో అమరావతి నగరాన్ని పాడు పెట్టడం; రాష్ట్రంలో రోడ్లకు పడిన గుంతలు సైతం పూడ్చకపోవడం, అమరరాజా బ్యాటరీస్‌ వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం; పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం జరిగాయి. మ్యాచింగ్‌ గ్రాంట్‌ సమకూర్చలేకపోవడంతో 26 కేంద్ర ప్రాయోజిత పథకాలను వదులుకోవడం; కేంద్రంతో సన్నిహితంగా మెలిగినప్పటికీ.. రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన నిధులను కూడా సాధించలేకపోవడం; విభజన చట్టం హామీల సాధనలో విఫలం కావడం; ల్యాండ్‌, శాండ్‌, బీచ్‌ శాండ్‌, మైనింగ్‌ వంటి రాష్ట్రానికి పుష్కలంగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను కొల్లగొట్టి రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టడం; అడ్డదారుల్లో విచ్చలవిడిగా దోచుకోవడం మొదలైన కార్యకలాపాలన్నీ ఆర్థిక దోపిడీ, ఆర్థిక విధ్వంసం కిందకే వస్తాయి.


జగన్‌ నిర్వాకం, అసమర్ధత, అవినీతి... రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు అధోగతి పాల్జేశాయి. నీతి ఆయోగ్‌ తన ‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2025’ నివేదికలో వెల్లడించిన ర్యాంకింగ్‌లను చూస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య స్థితిగతుల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం దక్కింది. నీతిఆయోగ్‌ వెల్లడించిన కీలక అంశాల్లో జగన్‌ జమానాలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితి దిగజారడం ప్రధానమైనది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ (ఆస్తుల కల్పనకు వినియోగించే ఖర్చు) 60.1 శాతం; సాంఘిక సంక్షేమ సేవల ఖర్చులు 84.3 శాతం మేర తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల 2018–19లో 17.1 శాతంగా ఉంటే, 2023–24లో 9.8 శాతంకు పడిపోయిందని నీతిఆయోగ్‌ పేర్కొంది. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్రానికి ఇంత తక్కువ ర్యాంకు ఎన్నడూ రాలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1996 నాటి ఆర్థిక పరిస్థితి మరోసారి ఎదురైంది. ఆనాడు ఏ విధంగానైతే ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అదే స్థితి ఎదురైంది. అయితే, ఆనాడు ఆ ఇబ్బందులను ఆయన చాలా వేగంగా అధిగమించగలిగారు. ఇప్పుడు కూడా ఒట్టిపోయిన రాష్ట్ర ఖజానాను కళకళలాడేలా చేయడం, ధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెట్టడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయించుకోగలగడం సామాన్యమైన విషయమేమీ కాదు. అయితే, సమస్యలను ఒక్కొక్కొటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న తీరు ఆశావహంగా ఉంది. ఇప్పటికే సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలు చేయడం, సకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు అందించడం, రోడ్ల గుంతలు పూడ్చడం, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను విడతల వారీగా కాంట్రాక్టర్లకు చెల్లించడం, పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం ద్వారా నిధులు సాధించడం, దాదాపు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎంఓయూలు కుదుర్చుకోవడం తదితర చర్యలన్నీ పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించేవే!


ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.3 శాతం మేర పెరిగి 13 శాతానికి చేరుకుంది. ఇది సామాన్యమైన విజయం కాదు. అయితే, హామీలను నెరవేర్చే విషయంలో ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఎదురవుతున్నది. వీటిని కూడా దశల వారీగా అమలు చేసేందుకు చంద్రబాబు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. 6 కీలక విధానాలు– పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్‌, క్లీన్‌ ఎనర్జీ, పర్యాటకం మొదలైన రంగాలలో స్పష్టమైన విధానాలను అనుసరించనున్నారు. అదేవిధంగా ‘పి4’ (పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్‌ పార్టీసిపేషన్‌) విధానం ద్వారా ప్రతియేటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 13 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని నిర్దేశించుకొన్న లక్ష్యం నెరవేరినట్లయితే, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం కష్టమేమీ కాదు. ‘2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌’ అనేది కేవలం నినాదంగా కాక.. ఒక బలమైన సంకల్పంగా ముందుకు తీసుకెళుతున్నారు.

చంద్రబాబు మొదట్నుంచీ తను ఉన్న కాలాని కంటే ఎంతో ముందుగా ఆలోచన చేస్తారు. 1996 ప్రాంతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని ప్రతిపాదనలు, ఆచరణలోకి తెచ్చిన కొన్ని పథకాల్ని చాలా మంది అర్థం చేసుకోలేక అప్పట్లో ఎద్దేవా చేసేవారు. ఆయన ‘ఐటి’ జపం చేస్తున్నాడని, కంప్యూటర్లు కూడు పెట్టవని అవహేళన చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, పరిపాలనను పరుగుపెట్టిస్తోంటే.. హైటెక్‌ ముఖ్యమంత్రి అంటూ అపహాస్యం చేయాలని చూశారు. ‘విజన్‌–2020’ అంటే అదో పనికిరాని పత్రం అని కొట్టిపారేశారు. కానీ, చివరకు జరిగిందేమిటి? రాష్ట్రానికి ఒక దిశ, దశను చంద్రబాబు ఏర్పరిస్తే.. దానిని అంధకారంలోకి నెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చొరవ, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మళ్లీ వెలుగురేఖలు విచ్చుకోవాలి. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్‌ సగర్వంగా నిలబడాలి. దాదాపు పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువత శాస్త్ర సాంకేతిక నైపుణ్యం సంతరించుకొని చైతన్యవంతమై మెరుగైన అవకాశాలు పొందడం కోసం రాష్ట్రాన్ని వీడి ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లి నిలదొక్కుకొన్నారు. అమెరికాలోనైతే యూదుల మాదిరిగా తెలుగువారు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అవుతున్నారు. అందరూ గుర్తించే స్థాయిలో ఓ ప్రబల ఆర్థికశక్తిగా తెలుగు కమ్యూనిటీ అవతరించిందనడం అతిశయోక్తి కాదు.


ప్రపంచ దేశాల్లోనే కాదు.. స్వరాష్ట్రంలోని ధనికులు సైతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఒక్క ధనికుడు కనీసం ఓ పేద కుటుంబాన్ని పైకి తేవడానికి నడుం బిగించాలి. నిజానికి, పాతికేళ్ల క్రితం ‘జన్మభూమి’ స్ఫూర్తిని చాటి పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకోవడానికి తమ కష్టార్జితాన్ని ప్రతి ఒక్కరూ వెచ్చించిన తీరు ఓ ఉజ్జ్వల చరిత్ర. అటువంటి చరిత్రను తిరగ రాయాలని చంద్రబాబు కోరుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి నడుం బిగించిన చంద్రబాబునాయుడు లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే ఆంధ్రప్రదేశ్‌కు పునర్వైభవం కలుగుతుంది. ఆర్థికాభివృద్ధి దిశలో వడివడిగా అడుగులు వేయగలుగుతుంది.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు


Also Read:

Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 20 , 2025 | 01:33 AM