Legacy of Gopireddy Ramakrishna Rao: ఎంత లలితమో అంత అనల్పం
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:35 AM
కొబ్బరి తోటల్ని, తమలపాకు తీగల్ని, కాలిబాటకి ఇరువైపులా రెల్లుపొదల్లో తేనెపిట్టల రుతాల్ని దాటి; నీరెండకి పారదర్శకమైన నదిని ఓ తెరచాప పడవలో దాటుకుని ప్రియ కవిమిత్రుడు గోపిరెడ్డి రామకృష్ణారావు...
కొబ్బరి తోటల్ని, తమలపాకు తీగల్ని, కాలిబాటకి ఇరువైపులా రెల్లుపొదల్లో తేనెపిట్టల రుతాల్ని దాటి; నీరెండకి పారదర్శకమైన నదిని ఓ తెరచాప పడవలో దాటుకుని ప్రియ కవిమిత్రుడు గోపిరెడ్డి రామకృష్ణారావు (1969–2024) కవితల్ని సమీపించేవాడిని నేను. ఒకప్పుడు అది నాకెంతో హృద్యమైన ప్రయాణం. ఆ సాయంత్రాలెంత రమ్యమో అంత అగమ్యగోచరం. ఆయన కవితలెంత లలితమో అంత అనల్పం.
VVV
రామకృష్ణ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తణుకు. తండ్రి మిఠాయి వ్యాపారం చేసేవారు. దుకాణంలో చేదోడుగా ఉన్నప్పుడు పొట్లాలుకట్టే కాగితాల్లో కవిత్వం మీద రామకృష్ణ దృష్టిపడింది. అదిమొదలు కవిత్వాన్ని ఆవాహన చేయడం ఆరంభించారు. తొలినాళ్ళలో హైకూ కవులతో ఎక్కువగా ప్రభావిత మయ్యారు. కొప్పర్తి వెంకటరమణమూర్తి, బి.వి.వి.ప్రసాద్ గార్ల సాంగత్యంలో ఆయన ఆవరణంలోని కాంతి మరింత పరివ్యాప్తం అయింది.
1990 నుంచి 2020 మధ్య నిదానంగా రచన సాగించారు. గోధూళివేళ అదాటున అల్లల్లాడే తూనీగ రెక్కలంత సున్నితత్వంతో హైకూలని సృజించారు. ఇస్మాయిల్ ప్రశంసకు పాత్రులయ్యారు. 2005లో ‘వెన్నెలగా వుంది’ పేరిట హైకూ సంపుటిని వెలువరించారు. అవిరామ మానవ జాగరణని, చిరంతన విషాదోల్లాసాన్ని వచన కవితలోకి పట్టితెచ్చారు. కవితల్ని ఒక సంపుటిగా చూసుకోవాలని పలుమార్లు ప్రయత్నించారు. అయితే గత ఏడాది అర్ధాంతరంగా మరణించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ వదిలివెళ్ళిన అముద్రిత స్వీయకవితలకి మునుపటి ‘వెన్నెలగా వుంది’ హైకూలని జతచేయగా ‘అదృశ్యానికి ముందు’ సంపుటి రూపుదిద్దుకుంది.
VVV
తెలుగు సాహిత్యంలో విప్లవ, దళిత, స్త్రీవాదధోరణులు వెల్లువలైన కాలంలోనే రామకృష్ణ కవిత్వరచన ప్రారంభమయింది. అయితే ఆయా ఉద్యమకవితలకి తనొక పాఠకుడు మాత్రమే. అప్పటికీ సమాంతరంగా కొనసాగుతున్న ‘అస్తిత్వ వాదం’ దృక్పథాన్ని ఆయన అనుసరించారు. అధివాస్తవికతవేపు కూడ మొగ్గుచూపారు. లభ్యమైన 31 కవితల్లో అధికభాగం స్వీయానుభూతితో రాసినవి కాగా కొన్ని సహానుభూతితో పలికినవి. అతితక్కువ కవితలు వస్తుగత వ్యక్తీకరణగా అల్లినవి.
రామకృష్ణ భావనాప్రపంచం ఎల్లలులేనిది. పచ్చికమైదానం మీంచి కాలిబాటని ప్రశ్నించే తత్వం తనది. కవిత నిర్వహణలో ఏకాగ్రత; శైలీపరంగా పరిభాష, ప్రతీకల్లో ప్రత్యేకత; అభివ్యక్తిలో సాంద్రత, క్లుప్తతలకు చదువరులు ముగ్ధులవుతారు. బహుశా పూర్వ, సమకాలిక సాహిత్యకారుల్ని అధ్యయనం చేయడంతోనూ, హైకూధ్యానంలోనూ ఈ లక్ష ణాలు అలవరచుకున్నారు. జపనీయ హైకూ కవులతో పాటు టాగోర్, చలం, ఆలూరి బైరాగి, వడ్డెర చండీదాస్, ఇస్మాయిల్, కె.శివారెడ్డి, వాడ్రేవు చినవీరభద్రుడు, గాలి నాసరరెడ్డిగార్ల రచనల్ని అభిమానంతో ఆయన చదవగా నేనెరుగుదును.
VVV
ఈ సంపుటిలోని ‘నేను–కాలమూ–నీడలూ’ కవితలో క్లుప్తత, గాఢతలను ఎంతో సముచితంగా పాటించారు: ‘‘మూల వొదిగిపోయిన నాకు/ కాంతిలోకంలో దుమ్ములు రేపుతున్న/ మకరందపు వానలో తడిపి జ్వరం చేస్తావు/ నీలం పూచే రాత్రి పరిమళాన్ని/ స్వర్ణం విచ్చే పగటి నులివెచ్చనిని/ తాపి నీవే నయం చేస్తావు మళ్ళీ/ నీ గాలిమీద ఆరేసుకుంటాను/ తడిసి తడిసి ఏడుస్తూ పిండుకొని.’’ భావగాంభీర్యం నిండిన కవితల్లో ‘మిణుగురు కేకలు’ ఒకటి: ‘‘ప్రాణం గావుకేక గావుకేక ప్రాణంలా/ గుండెలోనే మిగిలిపోతుంది/ ఒక స్వప్నం తైలవర్ణచిత్రంగా కరిగిపోతుంది/ దానిలో మిగిలిన చివురును తింటూ కీచురాయి నేను/ ఒకే ఒక నేను.’’
‘నేనే? నేనే!’, ‘ఆడుకోవాలనే వుంది’ కవితల్లోని ఈ పాదాల్లో కవి దృక్పథం, ఔన్నత్యం స్పష్టంగా వ్యక్తమయింది: ‘‘ఎండిన నూతిపక్క చేదలా నేను/ నిజ శూన్యాలకు నిజ దుఃఖాలకు నిజ అన్వేషణలకూ/ వొంటరితనమే సాక్షీభూతంలా నిలుస్తూ/ నేను ఎవరినీ నిందించను/ ఎప్పటికీ ఈ భూగోళాన్ని/ తలక్రిందులుగానే చూడగలనేమో/ నా జన్మ అది/ నేను ప్రశ్నలను ఎవరిని వేయను/ జవాబు చెప్పే పూచీని ఎవరినీ పడమనను/ గబ్బిలం తలక్రిందులుగా వేలాడి చూస్తూనే వుంటుంది.’’
‘‘నేను శత్రువుని ఎక్కడెక్కడో వెతకబోవడం లేదు/ ముఖ్యంగా మీలో/ ఇపుడు నాలోని శత్రువుని వెతికే ఆటను ఆడుతున్నాను/ దయచేసి నన్ను ఆడుకోనివ్వండి.’’
సాధారణంగా నాజూకుదనంతో రాసే రామకృష్ణ సందర్భాన్ని బట్టి తన సంవేదనని తీక్షణంగానూ, వాగ్వేగంతోనూ వెల్లడించారు. సంక్షిప్తకవితల్లాగే నిడివిగల కవితల్లో కూడ ‘కవిత్వం’ వైపు గురితప్పలేదు. ‘ఎలిజీ’ కవితలో గమనం చాలా బాగుంటుంది: ‘‘ఎర్రకంకర రంగు నిక్కరుతో/ బొత్తాలులేని పెదపెద పూలచొక్కాతో/ తొమ్మిదేళ్ళ పిల్లాడు/ వెన్నెల రాత్రి పల్లెపొలిమేరల్లో/ వొంటరిగా దేనికోసమో ఏడుస్తూ పరితపిస్తూ వుంటాడు నాలో.’’
బాల్య, యవ్వనకాలాల స్మృతులు కవి గుండెమీది పొరలుగా చుట్టుకునే ఉన్నాయి. అది కేవలం జ్ఞాపక పరంపర కాదు. అందుకనే ఈ కవిత్వంలో ఓ పూలచొక్కా కుర్రాడు కల తిరుగుతుంటాడు. అతడే చెలికాళ్ళతో దాగుడుమూతలు ఆడతాడు. వర్తమానంలో యువకుడై ఒక మిణుగురు దేహంతో, అరవలేక కీచురాయి ఆత్మతో రాత్రిరాత్రంతా ప్రపంచపు ముఖమ్మీద తిరుగుతూనే ఉంటాడు.
VVV
రామకృష్ణ ‘హైకూలు’ ప్రక్రియపరమైన నియమ నిబంధనలకు కట్టుబడినవా లేదా అనే అంశాన్ని నేను మూల్యాంకనం చేయను. 1990వ దశకంలో మనకు కొనసాగిన ‘హైకూ ఋతువు’లో వీటిని రాశారు. పసి సీతాకోకచిలుక రెక్కలమీద మెలమెల్లగా రంగులు అలంకృతమైనట్టు, అలముకున్న యావత్ పొగమంచు సూక్ష్మాకృతిలో తుహినకణంవలె రూపాంతరం చెందినట్టు, ఆకాశం నుంచి నడిజామున ఓ ఉల్క రెప్పపాటులో నేలరాలిపోయినట్టు, అంతరంగంలోని దురంత దుఃఖమంతా అశ్రుబిందువుగా కళ్ళ లోంచి బయల్పడినట్టు 131 హైకూలను రాసిపెట్టారు. ప్రతి కవిసమయంలోనూ సౌందర్యదృష్టికి ప్రాధాన్యం ఇచ్చినట్టు గానే ప్రాపంచిక వాస్తవికత ఎడల ఎరుకతోనే ఉన్నారు. పూలు, పిచ్చుకలు, తూనీగలు, సీతాకోకచిలుకలు, చంద్రుడు సహా అనాథ బాలుడు కూడ హైకూల్లో ప్రత్యక్షమవుతుంటాడు.
‘అస్తిత్వమూ స్వప్నమూ’ కవితలో రాశారు: ‘‘దేహమంతా పిట్టలు ఎగిరిపోయిన ఖాళీ/ శరీరమంతా మొగ్గలు తుంపేసిన బాధ/ పూలూ పత్రాలూ రాలిపోయిన నైరాశ్యం.’’ అయినప్పటికీ ఒంటరితనపు వ్యథలోంచి మహత్తరమైన జీవనకాంక్షతో చేతులు చాచారు. ‘నడుస్తూనే...’ కవితలో అంటారు: ‘‘నరాల్లో ప్రవహించేది, గుండెల్లో లయించేది/ ఉచ్ఛ్వాసంలో తీసుకునేది, నిశ్వాసంలో జారిపోవాల్సింది/ మనసులో విస్ఫోటించేది ఆగిపోతాయి/ నడుస్తూనే వుంటాను పిట్టల రెట్టల వర్షం కింద/ నడుస్తూనే వుంటాను అడుసు మట్టి దుఃఖం మీద.’’ ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనకంజవేయక జీవనయానం సాగిస్తానని గొంతెత్తారు.
VVV
అత్యంత సమీపంగా ప్రకృతిని దర్శించటంవల్ల, దైనందిన ఘటనలకి సుదూరంగా జీవితంపట్ల మెలకువతో ఉండటంవల్ల, మీదుమిక్కిలి కవి చేతనాసౌకుమార్యం వల్ల, కవిత్వ రచనని తపస్సమానంగా ఆచరించటం వల్ల ఇటువంటి మేలిమి సృజన సాధ్యమయింది. ఎంతో జాప్యం తర్వాత ఈ కవిత్వం ఈనాటికి వెలువడింది. అంతమాత్రాన తన ప్రాసంగికతని కోల్పోలేదు. సరికదా నేటికీ నవనవంగానే ఉంది.
VVV
కొబ్బరితోటలు కొబ్బరితోటల్లానే ఉన్నాయి. తేనెపిట్టల కూజితాలకి రెల్లుపొదలు కూడ రెపరెపలాడుతున్నాయి. ఆటుపోట్లతో జీవనది నిరంతరాయంగా ప్రవహిస్తోంది. రేవు దాటించేందుకు పడవ సిద్ధంగానే ఉంది. అయితే అక్కడ కవి అదృశ్యమయ్యారు. ఆయన కవితే మన చెంతకు చేరవచ్చింది. దీనితో రామకృష్ణ తదుపరి జీవితం ఆరంభమయింది.
నామాడి శ్రీధర్
93968 07070
(కాలరేఖ ప్రచురణగా గోపిరెడ్డి రామకృష్ణారావు కవిత్వ సంపుటి ‘అదృశ్యానికి ముందు’ ఆవిష్కరణ సభ అక్టోబరు 26 ఉ.10:30కి తణుకు సురాజ్య భవన్/ సిపిఐ ఆఫీసులో జరగనుంది. కొప్పర్తి, బి.వి.వి. ప్రసాద్, భగవంతం, నామాడి శ్రీధర్, గోపిరెడ్డి శ్రీసూర్యచరణ్ పాల్గొంటారు.)
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News