Tribals In India: ఆదివాసీలు ముమ్మాటికీ హిందువులే
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:47 AM
భారతదేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ ప్రత్యేకత. అయితే మతపరమైన చిచ్చుపెట్టి దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది. ఆదివాసీలు హిందువులేనా అనే కుట్ర మొదలైంది...
భారతదేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ ప్రత్యేకత. అయితే మతపరమైన చిచ్చుపెట్టి దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది. ఆదివాసీలు హిందువులేనా అనే కుట్ర మొదలైంది (భంగ్యా భూక్యా వ్యాసం: ‘ఆదివాసుల మతం ఏమిటి?’ జూలై 24, 2025).
ఆదివాసీలు ఎప్పుడూ హిందూ ధర్మానికి వెలుపల లేరు. వేదకాలం నుంచి మధ్యయుగం వరకు వారు హిందూ సామాజిక నిర్మాణంలో అంతర్భాగంగానే ఉన్నారు. వారి ఆచార వ్యవహారాలు, దేవతలు, పండుగలు హిందూ ధర్మంతోనే ముడిపడి ఉన్నాయి. ఆదివాసీ జీవన విధానంలో ప్రకృతి ఆరాధన ప్రధానమైంది. హిందూ ధార్మికతలో పంచభూత ఆరాధన దీన్నే సూచిస్తుంది. నేటికి అనేక ఆదివాసీ తెగలు హిందూ దేవతలను వారి పేర్లతో, రూపాలతోనే కొలుస్తారు. ‘ఆదివాసీలకు ప్రత్యేక మతం’ అనే భావన బ్రిటిష్ వలసవాదుల ‘విభజించి పాలించు’ విధానం నుంచి పుట్టింది. దీనికి ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడులకు మార్గం సుగమం చేయడమే. ఈ విభజన వాదానికి ఆధునిక రూపం సాంస్కృతిక మార్క్సిజం. ఇది హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని అణచివేతకు చిహ్నంగా చిత్రీకరించి, ఆదివాసీలను హిందూ సమాజం నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. విదేశీ నిధులు పొందే కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కుట్రపూరితంగా విదేశీ ఎజెండాను మన దేశంలో అమలు చేస్తూ ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం హిందూ మతం ఒక జీవన విధానమనీ, అది విభిన్న సంప్రదాయాలు, ఆచారాల కలయిక అని స్పష్టం చేసింది. ఆర్టికల్ 25 ప్రకారం సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా హిందూ మత పరిధిలోకి వస్తారు. కొంతమంది ఆదివాసీ మేధావులు స్వల్ప సంఖ్యలో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని అంటున్నప్పటికీ, ఇది మత మార్పిడుల ద్వారా ప్రభావితమైన ప్రాంతాల నుంచి వస్తున్నది.
పేర్లు, విధానాలు వేరైనా అనేక ఏళ్లుగా ఆదివాసీలు హిందూ పండుగల్లో భాగస్వాములే. దుర్గా పూజ, శివారాధన అనేక ఆదివాసీ తెగల ఆచారాల్లో అంతర్భాగంగానే ఉన్నాయి. ప్రకృతి ఆరాధన, పితృదేవతలను పూజించడం, నదులు, చెట్లను పవిత్రంగా భావించడం వంటివి హిందూ మతం, ఆదివాసీ సంప్రదాయాల్లో ఉమ్మడిగా కనిపిస్తాయి. నాగ ఆరాధన, భూమి పూజ, సూర్య నమస్కారాలు వంటి ఆచారాలు రెండు వర్గాలలోనూ ప్రచారంలో ఉన్నాయి. మహారాష్ట్రలోని వార్లీ, కోక్నా వంటి ఆదివాసీ తెగలు గణేష్ చతుర్థిని తమ సాంప్రదాయ నృత్యాలు, పాటలతో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని ఆదివాసీలు దసరా పండుగను విశేషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బస్తర్ దసరా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది 15వ శతాబ్దం నుండే వస్తున్న సంప్రదాయం.
రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలలో ఆదివాసీ పాత్రలు హిందూ మత విస్తృత పరిధిలో అంతర్భాగంగా ఉన్నాయి (ఉదాహరణకు – శబరి, నిషాద రాజు, గుహుడు, హిడం). ఈ గ్రంథాలు ఆదివాసీలను సమాజం నుండి వేరుచేయలేదు. మధ్యయుగంలో, అనేక ఆదివాసీ నాయకులు హిందూ రాజులతో సంబంధాలు ఏర్పరచుకోవడమే కాదు, రాజ్యాలను పరిపాలించారు. అనేక ఆదివాసీ రాజ్యాలు హిందూ ధర్మ సూత్రాలను అనుసరించాయి. పూర్వం వేద కాలంలో వేద సాహిత్యంలో అటవీ నివాసులైన ‘అరణ్యాని’ గురించి ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 1500–500 నాటి ఈ సాహిత్యం ఆదివాసీల ఉనికిని, వారి ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. మధ్యయుగంలో గోండు రాజులు, భిల్లు రాజులు హిందూ దేవాలయాలను నిర్మించారు, హిందూ సంప్రదాయాలను ప్రోత్సహించారు. ఉదాహరణకు, 17వ శతాబ్దంలో గోండు రాజు హృదయా షా నిర్మించిన దేవాలయాలు దీనికి నిదర్శనం.
బ్రిటిష్ వలస పాలన భారతదేశంలో ఆదివాసీల గుర్తింపుపై తీవ్ర ప్రభావం చూపింది. ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) పాలసీలో భాగంగాను, ఆదివాసీ ప్రాంతాలలో మిషనరీ కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా మత మార్పిడి చేయడంలో భాగంగాను బ్రిటిష్ వారు ఆదివాసీలను హిందూ సమాజం నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారు. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన జనాభా గణనలలో ఆదివాసీలను ‘అనిమిస్టులు’ (ప్రకృతి ఆరాధకులు) లేదా ‘ట్రైబల్ రిలీజియన్’ (గిరిజన మతం) అనే ప్రత్యేక వర్గంగా గుర్తించడం ప్రారంభించారు. 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఆదివాసులను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించడం, వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం కూడా ఈ విభజనకు మరింత ఆజ్యం పోసింది.
ఇక సాంస్కృతిక మార్క్సిజం అనేది కార్ల్ మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాలకు భిన్నంగా, సమాజంలోని సంస్కృతి, మతం, కుటుంబం వంటి సామాజిక సంస్థలను విశ్లేషించడానికి, విమర్శించడానికి ఉపయోగించే ఒక సైద్ధాంతిక దృక్పథం. దీని ప్రకారం, సంస్కృతి అనేది అణచివేతకు ఒక సాధనం, ఆధిపత్య వర్గాలు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి దీనిని ఉపయోగిస్తాయి. భారతీయ సందర్భంలో, సాంస్కృతిక మార్క్సిస్టు ఆలోచనలు హిందూ మతాన్ని, దాని సంప్రదాయాలను కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, వివక్షకు మూలంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. ఆదివాసీలను హిందూ మతం నుంచి వేరు చేసే ప్రయత్నాలలో ఈ సాంస్కృతిక మార్క్సిస్టు దృక్పథం కూడా భాగమే. ఆదివాసీల ప్రత్యేకతను, వారి స్వయం ప్రతిపత్తిని గౌరవించడం అవసరం అయినప్పటికీ, వారిని హిందూ సమాజం నుండి పూర్తిగా వేరు చేసి, వారిని బలహీనవర్గాలుగా మార్చడం, తద్వారా మత మార్పిడులకు పాల్పడటం అనేది ఒక వ్యూహంగా మారింది.
అయితే, హిందూ సమాజంతో ఆదివాసుల ఏకీకరణను ప్రోత్సహించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వంటి సంస్థలు ఆదివాసీలను హిందూ ధర్మంలో అంతర్భాగంగా భావిస్తూ, వారిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేశాయి. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం స్థాపన (1952) ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ సంస్థ ఆదివాసీల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ పేరుతో వారిని హిందూ మతంలో ఏకీకృతం చేయడానికి కృషి చేసింది. హిందూ మతం అనేది ఒక నిర్దిష్ట సిద్ధాంతంగా కాకుండా, వివిధ ఆచారాలను సంప్రదాయాలను కలుపుకొనిపోయే విశాల దృక్పథాన్ని కలిగి ఉంది. ఆదివాసీల సంప్రదాయాలు ఈ విస్తృత హిందూ జీవన విధానంలో అంతర్భాగంగానే ఉన్నాయి. వారి ప్రత్యేక గుర్తింపును గౌరవిస్తూనే వారిని హిందూ సమాజంలో ఒక అంతర్భాగంగా చూడటం సమంజసం. చారిత్రక, సాంస్కృతిక, సామాజిక ఆధారాల ప్రకారం ఆదివాసీలు ముమ్మాటికి హిందువులే!
కాయం నవేంద్ర
జాతీయ కన్వీనర్, అఖిల భారతీయ వనవాసి
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
For More AndhraPradesh News And Telugu News