Share News

తెలంగాణ ఫిల్మ్‌ పాలసీ ఏదీ?

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:12 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్నింట్లో స్పష్టత ఉంది కానీ, వి‘చిత్రం’గా ఒక్క సినీరంగం విషయంలో మాత్రం ఇంకా అస్పష్టతే కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ తెలుగు చిత్రాలకు...

తెలంగాణ ఫిల్మ్‌ పాలసీ ఏదీ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్నింట్లో స్పష్టత ఉంది కానీ, వి‘చిత్రం’గా ఒక్క సినీరంగం విషయంలో మాత్రం ఇంకా అస్పష్టతే కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ తెలుగు చిత్రాలకు, కళాకారులకు ఉగాది పర్వదినాన నంది అవార్డులు ఇచ్చే సంస్కృతి చాలాకాలం కొనసాగింది. సినిమావాళ్లు వాటిని సగౌరవంగా స్వీకరించేవారు. ఉత్తమ చిత్రాలను, కళాకారులను, సాంకేతిక నిపుణులను గుర్తించి ప్రభుత్వాలు ప్రోత్సహించడం మంచి సంప్రదాయమే. ఈ గౌరవం జాతీయస్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్నదే. అందులో ఎలాంటి అనుమానం లేదు. మన విషయానికొస్తే ఇంతకాలం తెలుగు సినిమానే వినోదాన్ని పంచుతోంది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా తెలుగు సినిమా వటవృక్షంలా ఎదిగింది. ఎదుగుతోంది. ఏడాదికి ఎంత లేదన్నా వందకు పైగా సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. ప్రధాన స్రవంతిలో తెలుగు సినిమా ‘పాన్‌ ఇండియా’ స్థాయికి వెళ్లడం... వందలు, వేల కోట్ల వసూళ్లు సాధించడం అందరూ హర్షించదగిన విషయమే. అయితే ఈ వటవృక్షం కింద ‘తెలంగాణ’ ప్రాంతీయ సినిమా ఎదుగుదల ఎలా? అనేదే ప్రధాన ప్రశ్న.


ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే సాహిత్యం, సంస్కృతికి కొనసాగింపుగా వివిధ కళారూపాలు... వాటికి కొనసాగింపుగా సినిమా పుట్టుకొస్తుంది. బెంగాలీ, మరాఠీ, ఒరియా, కన్నడ, తమిళ, మలయాళం వంటి అనేక ప్రాంతీయ భాషా చిత్రాలకు మూలం అక్కడి సంస్కృతీ సాహిత్యాలే. తెలంగాణకు కూడా ప్రత్యేకమైన సాహిత్యం, సంస్కృతి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ సినిమా రావాల్సిందే. కానీ ఎప్పటినుంచో అభిమానులను ఆకట్టుకున్న తెలుగు సినిమా నుంచి వేరుపడి... తెలంగాణ సినిమా తనదైన అస్తిత్వాన్ని చాటుకోవాలంటే తప్పకుండా తెలంగాణ సోయితో ఆలోచిస్తే కానీ కొత్త సినిమా రూపుదిద్దుకోదు (ఇప్పటికే హైదరాబాద్‌ ‘దక్కనీ సినిమా’ కనుమరుగైంది). ఇది ఏ ఒక్క వ్యక్తితోనో, దర్శకుడితోనో, నిర్మాతతోనో అయ్యే పని కాదు. ప్రభుత్వమే ప్రత్యేకంగా ‘తెలంగాణ ఫిల్మ్‌ పాలసీ’ని రూపొందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటింది. గత ప్రభుత్వం ఈ దిశగా ఏమాత్రం చొరవ చూపలేకపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి తెలంగాణ సినిమాకు తీరని అన్యాయం చేశారు. అయినప్పటికీ వ్యక్తిగత ప్రతిభ, ఆసక్తితో కొందరు తెలంగాణ సినిమాలు తీసి, అస్తిత్వం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వం నుంచి అందిన సహకారం శూన్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్‌ తెలుగు సినిమాను తట్టుకుని తెలంగాణ సినిమా మనగలగాలంటే తప్పకుండా ప్రభుత్వం చేయూత కావాల్సిందే. తెలంగాణ సోయితో చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఆలోచిస్తేనే అందుకు బాటలు పడతాయి. తెలంగాణ సినిమా అభివృద్ధికి అతి ముఖ్యమైన పది పాయింట్ల పాలసీని తక్షణమే రూపొందించి అందుబాటులోకి తేవాలి. ప్రధాన స్రవంతిలో తెలుగు సినిమా ఎలాగూ ఉంటుంది. అయితే తెలంగాణ సినిమా ఒక పాయగా ఉండాల్సిందే. అందుకు ‘తెలంగాణ ఫిల్మ్‌ పాలసీ’ ఒక్కటే పరిష్కారం. అది జరగకుండా ‘గద్దర్‌’ అవార్డులను హఠాత్తుగా తెరమీదకు తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన మీటింగులు కూడా నిర్వహించారు. మొక్కుబడిగా సాగిన ఈ మీటింగుల్లో గత నంది అవార్డుల తరహాలోనే ‘గద్దర్‌’ అవార్డులు ఉగాదికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కాకపోతే ఆయా కేటగిరీలకు నగదు పారితోషికాలను పెంచాలనుకుంటున్నారు. అదొక్కటే తేడా.


మరోవైపు సినిమాలకు ‘గద్దర్‌’ అవార్డుల పట్ల సినిమారంగంతో పాటు తెలంగాణ సమాజంలో కూడా మిశ్రమ స్పందన ఉంది. తీరా ప్రభుత్వం వాటిని ప్రకటించిన తర్వాత... అవార్డు తీసుకునేందుకు సినీరంగానికి చెందినవారు ఆసక్తి చూపకపోతే ప్రభుత్వం నవ్వులపాలు కాక తప్పదు. ప్రస్తుతానికి సంఖ్యాపరంగా తెలంగాణ సినిమాలు అంతంత మాత్రమే. పైగా అర్హత (నాణ్యత) లేకున్నా ఒత్తిడులకు లోనై, కొన్ని తెలంగాణ సినిమాలకు కూడా అనివార్యంగా అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. దీనివల్ల తెలంగాణ సినిమాకు తీవ్ర నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే మొక్కుబడిగా అవార్డులు ప్రకటించి, అభాసుపాలు కావడం కన్నా... ప్రభుత్వం చిత్తశుద్ధితో ‘తెలంగాణ ఫిల్మ్‌ పాలసీ’ కోసం కృషి చేస్తే, తెలంగాణలో సినిమా కలలు కంటున్న యువతరానికి ఒక దిశ, మార్గనిర్దేశం చూపించినవాళ్లవుతారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి విశ్వవ్యాప్తం కావాలంటే వాటికి కొనసాగింపుగా సినిమాను తెలంగాణ ఆత్మతో ఆవిష్కరించాల్సిందే. ఏడాదికి వంద తెలుగు సినిమాలతో పాటు... ఫిల్మ్‌పాలసీ ప్రయోజనాలు పొంది పదో, ఇరవయ్యో తెలంగాణ సినిమాలు కూడా రూపొందితే సినీరంగంలోని కళాకారులకు, టెక్నీషియన్లకు, స్టూడియోలకు ఆ మేరకు మేలే జరుగుతుంది కదా!

చల్లా శ్రీనివాస్‌

ఫిల్మ్‌ క్రిటిక్‌


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 03:12 AM