Bairagi Voice in Modern Telugu Poetry: బైరాగి సంశయ పథం
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:11 AM
‘‘నాకు తెలుసు నాకు తెలుసు ప్రళయవేదనా పంకిల ప్రపంచ పథం మధ్య ప్రేమలు పొసగవనీఈ బండరాళ్లపైన ఏ మొక్కలూ ఎదగవనీ మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే అస్వతంత్ర సైనికులమనీ...’’ అంటూ అసమ జీవితాలను కవిత్వంగా మలచినవాడు ఆలూరి బైరాగి....
‘‘నాకు తెలుసు నాకు తెలుసు ప్రళయవేదనా పంకిల ప్రపంచ పథం మధ్య ప్రేమలు పొసగవనీఈ బండరాళ్లపైన ఏ మొక్కలూ ఎదగవనీ మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే అస్వతంత్ర సైనికులమనీ...’’ అంటూ అసమ జీవితాలను కవిత్వంగా మలచినవాడు ఆలూరి బైరాగి. ఆయనకు ఇది శతజయంతి సంవత్సరం. వెంకట్రాయుడు సరస్వతమ్మ దంపతులకు 1925 సెప్టెంబర్ 5న తెనాలి దగ్గర ఐతానగరంలో జన్మించాడు బైరాగి. పాఠశాలకు వెళ్లి చదువుకున్నది రెండవ తరగతి వరకు మాత్రమే. తండ్రి దేశభక్తుడు అవడంతో బైరాగిని హిందీ చదువుకోమని ప్రోత్సహించాడు. ఎలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చదువుకుంటూ తరువాత హిందీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉత్తరభారతం వెళ్ళాడు బైరాగి. హిందీ భాషా సాహిత్యాలను చదువుకుంటున్న ప్రాథమిక దశలోనే హిందీలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. బిహార్ లోని ముజఫర్ పూర్‌లో జరిగిన కవి సమ్మేళనంలో 15వ కేటనే పాల్గొని హిందీ సాహిత్య ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు. తొలినాళ్లలో రాసిన హిందీ కవితలు అన్నింటిని కలిపి ‘పలాయన్’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించాడు. తెనాలి తిరిగి వచ్చిన బైరాగి గుంటూరుకు సమీపంలోని పత్తిపాడులో హిందీ ఉపాధ్యాయుడుగా చేరాడు. 1942లో స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పిలుపుమేరకు జరుగుతున్న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రాడికల్ హ్యూమనిజం ప్రభావానికి లోనై రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో కొంతకాలం పనిచేశాడు.
తెలుగులో పిల్లల మాసపత్రికగా అత్యంత ఆదరణ పొందిన ‘చందమామ’ను హిందీలో కూడా ప్రచురించాలని నిర్వాహకులు అనుకున్నప్పుడు, వారిలో ఒకరైన ఆలూరి చక్రపాణి తన అన్న కుమారుడైన బైరాగిని ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించడానికి ఆహ్వానించాడు. అలా బైరాగి హిందీ ‘చందమామ’కు తొలి సంపాదకుడయ్యాడు. అయితే తొలి నుంచి ఎటువంటి కట్టుబాట్లకు నియమ నిబంధనలకు లొంగి ఉండే అలవాటు లేని కారణాన, ఆ పత్రికలో ఎక్కువ కాలం కొనసాగ లేకపోయాడు. నెల పొడవునా చేయాల్సిన పనిని వారం రోజుల్లో ముగించి తనకి ఇష్టమైనవి చదువుకుంటూ గడపడం బైరాగి బాబాయి చక్రపాణికి నచ్చలేదు. దానితో చందమామకు రాజీనామా చేసి తిరిగి తెనాలి చేరుకున్నాడు. ‘చందమామ’లో పనిచేసిన కాలంలో బాలల కోసం అనేక రచనలు చేశాడు. పిల్లల గేయాలు రాసేటప్పుడు బైరాగి భాష సులభగ్రాహ్యంగా, అలతి అలతి పదాలతో ఉండడం గమనార్హం: ‘‘చీకటి పడింది తల్లి దీపం చూపవేలనే/ మాకై దీపం చూపవేలనే/ ఆటపాటల ప్రొద్దు బుచ్చినవి/ పిట్టలు గూటికి తిరిగి వచ్చినవి/ రెక్కలార్చి పవలెల్ల నొచ్చినవి/ సంజమసక నిన్ను దరియ వచ్చితిమి కోపమేలనే/ మాకై దీపం చూపవేలనే/ పాపపుణ్యములు పరిచిన బాటలు/ కూడని వేడుక కూడిన చోటుల/ పయనించాం మా పసి చెలగాటాల/ మలిన దేహులము చల్లని చేతులు చూపవేలనే’’ ఇలా ఉంటుంది ఆ శైలి.
జీవించి ఉన్నంతకాలం బైరాగి కవితా లోకానికి దూరంగానే ఉండిపోయాడు. దానికి ప్రధాన కారణం ఆయన కవిత్వంలో చూపిన స్వతంత్ర, స్వేచ్ఛాతత్వం. ఆయనది ఏ ఇజానికీ లొంగని నవ్య మానవతా దృక్పథం అనుకోవచ్చు. పత్తిపాడులో పని చేస్తున్నప్పుడూ, అంతకంటే ముందు కాలం లోనూ రాసిన కవితలు అన్నింటినీ ‘చీకటి నీడలు’ పేరుతో కవితా సంపుటిగా తెచ్చాడు. బైరాగి కవిత్వం ఆధునిక నవ్య కవిత వాదాన్ని ముందుకు తెచ్చింది. శ్రీశ్రీ అభ్యుదయ కవితా జ్వాలలు, కృష్ణశాస్త్రి భావ కవితా వీచికలకు భిన్నంగా బైరాగి తనదైన కవిత్వాన్ని పాఠక లోకానికి అందజేశారు. అప్పటికే ఉగాది, దీపావళి లాంటి పండుగలకు సందర్భోచిత కవిత్వం రాయడం కవులకు పరిపాటి అయింది. అయితే బైరాగి కొత్త ధోరణితో దీపావళి కవితను రాశారు: ‘‘దీపావళి ఉత్సవమండి/ దీపావళి చేద్దాం రండి/ ఆకాశం మండిద్దామా/ పాతాళం తగలేద్దామా/ దీపావళి చేద్దామా/ నరకాసురు డెందుకు ప్రపంచ/ నరకాన్నే మసి చేద్దామా/ కాటుకలా నల్లని చీకటి/ జ్యోతుల బంధించిన వాకిటి/ తలుపులు పగలేద్దామా’’ ఇలా– ఇక్కడ దీపావళి ఏ ఆనందాల కోసం జరుపుకుంటున్నామో అవి అందరివీ కాదనీ, ప్రపంచమంతా ఇంకా నరక కూపం లోనే ఉందనీ, ఆ నరకాన్ని మసి చేసే దీపావళిని జరుపుకుందామనీ ఇక్కడ పిలుపు ఇస్తున్నాడు.
బైరాగి ‘నూతిలో గొంతుకలు’ ఒక సంశయాత్మక కావ్యం. దీనిలో మానవుడు ‘‘ఏది త్రోవ?’’ అని అడుగుతాడు. అనేక ఆవేదనలతో నడుస్తున్న జీవితంలో ఏది కర్మ, ఏది కర్మ క్షేత్రంలో తక్షణికం, ఏది కర్మ తరువాత బాధ అనే అంశాలను షేక్‌స్పియర్ నాటకంలోని ‘హామ్లెట్’, మహాభారతంలోని ‘అర్జునుడు’, క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవలలోని ‘రాస్కెల్నికోవ్ పాత్రల ద్వారా చర్చకు పెడతాడు.
బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్సృహ, ఆత్మ చింతన ప్రస్ఫుటంగా కనబడుతుంది. అయితే ఆయన నైరాశ్యం మనసును కిందకు లాగివేసేది కాదు. అంతరాత్మను తొలగించే ప్రభంజనం లాంటిది అంటాడు పాలగుమ్మి పద్మరాజు. ఆనాటి కవిత్వావరణంలో తాను ఇమడలేనని, తన బాట వేరని అంటూ, ‘‘నేను మీ కవిని కాను’’ అని ప్రకటించుకున్నాడు బైరాగి. ‘‘నాదాల, నినాదాల, వివాదాల బాణ సంచాలు ప్రేల్చడానికి/ రంగు రంగుల మతాబాలు కాల్చడానికి/ చిలుకలాగు సూక్తులు పలకడానికి/ శాక్రిన్ తేనె సోన లొలకడానికి/ మహామహులకు అభినందన వందనలు తెలపటానికి/ ఇష్టం లేని కృపణప్రశంసల తీయని విషం కలపటానికి/ నేను మీ కవిని కాదు’’ అంటాడు. ‘‘నిధనం వంటి ధనం చేసే సత్కారాలు, సన్మానాలు/ జరీ అంచుల శాలువాలు, చందన తాంబూలాలు, పూలగుత్తులు, హారాలు/ కవితాసతి శవసంస్కృతి క్రతువులోన తీరని అవమానాలు,/ నేవలచిన ఈ మృణాలదేహానికి చేజేతుల నిప్పుపెట్టలేను నేను/... /జీవిత మహిత జనక దుహిత స్వయంవర సమరంలోన/ పినాకాన్ని తృణంలాగ త్రుంచిన నేను/.../ దీనంగా మౌనంగా నేడు వేడుకుంటున్నాను. /నేను మీ కవిని కాను,’’ అంటాడు.
బైరాగి మరణం తరువాత ఆయన పెట్టె లోని రచనలన్నీ వెలికితీసి ‘ఆగమగీతి’ పేరుతో ప్రచురించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఒంటరితనాన్ని ప్రేమించిన బైరాగి మిత్రులు ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు. చివరి రోజుల్లో హైదరాబాద్‌లో తమ్ముని దగ్గర ఉన్నప్పుడు గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు. అప్పటి తన స్థితిని గూర్చి ‘త్రిశంకు స్వర్గం’ అనే కవితలో: ‘‘గాలిరాని చీకటి గదిలో/ మారుమూల మదిలో/ నిర్మించిన మహా ప్రపంచం; నేను విరించిని –/ భారంగా వ్రేలాడే సిగరెట్ పొగ, పారాడే బండరాయి/ చీకటితో పోరాడే వెలుతురులో నోరాడని కటికదుమ్ము/ భూమ్యాకాశాలమధ్య అ త్రిశంకు స్వర్గంలో/ తారాడే సాలీడుకు ఈడు జోడు వాడు వీడు/ చాప మీద పొరలాడే నరాధముడు’’ అంటూ తన ఉనికిని ప్రకటించుకున్నాడు. బైరాగి కవిత్వం, ఆయన భాషాపటిమ, వాక్యనిర్మాణం ఈనాటి తరానికి ఒక గైడ్ లాగా ఉపయోగపడతాయి.
(సెప్టెంబర్ 5న ఆలూరి బైరాగి శతజయంతి)
బండ్ల మాధవరావు
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
For More AP News And Telugu News