Acharya S V Rama Rao: చిరస్మరణీయులు ఆచార్య ఎస్వీ రామారావు
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:39 AM
ఆచార్య ఎస్వీ రామారావు ఇక లేరు అన్నది భౌతిక సత్యం. తమ గ్రంథాలలో వారు సజీవంగా ఉన్నారన్నది సాహిత్య సత్యం. సెప్టెంబర్ 17న ఉదయం వారు కనుమూశారన్న వార్త సాహిత్యలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో...
ఆచార్య ఎస్వీ రామారావు ఇక లేరు అన్నది భౌతిక సత్యం. తమ గ్రంథాలలో వారు సజీవంగా ఉన్నారన్నది సాహిత్య సత్యం. సెప్టెంబర్ 17న ఉదయం వారు కనుమూశారన్న వార్త సాహిత్యలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో 1941లో జన్మించారు.
2000 సంవత్సరం నుంచి తెలుగు సాహిత్య రంగంలో మార్పులు చోటుచేసుకుంటూ వచ్చాయి. తెలంగాణ సాహిత్య ప్రత్యేక అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి బలమైన వాదనలను వినిపించవలసిన అగత్యం ఏర్పడింది. తెలుగు సాహిత్య చరిత్రలలో తెలంగాణ సాహిత్యానికి సరైన చోటు లభించకపోవటం వంటి సత్యాలను ఎత్తి చూపవలసి వచ్చింది.
ఇట్లాంటి చారిత్రక సందర్భంలో ఎస్వీ రామారావు తమ కలానికి పదును పెట్టి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా, శాఖాధ్యక్షులుగా, పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. కాని తెలుగు సాహిత్య చరిత్రకు, తెలంగాణ సాహిత్య చరిత్రకు సంబంధించిన వ్యాసాలను, గ్రంథాలను ఎత్తిన కలం దించకుండా రాస్తూ వచ్చారు. వీరు ఈ అంశాల మీద ఆంగ్లంలో కూడా రచనలు చేసి ప్రచురించడం మూలంగా అన్యభాషీయులకు కూడా తెలంగాణ ప్రాంతపు సాహిత్య వైశిష్ట్యం తెలిసింది.
ఎస్వీ రామారావు 1960 ప్రాంతం నుంచి సాహిత్య రంగంలో ఉన్నారని చెప్పవచ్చు. ‘జ్యోతిర్మయి’ అన్న సాహిత్య సంస్థను నెలకొల్పి, అదే పేరుతో సాహిత్య సంచికలను కూడా ప్రచురిస్తూ వచ్చారు. వీటిల్లో ఎక్కువగా పాలమూరు జిల్లా కవుల రచనలు ప్రచురితమయ్యాయి.
సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర ఈ రెండూ వారికి ఇష్టమైన ప్రక్రియలు.
డా. సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో ‘తెలుగు సాహిత్య విమర్శ–అవతరణ, వికాసాలు’ అన్న అంశం మీద పరిశోధన చేసి, 1973లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. ఇది విమర్శ ప్రక్రియలో తెలుగులో వచ్చిన తొలి పరిశోధన గ్రంథం. ఇది పలు ముద్రణలు పొంది దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రాచుర్యం పొందింది. విమర్శలో ఆలంకారిక విమర్శ, తులనాత్మక విమర్శ, స్వతంత్ర విమర్శ, చారిత్రక విమర్శ, కవి జీవిత విమర్శ, కళాతత్వ విమర్శ, సాంఘిక విమర్శ, మనస్తత్వ విమర్శ– వంటి అనేక భేదాలున్నాయని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. వాటిని వివరించారు కూడా. ఇది వారి కూలంకష ప్రజ్ఞకు నిదర్శనం.
2012లో ఎస్వీ రామారావు రచించిన ‘తెలుగు సాహిత్య చరిత్ర’ ఒక తెలంగాణ పరిశోధకుడు ఒక చేతిమీదుగా రాసిన తొలి చరిత్రగా చెప్పుకోవచ్చు. సాహిత్య చరిత్రలో కవుల కాలస్థలాలకు సంబంధించి, అధ్యాయాల విభజనకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అంతర్ బహిర్ సాక్ష్యాల ఆధారంగా వీటిని పరిష్కరించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే తొలి కథల సంపుటి అయిన బృహత్కథను రచించిన గుణాఢ్యుని కాలం గూర్చి తొలితరం చరిత్రకారులు అనేక వాదాలు చేశారు. అయితే ఎస్వీ రామారావు గుణాఢ్యుడు క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాల శాతవాహనుని కాలం నాటివాడని భావించారు. అధిక సంఖ్యాకుల అభిప్రాయం కూడా ఇదే కావటం గమనార్హం. తెలంగాణ సాహిత్య చరిత్ర మీద కూడా వారు అనేక గ్రంథాలు రాశారు. ‘మావూరి కథలు’, ‘విశ్వనాథ దర్శనం’, ‘గ్రంథావలోకనం’, ‘విమర్శక వతంసులు’ వంటి ఇతర పుస్తకాలు రచించారు.
ఎస్వీ రామారావు చాలా అభిరుచులున్న రచయిత. ‘మాయాబజారు’, ‘గుండమ్మ కథ’ వంటి అనేక సినిమాల మీద వారు రాసిన సమీక్షలు పాఠకులను ఆకట్టుకున్నాయి. నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు వంటి సత్తా ఉన్న రచయితల పుస్తకాల మీద కూడా వారు సమీక్షలు రాశారు. ‘తెలుగు అధ్యాపక సంఘం’ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కళాశాల విద్యలో తెలుగు భాష ప్రాముఖ్యం తగ్గిపోవడాన్ని నిరసిస్తూ, ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరిస్తూ వచ్చారు.
కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోసం ‘సి.నారాయణరెడ్డి’ మీద మోనోగ్రాఫ్ రాశారు. నారాయణరెడ్డి జీవిత సాహిత్యాల మీద వచ్చిన సాధికారికమైన గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు.
ఎస్వీ రామారావు పర్యవేక్షణలో సుమారు 30 మంది పరిశోధకులకు ఎం.ఫిల్, పిహెచ్.డి పట్టాలు లభించాయి. విద్యార్థులకు సన్నిహితంగా ఉంటూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ సరైన బాటలో వారిని నడిపించారు. ఏది ఏమైనా చివరి శ్వాస వరకు సాహిత్య సేవ చేస్తూ సార్థక జీవితాన్ని గడిపిన ఆచార్య ఎస్వీ రామారావు చిరస్మరణీయులు.
అమ్మంగి వేణుగోపాల్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి