ఆప్ ఓటమి ఏ భవితకు విఘాతం?
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:21 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ ఓడిపోవటం ఊహించనిది ఏమీ కాదు. ఇతర రాజకీయ పార్టీల సంస్కృతికి భిన్నంగా రంగంపైకి వచ్చి ఎన్నో ఆశలురేపిన పార్టీ క్రమేపీ అదే సంస్కృతిని...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ ఓడిపోవటం ఊహించనిది ఏమీ కాదు. ఇతర రాజకీయ పార్టీల సంస్కృతికి భిన్నంగా రంగంపైకి వచ్చి ఎన్నో ఆశలురేపిన పార్టీ క్రమేపీ అదే సంస్కృతిని పూర్తిగా ఒంటబట్టించుకున్న తర్వాత ఏ జరుగుతుందో అదే జరిగింది. కానీ, ఆప్ ఓటమిని ఈ కోణం నుంచి చూడటంలో కొత్తేమి ఉండదు. పుట్టుక. ఉన్నతి, క్షీణత అనేవి ప్రతి రాజకీయ పార్టీకీ తప్పవనుకుంటే ఆప్‌కి ఈ పరిణామసూత్రమూ వర్తిస్తుందని తేలికగానే సరిపెట్టుకోవచ్చు. కానీ కొన్ని పతనాలనూ క్షీణతలనూ సాధారణ దృష్టితో చూడలేం. కొన్నిటిని భవిష్యత్తు కోణం నుంచే చూడగలం. అప్పుడే దాని ప్రాధాన్యత సరిగా అర్థమవుతుంది.
దేశంలో ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్నదనీ ఈ కారణం రీత్యానే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌కు సరితూగగల దేశమేదీ లేదని మనం అందరమూ నమ్ముతాం. ప్రపంచంలో పేరెన్నికగల విశ్వవిద్యాలయాల్లో రాజనీతి శాస్త్రంపై ఉద్దండులని పేరు తెచ్చుకున్న మహామహులందరూ భారత ప్రజాస్వామ్యంతో పోల్చగల నమూనా ప్రపంచంలో ఎక్కడా లేదని గొప్పగానూ చెప్పారు. ఒక వెనుకబడిన దేశంలో, అధిక సంఖ్యాకులు నిరక్ష్యరాసులైన చోట, సంప్రదాయాలే ఆలోచనలను శాసిస్తున్న చోట, ఆధునిక భావాల వ్యాప్తికోసం పెద్దఎత్తున మేధోరంగంలో సంఘర్షణలు జరగని చోట– కిందా మీదాపడి ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవటం వారికి వింతగానూ విశిష్టతగానూ అనిపించింది. మనతో పాటు స్వాతంత్య్రం పొందిన దేశాలు ప్రజాస్వామ్యంగా పతనమైపోయిన నేపథ్యంలో వారికి అలా కనపడటంలో అసహజం ఏమీలేదు. ఇతర దేశాల్లోని పరిస్థితులతో పోల్చిచూసుకుంటే మనకూ ఇదే అభిప్రాయం కలగకమానదు. లోపాలెన్ని ఉన్నప్పటికీ ఏడుపదులు నిండిన మన ప్రజాస్వామ్యంపై ఆ అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా ఉండలేం.
మతం, ప్రాంతం, భాష, కులం లాంటి వాటిమీద విపరీత ప్రేమతో, హద్దులు దాటిన తాదాత్మ్యంతో వ్యవహరించితే ఇక్కడైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యం పలచబడిపోతుంది. ఈ వైపరీత్యం మన దేశంలో 1990ల నుంచి బాగా పెరుగుతోంది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు విజయావకాశాల కోసం సందర్భాన్ని బట్టి మతం, ప్రాంతం, కులం, భాషలను ఉపయోగించుకుని ప్రజాస్వామిక స్ఫూర్తిని అడుగడుగునా గండికొడుతున్న నేపథ్యంలో ఆప్ రాజకీయరంగంలోకి రావటం ఒక కొత్త ఆశను కల్పించింది. 21వ శతాబ్దంలో మతం, ప్రాంతం, కులం, భాషల పేరెత్తకుండా ప్రభుత్వాల్లో పాతుకుపోయిన అవినీతిపై పోరాటాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఢిల్లీలో ఆప్ అధికారాన్ని చేజిక్కించుకోవటం రాజకీయరంగంలో సంచలనమనే చెప్పాలి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి ఆప్‌కూ, కేజ్రీవాల్‌కూ జేజేలు కొట్టింది. మన మధ్యతరగతికి అవినీతిలో భాగం లేదని చెప్పలేం. అనేక ప్రలోభాలకు అది దూరంగా ఉందనీ చెప్పలేం. కానీ విధిలేని పరిస్థితిలో వాటిల్లో చిక్కుకుపోయామనే భావన అంతర్లీనంగా ఎంతోకొంత బలంగానూ ఉంది. వాటి నుంచి బయటపడేసే రాజకీయాలొస్తే భవిత ఇంకా బాగుంటుందనే ఆశ కూడా వారిలో గట్టిగానే ఉంది. ఆ ఆశతోనే ఆప్‌కు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఢిల్లీలో అధికారం రావటానికి తోడ్పడిన అజెండాతో దేశవ్యాప్తంగా ఆప్ విస్తరిస్తుందనే భరోసా చాలా మందికి కలిగింది. ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన బుద్ధిజీవులు కొత్త రాజకీయ ప్రయోగంలో పాలుపంచుకోటానికి ముందుకు వచ్చారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని వారూ, జీవితంలో ఇతరత్రా స్థిరపడి మంచి జీవితాన్ని అనుభవించగలిగే సామర్థ్యం ఉన్న వారూ ఆప్ వైపు ఆకర్షితులయ్యారు. ఒకమోస్తరు రాజకీయ నేపథ్యంలేని వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రులయ్యారు.
ఢిల్లీ కేంద్రంగా ఊపిరిపోసుకున్న కొత్త రాజకీయ సంస్కృతి క్రమేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ఆశ కొన్నాళ్లు బలంగానే ఉండేది. అందుకే కేజ్రీవాల్ పేరు దేశవ్యాప్తంగా మధ్యతరగతిలో బాగా ప్రాచుర్యం పొందింది. కీలక అధికారాలన్నీ కేంద్రం చేతుల్లో ఉన్న ఢిల్లీలో ముఖ్యమంత్రికే కాదు మొత్తం అక్కడి ప్రభుత్వానికీ అనేక పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ ఒక కొత్త రాజకీయ సంస్కృతికీ, పరివర్తనకూ ప్రతీకగా కేజ్రీవాల్‌ను పరిగణించటంతోనే ఆ ప్రాచుర్యం లభించింది. అందుకే ఆప్ ఎన్నికల్లో ఎక్కడ నిలబడితే అక్కడ దాని ప్రభావం మీద ఎన్నో అంచనాలూ విశ్లేషణలూ వెల్లువెత్తాయి.
1989 నుంచి దేశంలో కొనసాగుతున్న సంకీర్ణ రాజకీయాలను నిలువరించి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సంపాదించిన నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం అసాధ్యం అనుకున్న పరిస్థితి నెలకొంది. సర్వం మోదీమయం అనుకున్న వాతావరణంలో 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70కు 67 స్థానాలు సంపాదించి చరిత్రను సృష్టించింది. ఆర్థిక, పాలనపరమైన సమస్యల అజెండాను ప్రధానంగా చేసుకుని మధ్య, దిగువతరగతి ప్రజల మద్దతుతో రాజకీయాలను నడపవచ్చనే ధీమాను కల్పించింది. నిజానికి ఈ రెండు వర్గాలను కలుపుకొని మత, ప్రాంత, కుల, భాషా దురభిమానాలు లేని కొత్త రాజకీయ సంస్కృతినీ, ఆర్థిక విధానాలనూ దేశమంతా విస్తరించే అవకాశం అప్పట్లో కొంత స్పష్టంగా కనపడింది. కానీ, ఆ విస్తరించే క్రమంలో పాత రాజకీయ సంస్కృతితో సంఘర్షించటం కంటే సర్దుకుపోవటం ఆప్ ప్రారంభించింది. అన్ని విషయాల్లోనూ అది మొదలైంది. దాంతో పాటూ క్షీణతా మొదలైంది.
రాజకీయ విస్తరణకు ప్రజాబలాన్ని మాత్రమే నమ్ముకోకుండా ఇతర రాజకీయ పార్టీల్లాగా ధనబలం కోసం అడ్డదారులు తొక్కటం, మతపరంగా అపరిమిత హిందూ అభిమానాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టటంతోనే ఆప్‌కూ ఇతర పార్టీలకూ పెద్ద తేడా లేకుండా పోయింది. స్థిర అభివృద్ధి కంటే తాయిలాలతోనే ఓటర్లను ఆకర్షించగలమనే నిర్ణయానికి వచ్చేసింది. ఒకరకంగా తనకీ ఇతర పార్టీలకూ మధ్యనున్న విభజన రేఖలను ఆప్ తనంతటతానే చెరిపివేసుకుంది. మద్యం కుంభకోణంలో ఇరుక్కోవటం దీనికొక ఉదాహరణ మాత్రమే. ఇతర రాజకీయపార్టీలకు భిన్నమైన అస్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత ఆప్ విస్తరణా ఆగిపోయింది. పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోచోట ఎక్కడా గట్టిపోటీని ఇచ్చే పరిస్థితిని తెచ్చుకోలేక పోయింది.
ప్రాంతీయ, జాతీయ పార్టీలు నాయకుడి చుట్టూ కేంద్రీకృతమై అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎలా నామమాత్రం చేశాయో కేజ్రీవాల్ కూడా ఆప్ విషయంలో చాలా మేరకు అలాగే చేశారు. వ్యక్తిపూజ హద్దులు మీరినచోట జనాకర్షణ భారమంతా అధినాయకుడి మీదే పడుతుంది. క్రమేపీ ఇతర నాయకులు జీరోలు అవుతారు. మహా అయితే నియోజకవర్గాలకే పరిమితం అవుతారు. ఏకవ్యక్తిదే సర్వాధికారమైన పార్టీలో రాజకీయ వ్యూహాలు కూడా గాడితప్పుతాయి. అనేక స్థాయిల్లో చర్చల్లేకుండా తీసుకునే నిర్ణయాలు అనర్థాలే ఎక్కువ తెస్తాయి. ఇతర పార్టీలతో పొత్తులపై అరమరికల్లేని చర్చలు ఆప్‌లో జరిగాయని విశ్వసించలేం. పొత్తులే లేకుండా ఒంటరిగా వెళ్లాలన్న కేజ్రీవాల్ నిర్ణయాలు సొంతపార్టీకే గాక మిత్రపార్టీలకూ పలు సందర్భాల్లో నష్టాలను తెచ్చాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని కొత్త రాజకీయ సంస్కృతి కోసం నిజాయితీగానే ఒకప్పుడు ప్రయత్నించిన చరిత్ర మరీ పాతది కాకపోవటం వల్ల ఆప్ నాయకుల్లో కొందరైనా ఇంకా కొట్లాడే స్థితిలో ఉన్నారు. భవిష్యత్తులో కేజ్రీవాల్ వేసే అడుగులను బట్టి వీళ్లల్లో ఎంతమందిని నిలుపుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది.
ఆప్ ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. బలమైన సంస్థాగత నిర్మాణాన్ని, సిద్ధాంతబలాన్ని కలిగి ఉన్న బీజేపీ లాంటి పార్టీని ఎదిరించి నిలబడటం చాలా కష్టమని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అసాధారణ బలాన్ని ఉపయోగించిన బీజేపీ.. ఆప్‌ని అన్నిరకాలుగా ఉక్కిరిబిక్కిరి చేసిన విషయాన్నీ తోసిపుచ్చలేం. అన్ని నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీటో చేసే అధికారాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి అధికారాలేమిటో స్పష్టంచేయాలని సుప్రీంకోర్టు గడపను తొక్కాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆ విషయంలో కొంత వెసులుబాటు కల్పించినా ఇతర మార్గాల్లో ఆప్‌ను చాలవరకూ బీజేపీ కట్టడి చేయగలిగింది. బీజేపీ ప్రచారయుద్ధ ధాటిని కూడా ఆప్ తట్టుకోలేకపోయింది. రాజకీయాల్లో బయటి ప్రత్యర్థులు ఎప్పుడూ ఉంటారు. వాటిని దీటుగా ఎదుర్కొనటం ప్రజాస్వామ్యంలో అత్యవసరం. ఆప్ దాన్ని సమర్థంగా ఎదుర్కోలేక పోయింది. అది ఈ ఎన్నికలకే పరిమితమైతే ఫర్వాలేదు. ప్రతిపక్ష పాత్రనే పోషించలేని స్థాయికి అది వెళితే ప్రత్యామ్నాయ రాజకీయ ప్రయోగాలపైనే నమ్మకం పోతుంది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్రనాయకత్వం మొత్తం ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులూ కేంద్రీకరించిన నేపథ్యంలో ఒక పార్టీగా నిలబడటమే ఆప్ ముందున్న పెనుసవాల్. ప్రత్యామ్నాయ రాజకీయాలతో వచ్చే ఏ పార్టీనైనా పాపపంకిలంలోకి లాగే స్థాయికి మన ప్రజాస్వామ్యం వెళ్లిపోయింది! ధనబలం ముందు ఏ పార్టీ అయినా మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆప్ తొక్కిన అడ్డదారులూ అందులో భాగమే. అందుకే భవిష్యత్తు దృష్టి నుంచి చూస్తే ఆప్ ఓటమిని ప్రత్యామ్నాయ రాజకీయాలకు జరిగిన నష్టంగానే భావించాలి. దాని నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే ప్రజాస్వామ్యానికి ఎంతో కొంత రక్ష!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..