Share News

Modern Telugu Poetry: అద్దం వెనుక వర్షం

ABN , Publish Date - Sep 22 , 2025 | 02:36 AM

ఆకాశం తన నరాలన్నీ తెంచుకుని ఒక పిచ్చివాడిలా వీధుల మీద పడింది. నగరపు మురికిని, కపటత్వాన్ని కడిగి పారేయాలన్న కసితో ప్రతి నీటిచుక్క...

Modern Telugu Poetry: అద్దం వెనుక వర్షం

ఆకాశం తన నరాలన్నీ తెంచుకుని

ఒక పిచ్చివాడిలా వీధుల మీద పడింది.

నగరపు మురికిని, కపటత్వాన్ని

కడిగి పారేయాలన్న కసితో

ప్రతి నీటిచుక్క ఒక ఉలిదెబ్బలా కురుస్తోంది.

తగరపు రేకుల పైకప్పుల మీద

లక్షలాది సైనికుల కవాతు శబ్దం.

మట్టి వాసన...

ఎప్పుడో సమాధి చేసిన జ్ఞాపకంలా

ఒక్కసారిగా పైకి లేస్తోంది.

నేను ఈ పన్నెండో అంతస్తు కిటికీ వెనుక

ఏసీ చలిలో బిగుసుకుపోయి

నా ఫోన్ తెర మీద

ఇదే వర్షపు ఫోటోలకు ‘లైక్ ’ కొడుతున్నాను.

బయట కురుస్తున్నది నిజమైన వర్షం

నా చేతిలో తడుస్తున్నది ఒక గాజు అబద్ధం.

నాకూ ఈ హోరువానకూ మధ్య

ఈ చల్లని, మందపాటి అద్దం

నా చర్మానికీ, స్పర్శకీ మధ్య

నా హృదయానికీ, వాస్తవికతకీ మధ్య

నిలబడిన ఒక పారదర్శకమైన శత్రువు.

చిన్నప్పుడు అమ్మ చీరచాటు నుండి

బయటకు దూకిన జ్ఞాపకం...

మొదటి వాన చుక్క ఒంటి మీద పడగానే

ఒళ్ళు పులకరించిన అనుభూతి...

బురదలో గెంతిన పాదాలు...

ఆ స్వేచ్ఛ ఇప్పుడు నాకెంత దూరం?

బయట కురుస్తున్నది నీళ్ళు

నా గొంతులో ఆరని అస్తిత్వ దాహం.

కిటికీ తలుపులు బాదుతున్న ఈ శబ్దం

నన్ను లోపలికి రమ్మని పిలుస్తున్న మృత్యువా?

బయటకు రమ్మని పిలుస్తున్న స్వేచ్ఛా?

నా వేలికొనతో అద్దాన్ని తాకాను

అది నా సమాధిలా చల్లగా ఉంది

అద్దంలో నా ప్రతిబింబం

వర్షంలో తడుస్తున్న ఒక నీడలా...

ఈ గాజు గోడను బద్దలుకొట్టి

బయటి ప్రపంచంలో కలిసిపోవాలా?

లేక ఈ నాలుగు గోడల మధ్యే

నాలో నేను కురిసి, నాలోనే ఇగిరిపోవాలా?

భూక్యా గోపినాయక్

99891 59196

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 02:36 AM