A Nostalgic Tale: గారడీ ఆటలో మా పేట
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:34 AM
అంతకుమునుపు.... ఊరవతల విసిరేసిన మసిపాతల మూట లాంటి మాపేటలో గురయ్య తాత సన్నాయి పేటకి వేకువ పాటైయ్యేది...
అంతకుమునుపు....
ఊరవతల విసిరేసిన
మసిపాతల మూట లాంటి మాపేటలో
గురయ్య తాత సన్నాయి
పేటకి వేకువ పాటైయ్యేది
తంబురపై జమ్మయ్య తాత తత్వం
మానవ మహేతిహాసాన్ని గానం చేసేది
తెల్లారగట్ల చదువుతో తెలివబ్బుతుందని
బుడ్డీల వెలుగులో పేట వేకువ బడయ్యేది
నాటుమందుల కూరయ్య తాత దొడ్డి
పురిటికందుల కేరింతలతో ఘోషాసుపత్రయ్యేది
పొద్దుబోతే చాలు బురికెడు సారా సుక్కలేసి
పుచ్చాల పోతన్న పుఠాన్లతో పేట పూనకమయ్యేది
మమకారం ఆర మగ్గిన తుమ్మిక పండయ్యేది
ఎలక్కాయలా వగరు బారిన ఎటకారముండేది
తిల్లేల దాటితే....
మోషే నుండి యేసయ్య వరకూ
సారంగధర నుండి దువ్వన్నదొర వరకూ
పేట కతల పుట్టయ్యేది
మాలవారి మంగమ్మ, యలమల సత్యరావుల ప్రేమకావ్యం
రాయప్ప జముకుపై గానమవుతుంటే
కంటికి మింటికి కన్నీటి ధారయ్యేది పేట
జముకుగానో ఈర్నంగానో...
మా వారసత్వపు వాయిద్యమంతా
పేట సిలక్కొయ్యలపై కొలువు కూకుండేది
ఎన్ను పట్టికి ఏలబడ్డ ఎండు ఒరుగులు
వారం పూటకి ఇష్టమైన నీసుకోరయ్యేవి
కానికష్టమే ఇంటికొచ్చినా
కంటికిరెప్పై పేట కాపు కాసేది
మోతుబారితనం హద్దుమీరితే
పేట కన్నమనీడు కరవాలమయ్యేది
ఇప్పుడు! పేట పేటలా లేదు !
ఇరుకు వీధులు... ఎలుగేసి కట్టినట్టు ఎలివేషన్లు
గాలి వెలుతురు దూరని కాంక్రీట్ గదులు
కల్లాపికి వాకిలి లేదు
ముడ్డానించడానికి మూరెడు అరుగూ లేదు
ఏ బీరబడ్డో పాకడానికి పెణక లేదు
ఇంటి వెనకాల పెరడూ లేదు
సంబరమొస్తే చిందేసే డప్పు లేదు
చావొస్తే ఈర్నపు పురాగాన శోకమూ లేదు
పేటంతటినీ ఒక్కచోటికి చేర్చే కష్టసుఖాలబోతా లేదు
మేడిపండులా పైకి నవనవలాడుతున్నా
పేట బతుకు నిండా పురుగు దొలుస్తున్న పేదరికం
గారడీవోడి దీపాలాటలో నిగనిగా ఎలిగిపోతున్నా
మా పేట లోపట ఎడతెరిపిలేని చీకటి ముసురు....
కలమట దాసు బాబు
80967 03363
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News