Share News

పేదల శ్రేయస్సుతోనే హరిత ధరిత్రి

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:28 AM

ప ర్యావరణ విధ్వంస ప్రభావం మహిళలపైనే అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే వారు ఒక మెరుగైన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలనే విషయమై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో ముడిపడివున్న నా వృత్తి....

పేదల శ్రేయస్సుతోనే హరిత ధరిత్రి

ప ర్యావరణ విధ్వంస ప్రభావం మహిళలపైనే అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే వారు ఒక మెరుగైన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలనే విషయమై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో ముడిపడివున్న నా వృత్తి వ్యాసంగాలలో నేను నేర్చుకున్న మొదటి పాఠమిది. 1980వ దశకం తొలి సంవత్సరాలలో నేను కళాశాల విద్యను ముగించినప్పుడు పర్యావరణం అనేది ప్రజలు పెద్దగా పట్టించుకునే అంశంగా ఉండేది కాదు. నా స్నేహితులు ఎవరూ పర్యావరణ సంబంధిత వ్యవహారాలను వృత్తిగా స్వీకరించాలనే ఆలోచన చేయలేదు. అయితే అప్పటికే పర్యావరణ సమస్యలు ప్రపంచ వేదికలపై ప్రాధాన్యం వహిస్తున్నాయి. 1972లో స్టాక్‌హోంలో పర్యావరణ పరిరక్షణపై ప్రప్రథమ ప్రపంచ సదస్సు జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఆ సదస్సులో పాల్గొన్న కొద్దిమంది ప్రభుత్వాధినేతలలో ఆనాటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒకరు. 1970ల్లోనే హిమాలయ ప్రాంతాల్లో వేలాది మహిళలు వృక్షాలను ఆలింగనం చేసుకుని కలప వ్యాపారుల నుంచి వాటిని రక్షించిన వైనం గురించి వార్తలు వెలువడ్డాయి. చిప్కో ఉద్యమంగా సుప్రసిద్ధమైన హిమాలయ మహిళల సాహసాలు దేశ ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించాయి. పేదల, మహిళల శ్రేయస్సుకు, పర్యావరణ భద్రత ముఖ్యమన్న అవగాహనను ఆ ఉద్యమం కలిగించింది.


చెట్ల కూల్చివేతను అడ్డుకోవాలని మహిళలు ఎందుకు అంత పట్టుదల చూపుతున్నారో అర్థం చేసుకునేందుకు హిమాలయ ప్రాంతాలలో పర్యటనలతో నా పర్యావరణ పరిరక్షణ కృషి ఆరంభమయింది. ఆ పర్యటనల ఫలితంగా జీవనోపాధులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని చూడడం ప్రారంభించాను. ఈ దేశంలోని లక్షలాది మహిళలకు పర్యావరణం– భూమి, నీరు, అడవులు– విలాస విషయాలు కాదు. అవి వారి మనుగడకు సంబంధించినవి. సహజ సంపదలు వారి జీవితాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధికి సహజ వనరులను పరిరక్షించి పెంపొందించడమే సరైన మార్గమని భావించాను. నిజానికి భారతదేశ సత్వర ఆర్థికాభివద్ధికి సహజ వనరుల పునశ్శక్తిమంతం చేయడం చాలా ముఖ్యం. చిప్కో ఉద్యమంలో పాల్గొన్న మహిళలు చెట్లను ఆలింగనం చేసుకున్నది కలప వ్యాపారులు వాటిని నరికివేయకుండా ఆడ్డుకోవడం కోసం కాదు. ఆ వృక్షాలను నరికివేసే మొదటి హక్కు తమకు మాత్రమే ఉండాలని ఆ మహిళలు కోరుకున్నారు. చిప్కో ఉద్యమం పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కాదు. సహజ వనరుల నుంచి స్థానిక జీవనోపాధులను నిర్మించుకునేందుకు జరిగిన అభివృద్ధి ఉద్యమమది.

నా వృత్తి జీవితం తొలి సంవత్సరాలలో అనీల్‌ అగర్వాల్‌ (డౌన్‌ టు ఎర్త్‌ పత్రిక సంస్థాపక సంపాదకుడు)తో కలిసి పని చేశాను. ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పారు. హరిత భవిష్యత్తును నిర్మించుకునేందుకు గ్రామస్తులు కలిసికట్టుగా కృషి చేసిన పల్లెలకు వెళ్లాము. ఉత్తమ పద్ధతులలో అడవుల, జలవనరుల నిర్వహణ స్థానిక జన సముదాయాలకు ఎంతగా మేలు చేస్తుందో నేను ప్రత్యక్షంగా చూశాను. అనీల్‌, నేనూ చెట్ల పరిరక్షణే కాకుండా ప్రజాస్వామిక పద్ధతులను మరింతగా ప్రగాఢం చేసే మార్గాలపై దృష్టి పెట్టాము. తద్వారా ఉమ్మడి సహజ వనరుల (మన దేశంలో అడవులు చాలావరకు ప్రభుత్వ విభాగాల యాజమాన్యంలో ఉండగా వాటిని ఉపయోగించుకునేది పేదలు, ముఖ్యంగా మహిళలు)కు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రయత్నించాము.


ఈ ప్రారంభం వాతావరణ మార్పు సవాళ్లను అర్థం చేసుకునేందుకు కూడా నాకు సహాయపడింది. అదే కాలంలో ఒక ప్రతిష్ఠాత్మక అమెరికా పరిశోధనా సంస్థ విడుదల చేసిన పర్యావరణ సంబంధిత సమాచారం ప్రభావంతో పేదప్రజలే ఎక్కువగా భూ తాపం పెరుగుదలకు కారకులు అవుతున్నారనే అభిప్రాయానికి ఆ నాటి మన పర్యావరణ మంత్రి వచ్చారు. పశుపోషణ, వరిపైరుసాగు మొదలైన కార్యకలాపాలతో వారు భూతాపాన్ని పెంచుతున్నారని ఆయన భావించారు. పర్యావరణ మంత్రి వైఖరికి ఒక కొండ ప్రాంత రాష్ట్ర ముఖ్యమంత్రి కలవరపడ్డారు ప్రజలు పశువులను పెంచుకోవడాన్ని నిరోధించాలని కేంద్రం పంపిన ఒక సర్క్యులర్‌ విషయమై ఆయన మాతో చర్చించారు. ఇదెలా సాధ్యమని ఆ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేద ప్రజలు పోషించే పశువులు ప్రపంచ వాతావరణ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఎక్కువగా కారణమవుతున్నాయా అని మేమూ నివ్వెరపోయాము. పర్యావరణ విధ్వంసానికి ఎక్కువగా నష్ట పోతున్నది పేద ప్రజలే అని మాకు మా కృషిలో తెలిసివచ్చింది. అయితే ఇప్పుడు వాతావరణ మార్పునకు పూర్తిగా వారే బాధ్యులని ఘనత వహించిన మన పాలకులు ఎలా భావిస్తున్నారు?


ఈ ప్రశ్నతో మేము మా వాతావరణ పరిశోధనా ప్రస్థానాన్ని ప్రారంభించాం. ఒక స్థానిక అటవీ నిర్వహణకు, ప్రపంచ వాతావరణ నిర్వహణకు మధ్య పెద్ద తేడా లేదన్న వాస్తవాన్ని చాలా త్వరగానే గ్రహించాము. స్థానిక అడవి, ప్రపంచ వాతావరణం రెండూ ఉమ్మడి ఆస్తులే. అన్నిటి కంటే ముఖ్యంగా అవసరమైనది ఒక ఆస్తి హక్కుల చట్రం ( సహజ వనరులను ఎలా స్వంతం చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో నిర్వచించే చట్టపరమైన, సామాజిక వ్యవస్థ. ఇందులో వ్యక్తులకు ఆస్తిని కలిగి ఉండటానికి, ఉపయోగించడానికి, బదిలీ చేయడానికి హక్కులు ఉంటాయి). ఇది సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. పేద ప్రజలు కారణమవుతున్న ఉద్గారాలు (జీవనోపాధి వరి సేద్యం, పశు పోషణ నుంచి), సంపన్నుల విలాస జీవితం మూలంగా సంభవిస్తున్న ఉద్గారాలు (కారుల వినియోగం నుంచి) మధ్య తేడాను పరిగణనలోకి తీసుకోవలి‍సిన అవసరమున్నది. వాతావరణ మార్పు మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిందన్న సత్యాన్ని ఇప్పుడు అందరూ గుర్తించారు. వాతావరణ మార్పు ఒక తిరుగులేని వాస్తవం. అది సంభవిస్తోంది. దాని పర్యవసానాలు పేదలను– సమస్యకు కారణం కానివారు– మరింతగా దారిద్ర్యంలోకి నెట్టి వేస్తున్నాయి. అభివృద్ధి అనేది సమానంగా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా పేదలకు అభివృద్ధి హక్కును నిరాకరించ కూడదు. అభివృద్ధి ఫలాలలో వారికి వాటా కల్పించాలి. వారు సొంతంగా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు వీలు కల్పించాలి. ఇందుకు పర్యావరణ పరమైన ఆస్తుల– వర్షపు నీరు సంరక్షణ నుంచి మెరుగైన ఆహార వ్యవస్థల దాకా – సృష్టించడం చాలా ముఖ్యం.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 03:28 AM