Labour Codes India: కార్మికలోకానికి శాపం ఈ కమ్యూనిస్టులు
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:50 AM
‘కమ్యూనిస్టులు కార్మికుల పేరుతో రాజకీయ లాభాల కోసం బంద్‌లు, ఆందోళనలకు పిలుపునిస్తారు. ఈ రోజు బంద్‌లో పాల్గొన్న కార్మికుడు రేపు ఆకలితో అలమటిస్తాడు. వారిని ఆకలితో మాడ్చే కమ్యూనిస్టులు...
‘కమ్యూనిస్టులు కార్మికుల పేరుతో రాజకీయ లాభాల కోసం బంద్‌లు, ఆందోళనలకు పిలుపునిస్తారు. ఈ రోజు బంద్‌లో పాల్గొన్న కార్మికుడు రేపు ఆకలితో అలమటిస్తాడు. వారిని ఆకలితో మాడ్చే కమ్యూనిస్టులు కార్మికుల శత్రువు కాదా?’ అని అంబేడ్కర్ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వ్యాఖ్యానించారు. డెబ్బై ఏళ్లు దాటినా కమ్యూనిస్టులు ఏమీ మారలేదు. కొత్తగా వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ పట్ల వారి వ్యతిరేకతే దీనికి ఋజువు. మారుతున్న కాలంతో పాటు మారుతున్న ఉపాధి రంగాల్లో కార్మికులకు మేలు చేసేందుకు కేంద్రం పాత చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను తెచ్చింది. కమ్యూనిస్టులు మంచిని చూడకుండా, అవి కార్మికలకు వ్యతిరేకం అని రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు.
ఇప్పటివరకూ ఉన్న 29 కార్మిక చట్టాలు ప్రధానంగా 1940 నుంచి 1990 మధ్య కాలంలో వచ్చాయి. అంటే బ్రిటిష్ కాలం చివరి రోజుల నుంచి స్వాతంత్ర్యం తర్వాత మొదటి 40–45 ఏళ్లలో తయారయ్యాయి. మినిమమ్ వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, ఈఎస్‌ఐ, పీఎఫ్ చట్టాలు 1948–1952 మధ్యే వచ్చాయి. ఆ కాలంలో భారత్ ఇంకా పారిశ్రామికీకరణ మొదటి దశలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. ఈ చట్టాలు వర్తించే పరిశ్రమలు నూలు మిల్లులు, జూట్ మిల్లులు, బొగ్గు–ఇనుము గనులు, రైల్వే, టీ, కాఫీ, రబ్బరు తోటలు, బీడీ పరిశ్రమ, ఇనుము–ఉక్కు కర్మాగారాలు, పోర్ట్ & డాక్ యార్డులు. ఇప్పుడు ఈ తరహా పరిశ్రమలు ప్రభావం సన్నగిల్లింది. టెక్స్‌టైల్స్ మిల్లులు మూతపడ్డాయి, గనులు ఆటోమేషన్‌లోకి వెళ్లాయి. కొత్త రంగాలు ఐటీ, గిగ్ ఎకానమీ, ఈ–కామర్స్, డెలివరీ సర్వీసెస్ వచ్చాయి. పాత చట్టాలు ఇప్పటి కార్మికులకు సరిపడకపోవడంతో, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు తీసుకొచ్చింది.
కొత్త లేబర్ కోడ్‌లు సరళంగా, ఒకే చట్టంలో అన్నీ ఉన్నాయి. వేజెస్ కోడ్ ద్వారా కార్మికుల వేతనాలు, మినిమమ్ పే, బోనస్‌లు నిర్ణయిస్తారు. మినిమమ్ వేతనం జాతీయ స్థాయిలో నిర్ణయిస్తారు. రాష్ట్రాలు తమ పరిస్థితుల ప్రకారం మార్చవచ్చు. కాబట్టి పేద కార్మికులకు మంచి పే వస్తుంది. వేతనాల్లో అలవెన్స్‌లు పెంచి, బేసిక్ పే మెరుగుపరచడం వల్ల పీఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు పెరుగుతాయి. బోనస్ 8.33శాతం నుంచి పెంచారు. కార్మికుల చేతికి వచ్చే డబ్బు పెరుగుతుంది. వివాదాలు త్వరగా పరిష్కరించడానికి ఒకే లేబర్ కోర్ట్ ఏర్పాటు అవుతుంది. పాత చట్టాల్లో 5–6 కోర్టులు ఉండటం వల్ల కేసులు ఆలస్యమయ్యాయి; ఇప్పుడు 3–6 నెలల్లో పరిష్కారమవుతాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా శాశ్వత కార్మికుల్లా గ్రాట్యుటీ, పీఎఫ్ ఇవ్వాలి. ఇది 90శాతం అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేస్తుంది. ఇప్పుడు యువత ఎక్కువగా గిగ్ వర్కర్లుగా ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ ద్వారా ఉబర్, జోమాటో డ్రైవర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు మొదటిసారి భద్రత లభిస్తుంది. ఇన్సూరెన్స్, మెడికల్, పెన్షన్ హామీ ఇస్తున్నారు. 90శాతం అన్‌ఆర్గనైజ్డ్ కార్మికులు కవర్ అవుతారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పెరిగి, రూ.21,000 వేతనం వరకు కవర్ అవుతాయి. మెడికల్ సహాయం, మ్యాటర్నిటీ బెనిఫిట్‌లు లభిస్తాయి. చిన్న ఫ్యాక్టరీలు అంటే పదిమంది ఉద్యోగులు, కార్మికులు ఉన్న కంపెనీలు కూడా సేఫ్టీ చెక్‌లు చేయాలి. ఇది మహిళలు, చిన్న కార్మికులకు రక్షణ ఇస్తుంది. మ్యాటర్నిటీ లీవ్ 26 వారాలకు పెంచారు. వారానికి 48 గంటలు పనిలో మార్పు లేదు. ఓవర్ టైమ్‌కు అదనపు చెల్లింపులు చేయాలి. పాత 29 చట్టాలు గందరగోళంగా ఉండటం వల్ల కార్మికులు ప్రయోజనాలు పొందలేదు. ఇప్పుడు ఈ కొత్త నాలుగు చట్టాల్లో అన్నీ స్పష్టంగా ఉన్నాయి.
కానీ కమ్యూనిస్టులు ఈ చట్టాలు కార్మిక వ్యతిరేకమనీ, కార్పొరేట్లకు మేలు చేస్తాయనీ ప్రచారం చేస్తున్నారు. లేబర్ కోడ్స్‌లో ప్రతిదానికీ లేని అర్థాన్ని వెతుక్కుని తప్పుడు ప్రచారాలు చేస్తూ కార్మికులను తమ గ్రిప్‌లో ఉంచుకుని వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. వారంలో పని గంటలు పెంచినట్లుగా ప్రచారం చేస్తున్నారు. వారానికి 48గంటల పని విషయంలో ఎలాంటి మార్పు లేకపోగా, కార్మికులు అదనపు పని చేసుకుని అదనంగా సంపాయించుకునే అవకాశాన్ని కల్పించారు. దీన్ని కూడా తప్పుగా అన్వయిస్తున్నారు. కంపెనీలు బాగుంటేనే కార్మికులు బాగుంటారన్న విషయాన్ని కమ్యూనిస్టులు అంగీకరించడం లేదు. అసలు లేబర్ కోడ్స్‌పై అభ్యంతరాలేమిటో కమ్యూనిస్టులకే స్పష్టత లేదు. ‘కార్పొరేట్లకు మేలు’, ‘కార్మిక హక్కులకు పాతర’... ఇలా పడికట్టు పదాలతో ఎప్పట్లాగే రాజకీయం చేస్తున్నారు.
లేబర్ కోడ్స్ ద్వారా ప్రధానమంత్రి మోదీ కార్మికవర్గానికి సరికొత్త శక్తిని ఇస్తున్నారు. ఈ మార్పులు కేవలం చట్టాలు కాదు; భారత శ్రామిక శక్తిని ఆత్మవిశ్వాసంతో మరింత శక్తివంతంగా తీసుకెళ్లే విజన్. కొత్త లేబర్ కోడ్స్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగడమే గాక, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. శ్రామిక శక్తి ఆధారిత అభివృద్ధి అనే లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఇది ఒక సుస్థిరమైన అడుగు.
కమ్యూనిస్టులు కార్మికుల హక్కుల పోరాటం అంటారు కానీ పరిశ్రమల నాశనమే విధానంగా పనిచేస్తారు. పశ్చిమ బెంగాల్ 1960 నాటికి పారిశ్రామికంగా దేశంలో రెండో స్థానంలో ఉండేది, కానీ ట్రేడ్ యూనియన్ మిలిటెన్సీ వల్ల పరిశ్రమలు మూతపడి పారిశ్రామికీకరణ ఆగిపోయి 2000 నాటికి పదవ స్థానానికి పడిపోయింది. ఇండస్ట్రియల్ ఔట్‌పుట్ షేర్ 24శాతం నుంచి 3.7శాతానికి తగ్గింది. దీనివల్ల నష్టపోయింది ఎవరు?
కమ్యూనిస్టులు కార్మికులను ఓటుబ్యాంకుగా చూస్తారు, చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వారిని రెచ్చగొట్టి ఉద్యమాలకు ప్రేరేపించి గుప్పిట్లో ఉంచుకుంటారు. వారికి మంచి జరిగే చట్టాలు వచ్చి బాగుపడితే తమకు ఇక పుట్టగతులు ఉండవని నిత్యం రెచ్చగొడతారు. ఇలాంటి వారికి ఇక కార్మికులు, ప్రజలు అవకాశం ఇవ్వరు. సరైన సమయంలో సరైన బుద్ధి చెబుతారు.
ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News