A Book That Inspires Queer People: ఈ పుస్తకం చదివాక క్వియర్ వ్యక్తులే తమ కథలు రాస్తారని ఆశ
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:39 AM
స్త్రీ – పురుషుడు అనే జెండర్లు మాత్రమే ఉంటాయనీ, వారిరువురికీ మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ మాత్రమే సహజమనీ సమాజం నమ్ముతుంది. ఇలాంటి అభిప్రాయాలకు లోబడని భావాలు, గుర్తింపులు లేదా అనుభవాలు ఉండే...
స్త్రీ – పురుషుడు అనే జెండర్లు మాత్రమే ఉంటాయనీ, వారిరువురికీ మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ మాత్రమే సహజమనీ సమాజం నమ్ముతుంది. ఇలాంటి అభిప్రాయాలకు లోబడని భావాలు, గుర్తింపులు లేదా అనుభవాలు ఉండే వారిని క్వియర్ వ్యక్తులు అంటారు. గే, లెస్బియన్, బై సెక్సువల్, ట్రాన్స్... లేదా ఫలానా అని ఏ లేబుల్ వేసుకోలేనివారిని కూడా క్వియర్ అంటారు. తెలుగులో ఈ థీమ్స్ మీద ఇటీవలే ఎక్కువ సాహిత్యం రావటం మొదలైంది. ఇప్పుడు ఈ ఇతివృత్తంపై 1922 నుంచి 2025 దాకా తెలుగులో వచ్చిన కథలతో ‘అదే ప్రేమ’ కథా సంకలనం వెలువడింది. ఈ సందర్భంగా ఈ పుస్తకం ఎడిటర్ అపర్ణతోట తో వివిధ సంభాషణ:
‘క్వియర్’ (Queer) ఇతివృత్తాలు ఉన్న కథలతో ఈ సంకలనం తేవాలన్న ఆలోచన గురించి చెప్పండి? ఈ సంపుటి ద్వారా మీరు ఆశిస్తున్నది ఏమిటి?
అస్తిత్వ ఉద్యమాలకు ముందే ఆ అస్తిత్వానికి (ఐడెంటిటీకి) చెందని ఎందరో రచయితలు వివిధ అంశాలను స్వతహాగా పూనుకుని రాశారు. ఉదాహరణకు స్త్రీవాద ఉద్యమం రాకమునుపే చలం, కొ.కు, శ్రీపాద; అలానే దళిత ఉద్యమానికి ముందే జాషువా, రావి శాస్త్రి, ఉన్నవ, స్మైల్, కె.ఎన్.వై పతంజలి రాశారు. తరవాత ఉద్యమాలకు అనుసంధానంగా వచ్చిన సాహిత్యం కూడా మనకు తెలుసు.
సాహిత్యం వలన సమాజం మారుతుందా మారదా అనే డిబేట్‌లోకి నేను పోను. కానీ ఉద్యమ నేపథ్యం, ప్రాముఖ్యత పాఠకులకు లేదా సాధారణ ప్రజలకు చేరడానికి సాహిత్యం చాలా అవసరం. క్వియర్ ఉద్యమ సందర్భంలో తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా క్వియర్ అంశాలకు ఎంత చోటు ఇచ్చారో చూడాలన్న ఆసక్తితో ఈ పనిని తలకెత్తుకున్నాను.
ఒక చదువరిగా క్వియర్ సాహిత్యానికి తక్కువ స్థలమే కేటాయించి ఉంటారన్నది తెలుసు కాని, ఒకసారి ఈ విషయాన్నీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఇది మంచి మార్గంగా అనిపించింది. పైగా, సమాజపు చూపులోని మార్పును ఈ కాలానుగుణంగా వచ్చిన ఈ కథలు ప్రతిబింబిస్తాయి. అసలు కారణమైతే, ఈ పుస్తకం చదివాక క్వియర్ వ్యక్తులే కథలు రాస్తారనీ, వారి జీవితాలను అందరికి అర్థమయేలా చేస్తారని.
మనుషుల మధ్య ఎన్ని పోటీలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నా, ప్రేమ కూడా ఏకసూత్రంగా అందరిని కలుపుతుంది. అటువంటి సమయాల్లో వారి పట్ల ప్రేమను, వారి మధ్య ప్రేమను వివక్షతో చూస్తామెందుకు? ఆ ఉద్దేశంతోనే, ఇదే సంకలనంలో మానస ఎండ్లూరి రాసిన ‘అదే ప్రేమ’ కథ శీర్షికనే ఎంచుకున్నాము.
కథల ఎంపికకు వేటిని ప్రమాణాలుగా అనుకున్నారు?
క్వియర్ పాత్రలే ప్రధాన పాత్రలు కావాలి అని, వారి జీవితంలో జరిగే ఘర్షణను మాత్రమే ప్రెజెంట్ చేసే కథలు తీసుకున్నాను. అయితే ఎంపికకు పెద్దగా కష్టపడలేదు. మన కథలలో రెప్రెసెంటేషన్ మీద ఇంకా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాబట్టి సపోర్టింగ్ కారెక్టర్లుగా ఏ కథలోనూ క్వియర్ వ్యక్తులు లేరు. అంటే రచయితలు రాయాలనుకుని రాసిన కథలే గాని, క్వియర్ వ్యక్తులను సమాజంలో bystandersగా తెలిపిన కథలు ఇంచుమించుగా లేవు.
తెలుగులో ‘క్వియర్’ అంశం చుట్టూ తిరగిన మొదటి కథగా దేన్ని చెప్పవచ్చు?
విశ్వనాథ సత్యనారాయణ గారు 1922లో సాహితి పత్రికలో ‘ఇంకొకవిధము’ అనే రెండు పేజీల చక్కని కథను రాశారు. నాటక రంగంలో ఉన్నవారు కొంచెం లిబరల్‌గా ఉన్న వాతావరణంలో ఉంటారనేమో, అటువంటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఒక పేరున్న నాటక కళాకారుడు, ఆయనను ఆరాధించే ఒక పిల్లవాడు– ఆ పిల్లవాడి ఆరాధన, ఆయన అనురక్తి గురించి చాలా సున్నితంగా చెప్పారు. ప్రేమకు ఇంకొక విధము కూడా ఉంటుందని చెప్పడం ఆయన ఉద్దేశం అనుకుంటాను. కానీ ఆ కథ వారి మధ్య ఉన్న ప్రేమను, కరుణను గురించి చెబుతుంది కానీ శారీరక అనుబంధం ఉన్నాదని ఎక్కడా చెప్పలేదు. ఇది ఒక Asexual bonding అన్నారట ఆయన తన మనవడితో. క్వియర్ ఉనికిలో Asexual – Romantic/ Aromantic సంబంధాలు ఉంటాయని చాలామందికి తెలీదు. ఎంతసేపు క్వియర్ సంబంధాలని సెక్సువల్ సంబంధాలుగానే చూస్తారు.
మీరు గమనించిన తెలుగు ‘క్వియర్’ కథలు బయటి దేశాల ‘క్వియర్’ కథలతో పోల్చినప్పుడు ఎలా భిన్నంగా ఉన్నాయి?
బయటి దేశాల క్వియర్ కథలు క్వియర్ వ్యక్తులే రాస్తారు. ఒకవేళ నాన్ క్వియర్ వ్యక్తులు రాస్తే చాలావరకు క్వియర్ పాత్రలను సహాయ పాత్రలుగా చూపించడమో లేక వారిని ప్రధాన పాత్రలుగా చూపిస్తే సరైన రీసర్చ్ చేసి చూపిస్తారు. వారి సాహిత్యంలో చాలా ముందే అంటే, ఇంచుమించుగా 60 ఏళ్ళ ముందే క్వియర్ క్యారెక్టర్ల ప్రస్తావన ఉంది. కానీ మన మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో ఇప్పటికీ క్వియర్ వ్యక్తుల ప్రస్తావన లేదు. మన అసమానతలలో ఉన్న వైవిధ్యం వలన అనుభవాల ద్వారా లేదా కళ్ళకెదురుగా కనబడే అసమానతనే వెలుగులోకి తెచ్చాము. క్వియర్ జీవితాలు అంచున ఉండడమే కాక ప్రధాన స్రవంతిలో మనకు ఎదురయ్యే సందర్భాలు చాలా తక్కువ కాబట్టి సాహిత్యంలో ఈ వస్తువు నిర్లక్ష్యానికి గురైంది.
అంతేగాక, తెలుగు రచయితలు క్వియర్ కథలను రాసినా, అది బైనరీ (ఆడ–మగ) లెన్స్ తోనే రాసినది. దాని అర్థం: కొన్ని కథలలో పాత్రలను క్వియర్ పాత్రలుగా కాక ఇంకేదైనా వైవిధ్యంతో (కులం, శరీర వైకల్యం, వర్గం) మార్చినా కథలో విపరీతమైన మార్పులేమీ కనిపించవు. దీనికి కారణం రచయితలు వారి ప్రాంతాలకు వెళ్ళకపోవడం, వారితో స్నేహం చేయకపోవడం, వారి జీవితాల గురించి కళ్ళకు కనపడినంతే చూసి రాసేయడం, కొన్నిసార్లు అపోహలతో కథలు రాయడం (ఇది అన్నిటికన్నా ప్రమాదం). దీనికి కారణం క్వియర్–నాన్ క్వియర్ జీవితాలు రెండు పారలల్ గీతాలలా సంబంధం లేకుండా నడుస్తాయి. కానీ క్వియర్ జీవితాలలో హింసను ప్రేరేపించేది నాన్ క్వియర్ సిద్ధాంతాలే. కాబట్టి నాణ్యమైన క్వియర్ కథలు రాయాలి అంటే వారితో సంభాషణ, స్నేహం పెరగాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News