Share News

సిక్కిం విలీనానికి ఏభై ఏళ్ళు

ABN , Publish Date - May 16 , 2025 | 06:27 AM

స్వతంత్ర భారత చరిత్రలో సిక్కిం విలీనం ఒక ప్రధాన ఘట్టం. మే 16, 1975న జరిగిన ఈ చారిత్రక ఘట్టానికి ఏభై ఏళ్ళు నిండినందున నాటి గొలుసుకట్టు సంఘటనలు, రాజకీయ పరిస్థితులు, ఇందిరాగాంధీ దూరదృష్టి వంటి అంశాలను సింహావలోకనం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. భారతదేశానికి ఈశాన్య సరిహద్దులో నేపాల్, భూటాన్‌ల...

సిక్కిం విలీనానికి  ఏభై ఏళ్ళు

స్వతంత్ర భారత చరిత్రలో సిక్కిం విలీనం ఒక ప్రధాన ఘట్టం. మే 16, 1975న జరిగిన ఈ చారిత్రక ఘట్టానికి ఏభై ఏళ్ళు నిండినందున నాటి గొలుసుకట్టు సంఘటనలు, రాజకీయ పరిస్థితులు, ఇందిరాగాంధీ దూరదృష్టి వంటి అంశాలను సింహావలోకనం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. భారతదేశానికి ఈశాన్య సరిహద్దులో నేపాల్, భూటాన్‌ల నడుమ ఒక రాష్ట్రం సిక్కిం. వైశాల్యంలో గోవాకు ఒక మెట్టు పైన ఉండే సిక్కిం, జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం. ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంతతకు నెలవై, హిమాలయాల పర్వతశ్రేణి ఒడిలో ఒదిగి 500 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న దీని చరిత్ర ఆద్యంతం ఆసక్తికరమైనదే. ఎనిమిదవ శతాబ్దంలో పద్మసంభవ (టిబెటన్ భాషలో గురు రింపోచే) అనే బౌద్ధగురువు టిబెట్‌తో పాటు సిక్కింకు వజ్రయాన బౌద్ధాన్ని పరిచయం చేయగా, కొన్ని శతాబ్దాల తరువాత రాజ వంశీకులు (చొగ్యాల్) దానిని అవలంబించారు. ఇరుగు పొరుగు రాజ్యాలైన నేపాల్, భూటాన్‌ల దాడులకు గురైనప్పుడల్లా సిక్కింను టిబెట్ కాపాడేది. 18వ శతాబ్దపు చివర్లో చైనాకు చెందిన క్వింగ్ రాజులు కొన్నాళ్ళు పాలించగా, 1853లో ఈస్ట్ ఇండియా కంపెనీ (బ్రిటిష్) పరమైంది. ఎన్నో మలుపులు తిరిగిన తరువాత 1918లో బ్రిటిష్ ప్రభుత్వం... రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా సిక్కింకు అంతర్గత వ్యవహారాలలో పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సిక్కిం స్టేట్ కాంగ్రెస్ 1948లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడం ప్రారంభించింది. సిక్కిం రాజు– భారత ప్రధాని నెహ్రూ సహాయం కోరగా, భారత్ ఒక దివాన్‌ను, కొంత భద్రతా బలగాన్ని అక్కడకు పంపించింది. అప్పుడు ఉత్పన్నమైన విలీన ప్రతిపాదనను ‘‘చిన్నదైన ఒక సార్వభౌమ దేశాన్ని కబళించామన్న అపప్రథ తమకు అక్కరలేదని, పైగా ఆ విలీనం చైనాను రెచ్చగొట్టేదిగా కనిపిస్తుంది’’ అంటూ తిరస్కరించారు నెహ్రూ. 1950లో భారత రక్షణలో మెసిలే రాజ్యంగా సిక్కిం అవతరించింది. 1962లో జరిగిన చైనా–భారత్ యుద్ధం భారత రక్షణ వ్యవస్థలో పెను మార్పులకు దారి తీసింది. రక్షణ విషయంలో లాల్ బహదూర్ శాస్త్రి, తరువాత ఇందిరా గాంధీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 1967లో సిక్కిం–చైనా సరిహద్దుల్లో గల నాథులా, చోలా కనుమల వద్ద ఇనుప కంచె వేస్తున్న భారత సరిహద్దు దళాల సైనికులను చైనా సైనికులు వెనక్కు జరగమన్నారు. అయినా భారత దళాలు వెనుకడుగు వేయలేదు. ఫలితంగా ఘర్షణ జరిగింది. నాథులా కనుమ వద్ద సెప్టెంబర్‌లో, చోలాలో అక్టోబర్‌లో జరిగిన ఘర్షణలలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. భారత శక్తిని తక్కువ అంచనా వేసిన చైనా దళాలు, మన సైనికుల తెగువతో వెనుదిరిగారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కిం భౌగోళిక, వ్యూహాత్మక ప్రాముఖ్యతపై దృష్టి సారించి, దీర్ఘకాలిక ప్రణాళికా రచనలో నిమగ్నమయ్యారు. సిక్కిం ఉత్తరాన ఉన్న చుంబి లోయపై చైనా కన్నువేసిందని ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయి. సిక్కిం విషయంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి, వెంటనే పావులు కదిపారు. 1973లో జరిగిన ప్రజా ఉద్యమం ధాటికి చొగ్యాల్ (సిక్కిం చక్రవర్తిని చొగ్యాల్‌గా పిలిచేవారు) భారత ప్రభుత్వ సహాయాన్ని అర్థించగా, భారత్ 1200 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పంపి ఉద్యమాన్ని నియంత్రించింది. అయినా 1974లో సిక్కిం ప్రధానమంత్రి కాజీ లెండుప్ దర్జీ, సిక్కింను భారత్‌లో విలీనం చేయమని ఇందిరా గాంధీకి విజ్ఞప్తి చేయగా, ఆ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. విలీనం రెఫరెండం ద్వారా జరగాలని నిర్ణయించి, భారత ప్రభుత్వ బలగాల పర్యవేక్షణలో సిక్కిం ఎలక్షన్ కమిషన్‌కు ఆ పని అప్పజెప్పారు. ఏప్రిల్ 6న భారత్ భద్రతా సైనికులు రాజప్రాసాదంలోకి ప్రవేశించి 243 మంది సిక్కిం సైనికులను నిరాయుధులను చేశారు. దురదృష్టవశాత్తు ఒక సైనికుడు మరణించాడు.


రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, విలీనానికి మద్దతుగా 59,637 ఓట్లు రాగా, వ్యతిరేకంగా కేవలం 1,496 ఓట్లు పడ్డాయి. ఈ రెఫరెండం ప్రక్రియ మోసపూరితంగా భారత భద్రతా దళాల తుపాకుల కనుసన్నలలో జరిగిందని చైనా, పాకిస్తాన్‌లు విమర్శించాయి. దీనిని తిప్పికొడుతూ ఆజాద్ కశ్మీర్, టిబెట్‌ల వైనాలను ఇందిరాగాంధీ ఉదహరించారు. సిక్కిం విద్యార్థుల నిరసనను మన దళాలు సునాయాసంగా అణచివేశాయి. ఆండ్రూ డఫ్ అనే ఆంగ్ల పాత్రికేయుడు తన ‘Sikkim: Requiem for a Himalayan Kingdom’ గ్రంథంలో నాటి సంఘటనలు పూసగుచ్చినట్లు వర్ణించాడు. 1975, ఏప్రిల్ 11–16 మధ్య జరిగిన రెఫరెండం భారత్‌లో సిక్కిం విలీనానికి మార్గం సుగమం చేసింది. సిక్కిం భారత్‌లో విలీనానికి రాజకీయ పరిస్థితులకు, సాంస్కృతిక కారణాలు కూడా తోడయ్యాయి. అదే ఏడాది మే 16న పార్లమెంట్‌లో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను 22వ రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి సిక్కిం విలీనం ద్వారా ఇందిరాగాంధీ తన రాజకీయ నైపుణ్యాన్ని, సామర్ధ్యాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఏభై ఏళ్లలో సిక్కిం ఒక ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. వంద శాతం సేంద్రీయ వ్యవసాయాన్ని కొనసాగిస్తోంది. తలసరి ఆదాయంలో భారత్‌లో ప్రథమ స్థానాన్ని అందుకుంది. ఎటువంటి వేర్పాటు ఉద్యమాలు లేని ఈశాన్య రాష్ట్రంగా సిక్కిం ప్రపంచ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. పర్యాటకుల స్వర్గధామమైన ఈ రాష్ట్రం, భారత సరిహద్దులలో ప్రకాశించే మణిపూసగా అభివర్ణించవచ్చు.

కొట్టు శేఖర్ ప్రొఫెసర్, మిజోరాం యూనివర్సిటీ

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 06:27 AM