Share News

1984 Andhra Pradesh Crisis: 1984 పోటెత్తిన తెలుగు పౌరుషం

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:35 AM

స్వతంత్ర భారతావనిలో జరిగిన స్ఫూర్తిదాయక ప్రజాస్వామిక పోరాటాల్లో చరిత్రాత్మకమైనది– 1984 ఆగస్టులో ఎన్‌.టి. రామారావు సారథ్యంలో జరిగిన దేశవ్యాప్త ఉద్యమం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఆ పోరాటానికి ఎన్నో ప్రత్యేకతలు...

1984 Andhra Pradesh Crisis: 1984 పోటెత్తిన తెలుగు పౌరుషం

స్వతంత్ర భారతావనిలో జరిగిన స్ఫూర్తిదాయక ప్రజాస్వామిక పోరాటాల్లో చరిత్రాత్మకమైనది– 1984 ఆగస్టులో ఎన్‌.టి. రామారావు సారథ్యంలో జరిగిన దేశవ్యాప్త ఉద్యమం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఆ పోరాటానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు 1984 జూలైలో గుండె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడం కోసం పార్టీలోని అసంతృప్తివాదులు ముఠాలు కట్టారు. రాజకీయ పాచికలు విసిరారు. వారికి కేంద్రంలోని పెద్దలు అభయ‘హస్తం’ అందించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం కూడా మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌ చేరుకొన్న ఎన్‌.టి. రామారావును ప్రభుత్వాన్ని అన్యాయంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా నాటి గవర్నర్‌ రామ్‌లాల్‌ కేవలం నోటిమాటతో బర్తరఫ్‌ చేశారు. ఆ స్థానంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. తనకు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉందని, 48 గంటల్లో శాసనసభను సమావేశపరిస్తే తన బలం నిరూపించుకొంటానని ఎన్టీఆర్‌ సవాల్‌ చేస్తున్నా గవర్నర్‌ రామ్‌లాల్‌ విన్పించుకోకుండా ఆయనను అరెస్ట్‌ చేయించారు. ఎన్టీఆర్‌కు మద్దతుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన శాసనసభ్యులనూ అరెస్ట్‌ చేయించారు. అరెస్టయిన శాసనసభ్యులు ఎన్టీఆర్‌తో సహా 161 అని లెక్క తేలింది. ఆ ‘వార్త’ కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో ప్రసారం అయింది.

ఎన్టీఆర్‌ అరెస్ట్‌ వార్త దేశ ప్రజల్ని నిర్ఘాంతపరిచింది. మెజారిటీ శాసనసభ్యుల బలం ఉన్న ఎన్టీఆర్‌ను ఏ నిబంధన కింద గవర్నర్‌ పదవీచ్యుతుణ్ణి చేసి, అరెస్ట్‌ చేయించారన్న ప్రశ్న తలెత్తింది. ఎన్టీఆర్‌కు మెజార్టీ లేదని గవర్నర్‌ రామ్‌లాల్‌ ‘స్వీయ సంతృప్తి’ చెందారు కనుక, రాజ్యాంగంలో సదరు నిబంధన ఒకటి ఉందన్న సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజ్యాంగ హననాన్ని నాటి కాంగ్రెస్‌ పెద్దలు సమర్థించుకొన్నారు.


దేశంలో కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెసేతర పార్టీలను బలహీనపర్చడానికి కాంగ్రెస్‌(ఐ) పార్టీ అనేక అక్రమ మార్గాలు ఎంచుకొంది. అందులో భాగంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీల్లో చీలికలు తేవడం, అసమ్మతి వర్గానికి మద్దతు ఇచ్చి దొడ్డిదారుల్లో వారిని అధికారంలో కూర్చోబెట్టడం.. కొన్నాళ్ల తర్వాత ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆ కీలుబొమ్మ ప్రభుత్వాలను పడగొట్టడం కాంగ్రెస్‌(ఐ)కి రివాజుగా మారింది. ఈ రాజకీయ క్రీడలో కొందరు గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేశారు. ఫలితంగా 1947 నుంచి 1984 వరకు దేశంలో 26 కాంగ్రెసేతర ప్రభుత్వాలు అర్ధంతరంగా కూలిపోయాయి. అందులో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఉన్నాయి. 1984 ఆగస్ట్‌ 16న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై వేటు వేశారు.

ఒకవైపు అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా, తన ధర్మపత్ని క్యాన్సర్‌తో ఆసుపత్రి బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడుతున్నా ఎన్టీఆర్‌ మనోస్థైర్యం కోల్పోలేదు. ‘‘నా అనారోగ్యాన్ని అదనుగా తీసుకొని కేంద్రం నాపై పన్నిన కుట్రను ఎదుర్కొంటాను.. కేంద్రంలో కాంగ్రెస్‌(ఐ)ను గద్దె దించేవరకు, రాష్ట్రంలోని కీలుబొమ్మ ఫిరాయింపుదార్ల ప్రభుత్వాన్ని తొలగించే వరకు నేను విశ్రమించను’’ అని శపథం చేశారు.

ఫిరాయింపుదారులు, కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ పెద్దలు, రాష్ట్రంలో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉమ్మడిగా పాల్పడిన కుటిల రాజకీయానికి ఎన్‌.టి. రామారావు రాజకీయంగా బలైపోయారన్న నిజం గ్రహించిన రాష్ట్ర ప్రజానీకంలో ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బంద్‌లు, హర్తాళ్లు చేశారు. బస్సుల్ని నిలిపివేశారు. రైళ్లను ఆపేశారు. ఫిరాయింపుదారుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించి అధికారంలోకి వచ్చినవారు ఆందోళనకారులపై పోలీసు కాల్పులు జరిపించారు. పోలీసుల బుల్లెట్లకు పదుల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలొదిలారు. వేలాదిమంది ఉద్యమకారులు జైళ్ల పాలయ్యారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అనే భేదం లేదు. అన్ని చోట్లా ఒకే రకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. యువకులు, విద్యార్థులు, రైతులు, లాయర్లు, మహిళలు పోరుబాట పట్టారు. సత్యాగ్రహాలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌ రామ్‌లాల్‌ పాల్పడిన నీతిబాహ్య రాజ్యాంగ విరుద్ధచర్యను దేశంలోని కాంగ్రెసేతర పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఆ పార్టీలన్నీ ఎన్‌.టి. రామారావుకు బాసటగా నిలిచాయి. దేశంలో మొట్టమొదటిసారిగా బీజేపీ, వామపక్షపార్టీలు కలిసి ఎన్టీఆర్‌ కోసం ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చేపట్టాయి. గవర్నర్‌ రామ్‌లాల్‌ను రీకాల్‌ చేయాలని, కీలుబొమ్మ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును తక్షణం డిస్మిస్‌ చేయాలని, ఎన్టీఆర్‌ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రధాన డిమాండ్లతో వారి కార్యాచరణ మొదలైంది. జాతీయ స్థాయిలో 18 పార్టీల నాయకులతో అఖిలపక్ష సారథ్య సంఘం ఏర్పాటయింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో సాగించిన ఉద్యమం, పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడం, ప్రజలలో ఉవ్వెత్తున ఎగసిన చైతన్యంతోపాటు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని కొన్ని పత్రికలు సాగించిన అక్షరయుద్ధం చరిత్రాత్మకం. అలాగే, కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఫిరాయింపుదారులు, వారికి మద్దతిచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నో ఎత్తులు వేశారు. వాటన్నింటినీ దీటుగా ఎదుర్కొని ఎన్టీఆర్‌కు వెన్నంటి నిలిచిన ఎమ్మెల్యేలను చివరివరకు కంటికి రెప్పలా కాపాడిన నాయకుడు– నారా చంద్రబాబు నాయుడు. 1984 ఆగస్ట్‌ ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో ఆద్యంతం ఆయన పోషించిన పాత్ర కీలకం. ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ముందుచూపు కారణంగానే.. ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. ఆ సమయంలో కొందరు దుండగులు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు. సంక్షోభ పరిస్థితులలో గొప్ప సంయమనంతో చంద్రబాబు తన విశిష్ట నాయకత్వ పటిమను ప్రదర్శించారు.

32 రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ముందు నియంతృత్వం తలవంచింది. సెప్టెంబర్‌ 16న తిరిగి ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ఎన్టీఆర్‌కు తిరిగి అధికారం దక్కడం వెనుక ఎందరివో అసమాన త్యాగాలు ఉన్నాయి. కాంగ్రెసేతర పార్టీల మద్దతు, కర్ణాటకలోని రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం అందించిన సహకారం, ఎం. వెంకయ్యనాయుడు, ఎస్‌. జైపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, తదితర నాయకులు, మేధావులు, పాత్రికేయులు, ప్రజలు ఉమ్మడిగా చేసిన కృషి, ఉద్యమాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం దేశ రాజకీయాల దశ, దిశను మార్చింది. 1985లో పార్లమెంట్‌లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. గవర్నర్లకున్న విస్తృతాధికారాలపైన, ఆర్టికల్‌ 356 దుర్వినియోగం పైన విస్తృత చర్చకు ఆస్కారం ఏర్పడింది. శాసనసభ్యుల బలం తేల్చే వేదిక రాజ్‌భవన్‌ కారాదని, శాసనసభలోనే బలనిరూపణ జరగాలని స్పష్టం అయింది. అలాగే కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య వ్యవస్థ బలోపేతం కావడానికి సర్కారియా కమిషన్‌ సూచనల అమలుకు మార్గం సుగమమైంది. అనంతర కాలంలో దేశంలోని కాంగ్రెసేతర పక్షాల నడుమ ఐక్యతకు, అంశాల ప్రాతిపదికన కలిసి పనిచేయడానికి తగిన భూమిక ఏర్పడింది. ఇంకా ఎన్నో విధాలుగా దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పునరుద్ధరణకు 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం దోహదం చేసింది.

టి.డి. జనార్ధన్‌

విక్రమ్‌ పూల

(నేటి సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో ‘1984: ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ ముఖ్యఅతిథులు.)

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 01:36 AM