Share News

430 అడుగుల ఆలయ గోపురం

ABN , Publish Date - Mar 16 , 2025 | 08:56 AM

హైదరాబాద్‌లోని నార్సింగి, కోకాపేట్‌లో నిర్మాణంలో ఉన్న ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే... తిరుమల పుణ్యక్షేత్రాన్ని తలపించే విధంగా అతి పెద్ద ప్రాకారంలో శ్రీనివాస గోవిందుడి ఆలయం కనిపిస్తుంది.

430 అడుగుల ఆలయ గోపురం

హైదరాబాద్‌ మహానగరానికి ఆధ్యాత్మిక మణిహారంగా... శ్రీనివాసుడి సమేత రాధా కృష్ణుడి క్షేత్రం వెలుస్తోంది. తెలంగాణలో అత్యంత ఎత్తైన దేవాలయం... 430 అడుగుల ఎత్తులో ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఆధ్యాత్మికం... మరోవైపు ఆధునిక రీతిలో అత్యద్భుతమైన నిర్మాణ శైలితో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ మహాక్షేత్రం విశేషాలివి...

హైదరాబాద్‌లోని నార్సింగి, కోకాపేట్‌లో నిర్మాణంలో ఉన్న ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే... తిరుమల పుణ్యక్షేత్రాన్ని తలపించే విధంగా అతి పెద్ద ప్రాకారంలో శ్రీనివాస గోవిందుడి ఆలయం కనిపిస్తుంది. ఆలయ ప్రాకారంతో పాటు స్వామివారి మూలవిరాట్‌ విగ్రహం ఒకే రాతితో తయారు చేస్తుండటం విశేషం. ఇక ప్రధాన ఆలయంగా శ్రీ రాధాకృష్ణుల ఆలయం ఉంటుంది. ఇక్కడ సీతారామచంద్రమూర్తి, గౌరంగ నితాయ్‌ భక్తులకు దర్శనమిచ్చేవిధంగా మరో రెండు ఉప ఆలయాలున్నాయి. కాక తీయ, చాళుక్య, ద్రవిడ నిర్మాణ శైలితో పాటు... ఆధునికతను మేళవించి ‘హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ నిర్మాణం జరుగుతోంది.


గోపురం చివరి వరకు చూసేలా...

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే... ఆలయ ప్రాంగణం మధ్యలో నిలబడి పైకి చూస్తే... ఆలయ గోపురం చివరి వరకు కంటికి కనిపించేలా నిర్మాణం ఉంటుంది. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదే తొలి సారి కావడం విశేషం. ఎలాంటి పిల్లర్లు లేకుండా, 430 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆలయ గోపుర నిర్మాణంలో దాదాపు సగభాగం అద్దాలను ఉపయోగిస్తున్నారు. గోపురం పైన ఉండే సుదర్శన చక్రం దూరం నుంచి కూడా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో ఈ గోపురం పైన డిజిటల్‌గా ఆధ్మాత్మిక అంశాల్ని ప్రదర్శించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

book2.2.jpg


లైబ్రరీ, మ్యూజియం, ప్రకృతి రమణీయత...

ఆలయ ప్రాంగణంలో భగవద్గీత, రామాయణ, భాగవతాలతో పాటు అనేక పురాణ, ఇతిహాసాలను పాఠకులకు అందించే ఆధునిక లైబ్రరీ ఉంటుంది. పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, దైవత్వాల గురించి తెలియజేసే విధంగా మ్యూజియం, మల్టీవిజన్‌ థియేటర్‌ ఉన్నాయి. సమావేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా సువిశాలమైన, ఆధునిక హంగులతో హాల్స్‌తో పాటు... భక్తులు బస చేసేందుకు వీలుగా గెస్ట్‌ హౌస్‌లు కూడా ఉన్నాయి. దైవదర్శనం, భజనలతో ఆధ్మాత్మిక లోకంలోకి తీసుకెళ్లడమే కాకుండా... పచ్చటి చెట్లతో కూడుకున్న ఈ ప్రాంగణం ప్రకృతి ఒడిలో సేదతీరేలా చేస్తుంది. సుమారు రెండు ఎకరాల్లో ఉద్యానవనాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.

book2.3.jpg


ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు...

‘హరేకృష్ణ మూమెంట్‌’ దేశవ్యాప్తంగా ప్రామాణిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో నిరు పేదల కోసం పలు సాంఘిక, సంక్షేమ కార్య క్రమాలు నిర్వహించి విశేష సేవలందిస్తోంది. భోజనా మృతం, అన్నపూర్ణ, సద్దిమూట, స్వస్థ్య ఆహార వంటి ప్రతిష్టాత్మక భోజన సదుపాయ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండొంద లకుపైగా ఆహార పంపిణీ కేంద్రాల నుంచి 15 కోట్లకు పైగా భోజనాల్ని అందిస్తోంది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ భాగస్వామ్యం అవుతోంది.

- యస్‌.సోమేశ్వర్‌, హైదరాబాద్‌


గోష్పాద క్షేత్రమిది...

‘‘ గోష్పాద క్షేత్రం (గోవులు నడయాడిన భూమి) కావడంతోనే ఇక్కడ ఆలయాల సమూహం నిర్మిస్తున్నాం. గోష్పాద క్షేత్రంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించడం కంటే మహాద్భుతం మరొకటి లేదు. 6 ఎకరాల ప్రాంగణంలో హెరిటేజ్‌ టవర్‌తో పాటు... శ్రీ రాధాకృష్ణ ప్రధాన ఆలయం, శ్రీ శ్రీనివాస గోవిందాలయం, శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమాన్‌, శ్రీ గౌర నితాయ్‌ ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ మహా నిర్మాణం మూడునాలుగేళ్లలో పూర్తవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఎడ్యుకేషనల్‌ హబ్‌ కూడా. ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇక్కడ అందించే కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. ఈ మహా యజ్ఞంలో పాల్గొని సాయం అందించాలనుకునే వారు 96400 86664 నెంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.’’

- శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ,

హరే కృష్ణ మూమెంట్‌ తెలంగాణ అధ్యక్షుడు

Updated Date - Mar 16 , 2025 | 02:57 PM