Share News

Rahu Ketu Dosha Remedies: రాహు కేతు దోషం పోవాలంటే.. ఇలా సింపుల్‌గా..

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:37 PM

వారంలో ఏడు రోజులు ఉంటే.. వాటిలో రాహు కాలానికి ప్రత్యేక సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి.

Rahu Ketu Dosha Remedies: రాహు కేతు దోషం పోవాలంటే.. ఇలా సింపుల్‌గా..
Rahu Ketu Dosha Remedies

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో కొందరికి కొన్ని దోషాలు ఉంటాయి. వాటిలో రాహు కేతువు దోషం ఒకటి. ఈ దోషం వల్ల.. జీవితంలో అనేక అడ్డంకులు, తీవ్ర సమస్యలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అనవసర ఘర్షణలు వస్తాయని నమ్ముతుంటారు. ఈ దోష ప్రభావాన్ని తగ్గించడం కోసం పలు శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.


ఇంతకీ రాహు కేతు దోషం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు చాయా గ్రాహాలు. తొమ్మిది గ్రహాల్లో ఇవి ముఖ్యమైనవి. ఎవరైనా జాతకంలో ఈ రెండు గ్రహాలు సరైన స్థానంలో లేకుంటే.. దానిని రాహు కేతు దోషంగా పరిగణిస్తారు.


ఈ దోషం తగ్గాలంటే..

అమావాస్య రోజు.. పితృ తర్పణాలు ఇవ్వడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు.. ఇది పితృదోషాలను సైతం తగ్గిస్తోంది. ఈ పితృదోషాలు కూడా రాహు కేతు దోషాలతో ముడి పడి ఉంటాయని విశ్వసిస్తారు. ఈ రోజున సత్ బ్రాహ్మణులకు అన్నదానం, నువ్వులు, బెల్లంతోపాటు నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శభం కలుగుతుంది.


దేవతారాధన.. రాహువు, కేతువులను శాంతింప చేయాలంటే.. శివుడు, హనుమంతుడిని ఆరాధించాలి. అలాగే కనకదుర్గమ్మతోపాటు గణపతిని అధికంగా పూజించాలి. వీరి సహస్ర నామ స్తోత్రాలతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. వీరిని ఎర్రని పూలతో పూజించాలి. వారంలో ఏడు రోజులు ఉంటే.. వాటిలో రాహు కాలానికి ప్రత్యేక సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ దోష నివారణ కోసం అమావాస్య రోజు.. దానధర్మాలు చేస్తే ఇంకా మంచిది. పేదలు, అవసరమైనవారికి సహాయం చేయడం వల్ల దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుందని చెబుతారు.


ధ్యానం, యోగ, ప్రార్థన..

ఈ గ్రహ దోషాలు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి.. ప్రతి రోజు ధ్యానం, యోగతోపాటు దేవుళ్ల ప్రార్థన చేయాలి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని సైతం తీసుకువస్తుంది. రాహుకేతు ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడం కోసం అమ్మవారి మంత్రాలు జపించడం సులువైన మార్గం. అలాగే రాహుకేతు గ్రహాలకు సంబంధించిన మంత్రాలు చదవడం ద్వారా వీటి బారిన పడినా కూడా అంతగా ప్రభావం చూపించక పోవచ్చు. నవగ్రహా స్తోత్రాల్లో ఈ రెండు గ్రహాలకు ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. వాటిని చదివిన విశేష ఫలితం ఉంటుంది.


సరైన సమయం, ప్రదేశం..

రాహు కేతు పూజ చేయడానికి సరైన సమయంతోపాటు ప్రదేశాన్ని ఎంచుకోవడం మరీ ముఖ్యం. ప్రముక జ్యోతిష్యులు, పండితులను సంప్రదించి, ఈ పూజలకు అనుకూలమైన సమయం తెలుసుకోవాలి. రాహు కేతు దోష నివారణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో రాహు కేతు పూజ చేయడం వల్ల ఈ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలోని శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో సైతం ఈ దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Updated Date - Dec 14 , 2025 | 05:44 PM