Share News

Tirumala: తిరుమలలో.. డోలీల నుంచి ఏసీ బస్సుల దాకా..

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:39 PM

ఎన్ని కష్టాలు పడి అయినా ఏడు కొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి దాకా చేరుకోవడం ఒక ఎత్తయితే... తిరుపతి నుంచి తిరుమల కొండమీదకు చేరుకోవడం ఒక ఎత్తు.

Tirumala: తిరుమలలో.. డోలీల నుంచి ఏసీ బస్సుల దాకా..

తిరుమల: ఎన్ని కష్టాలు పడి అయినా ఏడు కొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి దాకా చేరుకోవడం ఒక ఎత్తయితే... తిరుపతి నుంచి తిరుమల కొండమీదకు చేరుకోవడం ఒక ఎత్తు. ఇది అత్యంత కష్టసాధ్యమైన ప్రయాణంగా ఒకప్పుడు ఉండేది. కాలక్రమంలో ఈ ప్రయాణాన్ని సులువు చేసే ఏర్పాట్లు జరిగాయి. ఆ పరిణామ క్రమం....

- ఒకప్పుడు నడచి మాత్రమే కొండకు చేరుకునేవారు. అలిపిరి, చంద్రగిరి వైపు నుంచి, మామండూరు ప్రాంతం నుంచి ఇలా రకరకాల మార్గాల్లో నడిచి కొండ ఎక్కేవారు. శ్రమతో కూడుకున్న నడకదారిలో అడవి జంతువుల ప్రమాదం ఎక్కువగా ఉండేది.

- నడవలేని వారిని డోలీలలో మోసుకువెళ్లేవారు. ఇందుకు ఏడెనిమిది గంటలకు పైగానే పట్టేది.


book10.2.jpg

- 1944కి ముందే బండి బాట ఏర్పడింది. ఎండ్లబండ్లపై ప్రయాణం మొదలైంది. మూడునాలుగు గంటల్లో కొండమీదకు చేరుకునేవారు. ఈ బాటలో మాల్వాడి గుండం జలపాతం దగ్గర దాటడం కష్టంగా ఉండేది. 1943 ఏప్రిల్‌లో ఇక్కడ రాతి వంతెన నిర్మించారు.

-1944 ఏప్రిల్‌ 10వ తేదీన టీటీడీ అధికారికంగా ఘాట్‌రోడ్డును ప్రారంభించింది. ‘టీటీడీ ట్రాన్స్‌పోర్టు’ ఏర్పాటు చేసి, తొలిగా రెండు బస్సులను కొనుగోలు చేశారు. ఈ సంఖ్య ఏడాదికే 15కి పెంచారు. బస్సు సౌకర్యం ఏర్పడడంతో భక్తుల సంఖ్య పెరిగింది. 1950లో 2 వేలు, 1960లో ఐదు వేలు మంది బస్సుల్లో ప్రయాణించారు.

- 1973లో రెండవ ఘాట్‌రోడ్డు నిర్మించారు. దీంతో తిరుమలకు వచ్చే వాహనాలు పెరిగాయి, భక్తుల సంఖ్య పెరిగింది.


book10.3.jpg

- తిరుమలకు బస్సులను టీటీడీ సొంత రవాణా వ్యవస్థే నడిపేది. దీనిని 1975 ఆగస్టు 10న ఏపీఎస్‌ ఆర్టీసీలో విలీనం చేశారు. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య పెరగడంతో ఇప్పుడు 80 వేల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

- శేషాచలం పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో 2022లో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రారంభించారు. ఈ ఏసీ బస్సుల్లో టికెట్‌. రూ.110లు.

- ప్రస్తుతం 64 ఏసీ బస్సులతో పాటు 335 డీజిల్‌ ఆర్టీసీ బస్సులు తిరుమల, తిరుపతి మధ్య నడుస్తున్నాయి.

- ప్రస్తుతం ఏసీ బస్సుల ద్వారా 30 నిమిషాలలోపే తిరుమలకు చేరుకునే వెసులుబాటు లభించింది.


book10.4.jpg

తిరుమలలో ఆంజనేయుడికి బేడీలు ఎందుకు వేశారు?

ఆంజనేయుడంటే వీరత్వానికి, బల పరాక్రమాలకూ ప్రతీక. ఆంజనేయ స్వామి విగ్రహాలు, చిత్రాలు కూడా ఇలాగే ఉంటాయి. తిరుమలలో మాత్రం ఆంజనేయుడి విగ్రహం భిన్నంగా ఉంటుంది. ఆరడుగుల ఆంజనేయుడు చేతులు రెండూ ముడుచుకుని, వినయంగా నిలబడి ఉన్నట్టుగా ఉండే రాతి విగ్రహం శ్రీవారి ఆలయానికి అభిముఖంగా అఖిలాండం వద్ద ఉంటుంది. ఈయనను ‘బేడి ఆంజనేయస్వామి’ అంటారు. చేతులు, కాళ్లకు బేడీలు తగిలించుకుని శ్రీవారికి నమస్కరిస్తున్న భంగిమలో ఆంజనేయుడి రూపం ఉంటుంది.


book10.5.jpg

ఇందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. శేషాచలంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ నానారభస చేస్తున్న ఆంజనేయుడిని కట్టడి చేయడానికి తల్లి అంజనాదేవి ఇలా బేడీలు తగిలించి శ్రీవారి ముందు నిలబెట్టిందని చెబుతారు. ఇందువల్లే బేడి ఆంజనేయుడనే పేరు స్థిరపడిందని ప్రచారం. ఉత్తర భారతదేశంలోని పూరీజగన్నాథ్‌ నుంచి ఈవిగ్రహాన్ని క్రీ.శ.1841లో మహంతు తిరుమలకు తెప్పించారని కొన్ని రికార్డుల్లో నమోదై వుంది. రోజూ వేంకటేశ్వరస్వామికి నివేదన అర్పించిన వెంటనే బేడి ఆంజనేయస్వామికి కూడా నివేదిస్తారు. భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించి ‘బేడి ఆంజనేయస్వామి’ని దర్శించుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..

సంక్షేమమా సంక్షోభమా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 21 , 2025 | 01:43 PM