Share News

Kashmiri Pandit Murder: కశ్మీర్ పండిట్ మహిళ హత్య.. 35 ఏళ్ల నాటి కేసును ఛేదించేందుకు పోలీసుల సోదాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:18 AM

35 ఏళ్ల నాటి కశ్మీరీ పండిల్ మహిళ హత్య కేసును ఛేదించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న స్టేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తాజాగా సెంట్రల్ కశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.

Kashmiri Pandit Murder: కశ్మీర్ పండిట్ మహిళ హత్య.. 35 ఏళ్ల నాటి కేసును ఛేదించేందుకు పోలీసుల సోదాలు
Sarla Bhat Murder Case 1990

ఇంటర్నెట్ డెస్క్: ముప్ఫై ఐదు ఏళ్ల నాటి కశ్మీరీ పండిట్ మహిళ సరళా భట్ హత్య కేసును ఛేదించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) తాజాగా సెంట్రల్ కశ్మీర్‌లో పలు చోట్ల సోదాలు నిర్వహించింది . నిషేధిత ఉగ్రసంస్థ జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వారి ఇళ్లల్లో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సంస్థ లీడర్ పీర్ నూరుల్ హక్ షాతో పాటు పలువురి ఇళ్లల్లో సోదాలు చేశారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

1990లో జరిగిన సరళా భట్ హత్య ఉదంతం అప్పట్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. సౌరాలోని షేర్ ఏ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌కు చెందిన హాస్టల్‌లో ఉంటున్న ఆమెను ఉగ్రవాదులు అపహరించి హత్య చేశారు.


పాక్‌ దన్నుతో కశ్మీర్‌లో ఉగ్రవాద చొరబాట్లు పతాకస్థాయికి చేరిన సమయంలో ఈ దారుణం జరిగింది. కశ్మీరీ పండిట్‌లపై టెర్రరిస్టులు అప్పట్లో వేధింపులకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో నర్సుగా పని చేస్తున్న సరళ..ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచింది. ఈ క్రమంలో వారు ఆమెను అపహరించి హత్య చేశారు. మృతదేహాన్ని శ్రీనగర్‌లో పారేశారు. పోలీసులకు తమ వివరాలు చేరవేస్తున్నందుకే సరళను హత్య చేశామంటూ రాసున్న కాగితాన్ని అక్కడ వదిలి వెళ్లారు. ఇలాంటి పలు ఘటనల తరువాత తీవ్ర భయాందోళనలకు లోనైన కశ్మీరీ పండిట్‌లు జమ్మూ, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

ఇక సరళ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇన్నాళ్లుగా ఎలాంటి పురోగతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే కేసును ఎస్ఐఏకు గతేడాది బదిలీ చేశారు. ఇక తాజా సోదాల సందర్భంగా అరెస్టులు, రికవరీలు వంటివేవీ చేయలేదని ఎస్ఐఏ అధికారులు తెలిపారు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టిన వారి ఆటకట్టించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

ఈ-ఆధార్ యాప్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

For More National News and Telugu News

Updated Date - Aug 12 , 2025 | 12:59 PM