Noida Nikki Case: నోయిడా నిక్కీ హత్య కేసులో వరుస ట్విస్టులు.. షాకింగ్ ఉదంతం వెలుగులోకి
ABN , Publish Date - Aug 28 , 2025 | 12:43 PM
నోయిడాకు చెందిన నిక్కీ అనే వివాహిత హత్య కేసు మరోకీలక మలుపు తిరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తనకు గాయాలయ్యాయని ఆమె వైద్యులకు ఆసుపత్రిలో చెప్పినట్టు తెలిసింది. భర్తే ఆమెకు నిప్పు పెట్టాడని నిక్కీ సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: నోయిడా యువతి నిక్కీ హత్య కేసులో వరుస ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అత్తవారింట్లో ఉండగా సిలిండర్ పేలడంతో గాయాలయ్యాయని నిక్కీ మరణ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరిన సమయంలో నిక్కీ ఈ విషయాలను వైద్యులకు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భర్త నిప్పు పెట్టడంతో నిక్కీ (26) దుర్మరణం చెందినట్టు ఆమె కుటుంబం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలపాలైన ఆమె చివరకు కన్నుమూసింది. అత్తింట్లో వరకట్న వేధింపులే నిక్కీని బలితీసుకున్నాయని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇప్పటికే పోలీసులు నిక్కీ భర్త విపిన్ భాటీని, అతడి సోదరుడు రోహిత్, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిక్కీ సోదరి కాంచన్ విపిన్ సోదరుడు రోహిత్ భార్య.
సిలిండర్ పేలడంతో గాయాలయ్యాయని నిక్కీ వైద్యులకు చెప్పగా పోలీసులకు మాత్రం ఆ ఇంట్లో సిలిండర్ పేలిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని సమాచారం. దీంతో, పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. ఎవరైనా బలవంతం చేయడంతోనే నిక్కీ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత వారం ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె కన్నుమూసింది. ఆమెకు 80 శాతం కాలిన గాయాలు అయినట్టు పోస్టు మార్టం నివేదికలో తేలింది. ఇక విపిన్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం అతడి కాలికి తూటా గాయమైందన్న వార్త కూడా సంచలనం రేపుతోంది.
నిక్కీ మృతిపై ఆమె సోదరి కాంచన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులే నిక్కీ మరణానికి కారణమని ఆమె పేర్కొంది. అత్తింటి వారే నిక్కీపై ఏదో ద్రవం పోసి నిప్పుపెట్టారని పేర్కొంది. ఆమె ఆరేళ్ల కొడుకు చూస్తుండగానే ఈ దారుణానికి తెగబడ్డారని వెల్లడించింది. కట్నం కింద అదనపు డబ్బులు తేనందుకే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్..ఆమె చెప్పింది విన్న వివాహిత షాక్‌తో దుర్మరణం
నోయిడా వివాహిత హత్య కేసులో కొత్త కోణం.. భర్త ఎఫైర్ బట్టబయలు
For More Crime News and Telugu News