Punjab Suicide: కార్పొరేట్ బ్యాంకు బాత్రూమ్‌లో కస్టమర్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
ABN , Publish Date - Sep 11 , 2025 | 08:31 PM
పంజాబ్‌లోని ఓ కార్పొరేట్ బ్యాంకు బాత్రూమ్‌లో ఒక కస్టమర్ ఆత్మహత్య చేసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారి తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని మొహాలీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వచ్చిన ఓ కస్టమర్ అక్కడి బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల భారం, పోలీసు అధికారి ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి సిద్ధమైనట్టు ఆయన వీడియో రికార్డు చేశారు. మృతుడిని రాజ్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు (Mohali HDFC Bank suicide).
జాతీయ మీడియా కథనాల ప్రకారం మోగా జిల్లాకు చెందిన రాజ్‌దీప్ మొహాలీలోని సెక్టర్ 8లోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్నాడు. తన సంస్థలో ఓ సీనియర్ పోలీసు అధికారి పెట్టుబడి పెట్టినట్టు ఆయన తన వీడియోలో చెప్పుకొచ్చారు. తన డబ్బును అతడు ఇప్పుడు తిరిగివ్వమంటున్నాడని, తన కుటుంబసభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. కాగా, తన కొడుకు రాజ్‌దీప్‌ను రిషీ రాణా, మరో వ్యక్తి వచ్చి తమవెంట తీసుకెళ్లారని తండ్రి పరమ్‌జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వారు తన కొడుకును ఘోరంగా అవమానించి, అతడి వీడియో రికార్డు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు (HDFC Bank bathroom suicide).
రాజ్‌దీప్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోను తీసుకునేలా బలవంతం చేశారని తండ్రి ఆరోపించారు. బలవంతంగా రాజ్‌దీప్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజ్‌దీప్ బ్యాంకు బాత్రూమ్‌లోకెళ్లి తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘నేను జీవితంలో ఎవరికీ అపకారం చేయలేదు. ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెస్తాను. మీరు నన్ను బాగా ఒత్తిడి చేస్తున్నారు. నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆయన వీడియోలో రికార్డు చేశారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గుర్జోత్ సింగ్ కాలేర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిషీ రాణా పేరును తన వీడియోలో రాజ్‌దీప్ పేర్కొన్నారు. తన వ్యాపార భాగస్వాములు రింకూ, రైనా తనకు రూ.40 లక్షలు బాకీ పడ్డారని, వారు డబ్బు తిరిగివ్వట్లేదని కూడా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్‌దీప్‌ను ఆత్మహత్యకు పురిగొల్పిన అభియోగంపై పోలీసులు.. ఆ సీనియర్ అధికారితో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..
సినిమాకు తీసుకెళ్లలేదని ఆ మహిళ చేసిన పనేంటో తెలిస్తే..