Mangaluru: విఫలమైన వివాహం.. పెళ్లిళ్ల బ్రోకర్‌ను హత్య చేసిన యువకుడు
ABN , Publish Date - May 24 , 2025 | 01:37 PM
తన వివాహం విఫలం కావడానికి పెళ్లిళ్ల బ్రోకర్ కారణమని నిందించిన ఓ యువకుడు అతడిని హత్య చేసిన ఘటన మంగళూరులో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తన భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఓ యువకుడు పెళ్లిళ్ల బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన షాకింగ్ ఉదంతం మంగళూరులో వెలుగు చూసింది. ఈ ఘటనలో మృతుడి ఇద్దరి కుమారులు గాయపడ్డారు. వలచిల్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, నిందితుడు ముస్తాఫాకు(30) ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. భార్య అతడితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో, ముస్తాఫా తనకు ఆ సంబంధం తెచ్చిన పెళ్లిళ్ల బ్రోకర్ సులేమాన్ (50)పై కోపం పెంచుకున్నాడు. ఈ పరిస్థితికి సులేమాన్ కారణమని నిందించాడు.
‘‘ఘటన జరిగిన రోజున ముస్తాఫా సులేమాన్‌కు ఫోన్ చేసి అసభ్య పదజలాంతో తిట్టాడు. దీంతో, సులేమాన్ తన ఇద్దరు కొడుకులు రియాబ్, సియాబ్‌లతో కలిసి ముస్తాఫా ఇంటికి చర్చల కోసం వెళ్లాడు. కొడుకులు ఇద్దరు ముస్తాఫా ఇంటి బయట వేచి చూడగా సులేమాన్ లోపలికి వెళ్లి అతడితో చర్చించాడు. ఆ తరువాత అతడు బయటకు వస్తుండగా ముస్తాఫా ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి వారిని బెదిరించాడు. ఆ తరువాత సులేమాన్ మెడపై కత్తితో పొడిచాడు. దీంతో, బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ లోపు ముస్తాఫా సియాబ్‌ను ఛాతిలో పొడిచాడు. రియాబ్‌ను మణికట్టుపై పొడిచి గాయపరిచాడు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇక గొడవ పెద్దది కావడంతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు బాధితులను ఆసుపత్రికి తరలించారు. సులేమాన్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అతడి కొడుకులు ఇద్దరికీ ఎటువంటి అపాయం లేదని అన్నారు. కాగా, పోలీసులు సులేమాన్ మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం అతడి కుటుంబానికి అప్పగించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 103(1) (హత్యానేరం) కింద పోలీసులు నిందితుడు ముస్తాఫాపై కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ అతడికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో ఘటనలో స్కూల్ ఫీజు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ టీనేజర్ తన బామ్మను రాత్రి వేళ హత్య చేశాడు. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. లఖ్నవూలోని మలీహాబాద్‌లో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ..