Hyderabad: ఉసురు తీసిన కల్తీ.. నగరంలో విజృంభిస్తున్న కల్లు మాఫియా
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:11 AM
నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ప్రమాదకరమైన కెమికల్స్‌తో కల్లును తయారు చేస్తున్న మాఫియా అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత కెమికల్స్‌ను దిగుమతి చేసుకొని కల్తీకల్లును తయారు చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
- నగరంలో విజృంభిస్తున్న కల్లు మాఫియా
- కల్తీ కల్లుకు ఆరుగురు బలి.. హానికర రసాయనాలతో తయారీ
- మామూళ్ల ‘మత్తు’లో అధికారులు.. చిత్తవుతున్న పేదల జీవితాలు..
- విచ్చలవిడిగా కల్లు కాంపౌండులు.. బినామీ గీతకార్మికుల పేరుతో లైసెన్స్‌లు
హైదరాబాద్ సిటీ: నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ప్రమాదకరమైన కెమికల్స్‌తో కల్లును తయారు చేస్తున్న మాఫియా అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత కెమికల్స్‌ను దిగుమతి చేసుకొని కల్తీకల్లును తయారు చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు, కల్లు కాంపౌండ్‌లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ కేటుగాళ్లు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, ఆబ్కారీ అధికారులు కిమ్మనడం లేదు. కల్తీకల్లు కాటుకు దాదాపు 28 మంది అస్వస్థతకు గురి కావడంతో మరోసారి తీవ్ర కలకలం రేపింది.
కట్టడేదీ?
కల్తీ మద్యం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టడంలో అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ కల్తీకల్లును కట్టడి చేయడంలో తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆల్ఫాజోలోం అనే ప్రమాదకరమైన కెమికల్ కలిపిన కల్లు తాగిన అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో ఆల్ర్పాజోలం పట్టుబడుతున్నా, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు కేసు విచారణలో లోతుగా వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
బినామీ పేర్లతో లైసెన్స్‌లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గీత కార్మికులు తక్కువగా ఉంటారు. కొందరు బడాబాబులు బినామీ పేర్లతో ఎక్సైజ్ శాఖ వద్ద టీఎఫ్‌టి (టీ ఫర్ ట్యాపర్స్) లైసైన్సు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కల్లులో కలిపే భయంకరమైన కెమికల్స్‌ను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. అల్ర్పాజోలమ్, డైజోఫాం వంటి మత్తు కెమికల్స్‌ను కలిపి కల్తీ కల్లును తయారుచేసి విక్రయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.

అడ్డాకూలీలు.. పేద కార్మికులే బలి..
కల్లు దుకాణాలకు వెళ్తున్న వారిలో పేద ప్రజలే ఉంటున్నారు. కూకట్‌పల్లి, మూసాపేట లాంటి ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి రోజూ 150-200 మంది వస్తున్నట్లు అక్కడి నిర్వాహకులు పేర్కొంటున్నారు. వారిలో అడ్డా కూలీలు, పారిశుధ్య కార్మికులు, బిచ్చగాళ్లు, కూలీనాలీ చేసుకునేవారే అధికంగా ఉంటున్నారు. కల్తీకల్లుకు అలవాటు పడినవారు వ్యసనపరులుగా మారుతుంటారని నిపుణులు చెప్తున్నారు. తాగడం ఆపితే ఫిట్స్ రావడం, నాలుక కరుచుకుని వెకిలి చేష్టలు, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడతారని పేర్కొంటున్నారు. అందులో కలిపే కెమికల్స్ వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావడం, రోడ్డుపై స్పృహలేకుండా పడిపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
గతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తరచూ కల్లు కాంపౌండ్‌లపై వరుసగా దాడులు నిర్వహించి కల్తీకల్లు విక్రయిస్తున్న దుకాణాలను మూసివేసేవారు. అల్ర్పాజోలమ్ వంటి రసాయనాలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం నగర శివారులోని అనేక ప్రాంతాల్లో కల్తీ కల్లు నిర్వాహకులు జోరుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కల్తీగాళ్లకు పరోక్షంగా ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యథ
- అందరూ రెక్కాడితే కానీ.. డొక్కాడని వారే
హైదర్‌నగర్: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని జిల్లాల నుంచి నగరానికి వచ్చిన వారిని కల్తీ కల్లు కాటేసింది. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే తప్ప మృతదేహాలను సొంతూరుకు తీసుకువెళ్లలేని దయనీయ స్థితి.
ఇస్త్రీ చేస్తూ జీవనోపాధి..
వనపర్తికి చెందిన బొజ్జయ్య ఉపాధి కోసం 15 ఏళ్ల కిత్రం వచ్చి కూకట్‌పల్లిలోని సాయిచరణ్ కాలనీలో ఉంటూ ఇస్ర్తీ పని చేస్తున్నాడు. భార్యతో పాటు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. పడుతున్న కష్టాన్ని మర్చిపోయేందుకు అలవాటుగా సేవిస్తున్న కల్లు కల్తీది కావడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం భాగ్యనగర్ కాలనీలోని ప్రతిమ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరాడు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో డిశ్చార్జి చేయించుకొని ఇంటికి వచ్చారు. మరోసారి అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు ఆటోలో తీసుకెళ్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
రెండు నెలల క్రితమే భర్త మృతి
హైదర్‌నగర్‌లోని నామననగర్ నివాసి స్వరూప (61) మంగళవారం నిజాంపేటరోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె కుమారుడు తల్లిని బతికించుకునేందుకు జాగ్రత్త తీసుకున్నా ప్రాణాలు దక్కలేదు. రెండు నెలల క్రితమే ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుమారుడు తీవ్ర విషాదంలో ఉన్నాడు.
చికిత్సకు కాలయాపన చేయడంతో..
కల్తీకల్లు తాగిన నారాయణమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 20 ఏళ్లుగా నారాయణమ్మ(65) సాయిచరణ్ కాలనీలోనే నివాసం ఉంటోంది. భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్దచేసింది. కొవిడ్ సమయంలో పెద్ద కుమార్తె చనిపోయింది. చిన్న కుమార్తెకు వివాహం చేసింది. పేరు రాయించుకున్నారా? మందులు తెచ్చుకోండి.. అంటూ ఆస్పత్రిలో కాలయాపన చేయడంతో అత్త చనిపోయిందని అల్లుడు వాపోతున్నాడు.
మృతదేహం తీసుకెళ్లే స్తోమత లేకపాయే..
శంషీగూడ శ్రీరాంనగర్‌లో ఉంటున్న సీతారాం (47) గాంధీ ఆసుపత్రిలో సీపీఆర్ చేస్తుండగా బుధవారం ప్రాణాలు విడిచాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేదు. కార్పొరేటర్ దొడ్ల వెంకటే్‌షగౌడ్ చేసిన ఆర్థిక సాయంతో అంబులెన్స్‌లో వనపర్తి జిల్లాలోని మదిగట్ల గ్రామానికి సీతారాం మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే
Read Latest Telangana News and National News