Hyderabad: అప్పుల బాధతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
ABN , Publish Date - Jun 06 , 2025 | 08:27 AM
జిమ్ ట్రైనర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీకేరోడ్డులో నివాసముండే సీహెచ్ నితీష్ అనే జిమ్ ట్రైనర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: అప్పుల బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది ఓ జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్(SR Nagar Police Station) పరిధిలోని డీకేరోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన సీహెచ్ నితీష్ (30) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని 10 సంవత్సరాలుగా ప్రేమించి ఇటివలే పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం క్రితం అమీర్‌పేట డీకేరోడ్డులోకి మకాం మార్చాడు. ఇక్కడ ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం భార్య వ్యక్తిగత పని నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లాల్సిన నితీష్ ఇంట్లోనే ఉండిపోయాడు. రాత్రి నితీష్‌కు తల్లి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. విషయాన్ని తన పెద్ద కొడుకు నిహాల్‌కు చెప్పింది. వెంటనే నితీష్ భార్యకు సమాచారం అందించి డీకేరోడ్డులోని నివాసానికి చేరుకున్నారు. తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా నితీష్ పలకకపోవడంతో తలుపులను పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ మెసేజ్‌లను పరిశీలించగా.. పలు రుణ యాప్‌లలో అప్పులు తీసుకున్నట్లు తేలింది. అప్పుల బాధతోనే నితీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
Read Latest Telangana News and National News