Hyderabad: తప్పతాగి కారు డ్రైవింగ్.. ద్విచక్రవాహదారుడికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:18 AM
పీకలదాకా మద్యం తాగిన ఇద్దరు యువకులు.. కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారకులయ్యారు. అంతేగాక అక్కడకు వచ్చిన వారిని బెదిరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
- రాచకొండ కమీషనర్‌కు ఫిర్యాదు
- ఎట్టకేలకు కేసు నమోదు
- కుషాయిగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హైదరాబాద్: తెల్లవారు జామునే పీకలదాకా మద్యం తాగిన ఇద్దరు యువకులు కారును వేగంగా నడుపుతూ ఓ ద్విచక్ర వాహదారుడిని ఢీకొట్టారు. దీంతో ప్రశ్నించిన సదరు వాహనదారుడినే మద్యం మత్తులో ఉన్న యువకులు బెదిరించిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్(Kushaiguda Police Station) పరిధిలో జరిగింది. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. చివరకు న్యాయం చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను ఆశ్రయించడంతో ఆగమేఘాల మీద కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయుగూడకు చెందిన ఇ.ప్రవీణ్‌కుమార్(43) ప్రైవేటు ఉద్యోగి, గత నెల 27న ఉదయం 8.30గంటల సమయంలో ఆయన తన బైక్‌పై కుషాయుగూడ నుంచి వెళ్తుండగా మార్గమధ్యలో కృష్ణానగర్‌లో వేగంగా వచ్చిన కారు (ఏపి28డిజి-7056) ఆయనను ఢీకొట్టింది. దీంతో అతను కిందపడడంతో రెండు కాళ్లకు, చేతికి గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు కారు నడుపుతున్న యువకుడిని వారించగా.. తాగిన మైకంలో ఉన్న ఆ యువకుడు ప్రవీణ్‌కుమార్‌నే దబాయించాడు.
దీంతో ఆయన 100కు డయల్‌కు చేయడంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు చర్లపల్లి స్టేషన్ కానిస్టేబుళ్లు బాధితుడు ప్రవీణ్‌తో పాటు ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారు నడిపిన యువకుడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు తేలింది. ప్రమాద ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడే ఫిర్యాదు చేయాలని బాధితుడి చేతిలో టెస్ట్ రిపోర్టు పెట్టి పంపించారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఇద్దరు యువకులు కారుతో ఉడాయించారు. దీంతో బాధితుడు కుషాయిగూడ పోలీసులకు కారు నెంబరు, ఫొటోలతో సహా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు.
అయితే, వారం గడిచినా పోలీసులు స్పందించకపోవడంతో మంగళవారం కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో బాధితుడు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు అదే రోజు సాయంత్రం కేసు నమోదు చేశారు. అయితే, జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందని, కేసు నమోదులో కొంత తాత్సారం జరిగినప్పటికీ నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలతో గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News