సోదరితో స్నేహాన్ని సహించలేక.. పరువు హత్య
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:53 AM
తమిళనాడులోని పాళయంకోటలో ఓ యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. నిమ్నకులస్థుడైన ఓ యువకుడు అగ్రకులానికి చెందిన తన సోదరితో స్నేహం పెంచుకున్నాడని ఆమె తమ్ముడు నడిరోడ్డులో కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ పరువుహత్యకు పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
- నడిరోడ్డులో ఐటీ ఉద్యోగి హతం
- సోదరితో స్నేహాన్ని సహించలేక యువకుడి ఘాతుకం
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లోని పాళయంకోటలో ఓ యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. నిమ్నకులస్థుడైన ఓ యువకుడు అగ్రకులానికి చెందిన తన సోదరితో స్నేహం పెంచుకున్నాడని ఆమె తమ్ముడు నడిరోడ్డులో కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ పరువుహత్యకు పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాలిలా... తూత్తుకుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, సెల్వి దంపతుల కుమారుడు కవిన్‌కుమార్ (26) చెన్నై ఐటీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్‌కుమార్ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోట కేటీసీ నగర్ ప్రాంతంలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తాతకు చికిత్స జరుగుతుండటంతో కవిన్‌కుమార్ బయట నిలబడ్డాడు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు అతడిని పిలిచాడు. కొంత దూరం వెళ్లాక బైకు నిలిపి కవిన్‌కుమార్‌తో ఆ యువకుడు గొడవకు దిగి హఠాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. కత్తిపోట్లతో కవిన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పాళయంకోట పోలీసులు హుటాహుటిన వెళ్ళి కవిన్‌కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని సీసీ ఫటేజీ ఆధారంగా కవిన్‌కుమార్‌ను హతమార్చింది పాళయం కోట కేటీసీ నగర్ ప్రాంతానికి చెందిన సుర్జిత్ (24)గా గుర్తించారు. సుర్జిత్ తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఎస్సైలుగా పనిచేస్తున్నారని తెలిసి, ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సుర్జిత్ సహా, అతడి తల్లిదండ్రులను అరెస్టుచేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారించగా కవిన్‌కుమార్‌ది పరువుహత్యగా తేలింది.

ఉన్నత వర్గానికి చెందిన సుర్జిత్ సోదరి, కవిన్‌కుమార్ బాల్య స్నేహితులు, ఇద్దరూ ఒకే స్కూలులో చదివారు. సుర్జిత్ సోదరి సిద్ధ వైద్య ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో ఆమెను చూడటానికి తరచూ వచ్చేవాడని, ఇద్దరు మాట్లాడుకోవడం చూసి సహించలేక పోయేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. నిమ్న కులానికి చెందిన కవిన్‌కుమార్ తన సోదరితో స్నేహం చేయడాన్ని సహించలేక సుర్జిత్ పథకం ప్రకారం హతమార్చినట్టు వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.
ఈ విచారణ అనంతరం పోలీసులు సుర్జిత్‌పై హత్య, అంటరానితనం నిరోధక చట్టం సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కవిన్‌కుమార్ పరువు హత్యకేసుకు సంబంధించి ఎస్‌ఐలుగా ఉన్న అతడి తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News