Share News

Body Found In Water Tank: మెడికల్ కాలేజీ వాటర్ ట్యాంకులో కుళ్లిన స్థితిలో శవం..

ABN , Publish Date - Oct 09 , 2025 | 08:04 AM

ఆ శవం నీటిలో ఉండబట్టి 10 రోజులుపైనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాగే నీళ్ల ట్యాంకులో శవం ఉందని తెలియని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది, రోగులు ఆ నీటిని తాగారు.

Body Found In Water Tank: మెడికల్ కాలేజీ వాటర్ ట్యాంకులో కుళ్లిన స్థితిలో శవం..
Body Found In Water Tank

ఓ మెడికల్ కాలేజీలోని తాగే నీళ్ల ట్యాంకులో శవం వెలుగుచూసింది. ట్యాంకునుంచి కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డంతో కాలేజీలో కలకలం చెలరేగింది. ఆ నీళ్లు తాగిన వారు వాంతులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని డియోరాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డియోరాలో డేరా బాబా మెడికల్ కాలేజీ ఉంది. గత రెండు, మూడు రోజుల నుంచి తాగడానికి ఉపయోగించే ట్యాప్ వాటర్ నీళ్లు దుర్వాసన వస్తున్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.


అయితే, ఆయన దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. విద్యార్థులు తరచుగా ఫిర్యాదు చేస్తుండటంతో క్లీనింగ్ సిబ్బంది ట్యాంకు దగ్గరకు వెళ్లారు. అందులో కుళ్లిన స్థితిలో శవం ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద శవాన్ని బయటకు తీశారు. శవం చాలా రోజుల నుంచి నీటిలో ఉండటంతో బాగా కుళ్లిపోయి చర్మం ఊడిపోతూ ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ శవం నీటిలో ఉండబట్టి 10 రోజులుపైనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాగే నీళ్ల ట్యాంకులో శవం ఉందని తెలియని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది, రోగులు ఆ నీటిని తాగారు. జిల్లా అధికారులు ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. కాలేజీ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు. ఆ నీటిని తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు మృతుడు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు. అతడ్ని ఎవరైనా చంపారా? ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

గురకపెట్టి నిద్రపోతున్న భర్త.. భార్య చేసిన పనికి చావు బతుకుల్లో..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..

Updated Date - Oct 09 , 2025 | 08:06 AM