Share News

US Recession Fears: ఆర్థిక మాంద్యం అంచున అమెరికా

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:59 AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు ముంచుకొస్తోందా..? అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందా..? అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు. ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే అమెరికా మాంద్యం అంచుల్లో...

US Recession Fears: ఆర్థిక మాంద్యం అంచున అమెరికా

మూడీస్‌ ప్రధాన ఆర్థికవేత్త మార్క్‌ జాండీ హెచ్చరిక

న్యూయార్క్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు ముంచుకొస్తోందా..? అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందా..? అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు. ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే అమెరికా మాంద్యం అంచుల్లో ఉందని అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ప్రధాన ఆర్థికవేత్త మార్క్‌ జాండీ హెచ్చరించారు. యూఎస్‌ జీడీపీలో మూడో వంతు (33.33 శాతం) ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుంది లేదా జారుకునేందుకు అధిక అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో మూడో వంతు నిలకడగా సాగుతుండగా.. మిగతా మూడో వంతు మాత్రమే పురోగమిస్తోందన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే, వ్యోమింగ్‌, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పీ, కాన్సాస్‌, మసాచుసెట్స్‌కు మాంద్యం ముప్పు పొంచి ఉందన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్‌ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందన్నారు. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే.

ధరలు మళ్లీ పైపైకి: అమెరికాలో ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు మళ్లీ పెరుగుతున్నాయని.. త్వరలోనే విస్మరించలేని స్థాయికి ఎగబాకవచ్చని జాండీ అన్నారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ధరాభారం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ఠ స్థాయికి జారుకుందన్నారు. ఈ జూలై లో అమెరికాలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికాలంలో సూచీ 4 శాతానికి ఎగబాకవచ్చని జాండీ అంచనా. తత్ఫలితంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోవచ్చని జాండీ అన్నారు.


మాంద్యం అంటే: వరుసగా రెండు త్రైమాసికాల పాటు జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తే (రుణాత్మక స్థాయికి పడిపోవడం) ఆ దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లుగా పరిగణిస్తారు. ట్రంప్‌ సుంకాల యుద్ధం ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో అమెరికా జీడీపీ 0.50 శాతం క్షీణించగా.. రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మాత్రం 3.3 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

అంటే, ప్రస్తుతం అమెరికా పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. పెరుగుతున్న ధరలు, సుంకాలతో పెరిగిన వాణిజ్య అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు త్రైమాసికాల్లో ఆ దేశ జీడీపీని మాంద్యంలోకి నెట్టవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగ గణాంకాల మాంద్యం ఘంటికలు

ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22,000కు పరిమితం అయ్యాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. అంతేకాదు, మే, జూన్‌ నెలలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలను కూడా భారీగా తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‌ సుంకాలు అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల లాభాలపైనా ప్రభావం చూపనున్నాయని, దాంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తాయని, పర్యవసానంగా అక్కడి జాబ్‌ మార్కెట్‌ మరింత బలహీనపడే అవకాశాలున్నాయని జాండీ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 02:00 AM