Share News

Uncertainty in Bullion Market: బులియన్‌ మార్కెట్లో అనిశ్చితి

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:26 AM

బులియన్‌ మార్కెట్లో ఈ వారం కూడా ధరల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి (24 క్యారట్స్‌) బంగారం రికార్డు స్థాయిలో 4,398 డాలర్లకు...

Uncertainty in Bullion Market: బులియన్‌ మార్కెట్లో అనిశ్చితి

ధరలు మరింత కిందికే!

  • లాభాల స్వీకరణకు అవకాశం

  • కేంద్ర బ్యాంకుల వైఖరే కీలకం

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో ఈ వారం కూడా ధరల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి (24 క్యారట్స్‌) బంగారం రికార్డు స్థాయిలో 4,398 డాలర్లకు (సుమారు రూ.3.87 లక్షలు) చేరింది. ఆ మరుసటి రోజే గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 266.4 డాలర్లు (6.11ు) పడిపోయింది. వెండిదీ ఇదే పరిస్థితి. ఈ నెల 17న ఔన్స్‌ వెండి ధర రికార్డు స్థాయిలో 53,76 డాలర్లను తాకింది. ఈ నెల 21న ఈ ధర 47.12 డాలర్లకు పడిపోయింది.

అదే బాటలో దేశీ మార్కెట్‌

గత వారం బంగారం, వెండికి దేశీయ మార్కెట్‌ కూడా కలిసి రాలేదు. గత వారం 10 గ్రాముల మేలిమి బంగారం ఒక దశలో రూ.1.32 లక్షలకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి ధరా రూ.1.90 లక్షలు తాకింది. వారాంతానికల్లా లాభాల స్వీకరణతో రూ.1.70 లక్షలకు దిగొచ్చింది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌పైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. డిసెంబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం గత వారం రూ.3,557 (2.8ు) నష్టంతో ముగిసింది. వెండిదీ ఇదే పరిస్థితి. ఎంసీఎక్స్‌లో డిసెంబరులో డెలివరీ ఇచ్చే కిలో వెండి ధర గత వారం రూ.9,134 (5.83ు) నష్టపోయింది.


దిద్దుబాటు తాత్కాలికమే

అయితే బంగారం, వెండి ధరల్లో ఈ దిద్దుబాటు తాత్కాలికమేనని మార్కెట్‌ వర్గాల అంచనా. దీర్ఘకాలానికి చూస్తే ఈ రెండు లోహాలకు ఽఢోకా లేదని నిపుణులు చెబుతున్నారు. ‘గత వారం బంగారం, వెండి ధరలు తీవ్ర దిద్దుబాటుకు లోనయ్యాయి. అయినా దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రెండు లోహాలు ఇప్పటికే అనుకూలంగానే ఉన్నాయి’ అని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రియా సింగ్‌ తెలిపారు.

మరింత దిద్దుబాటు?

ఈ వారం కూడా లాభాల స్వీకరణతో బంగారం, వెండి ధరలు మరింత దిద్దుబాటుకు లోనవుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ నెల 28-29న జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం, ఈ నెల 30న జరిగే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) సమావేశాల్లో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు వచ్చే కొద్ది రోజులు బులియన్‌ మార్కెట్‌ను నడిపిస్తాయని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ రెండు సంఘటనలకు తోడు గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య జరిగే భేటీతో రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం చల్లబడుతుందని భావిస్తున్నారు. భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చలు కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఈ వారం మరో 5ు వరకు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

కేంద్ర బ్యాంకులు

ఎందుకు కొంటున్నాయంటే ?

  • డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మారడం

  • వడ్డీ రేట్లు భారీగా తగ్గించినా సంపన్న దేశాల్లో వృద్ధి రేటు 2ు దిగువకు చేరడం

  • ప్రభుత్వ రుణ పత్రాల కంటే పసిడిపై రాబడులు ఎక్కువగా ఉండడం

  • అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై నమ్మకం సన్నగిల్లడం

  • ఎగవేతలు, దివాలా బాధ లేకపోవడం

  • విలువ పెద్దగా హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశం లేకపోవడం

  • ద్రవ్యోల్బణ సమయంలోనూ పెట్టుబడుల విలువ క్షీణించక పోవడం

  • కష్ట సమయాల్లో అమెరికా వంటి దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి కాపాడుతుందనే భరోసా

  • ఆర్థిక మాంద్యం వంటి ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ ఫారెక్స్‌ నిల్వల విలువకు రక్షణ

  • బహుళ ధ్రువ ప్రపంచంలో స్వతంత్ర ద్రవ్య విధానానికి వెసులుబాటు

  • డాలర్‌, పౌండ్‌ వంటి కరెన్సీలతో పోలిస్తే ఫారెక్స్‌ నిల్వలకు అధిక రక్షణ

  • డాలర్‌ ఆధిపత్యంపై సన్నగిల్లుతున్న ఆశలు

ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 05:26 AM