Delhi: ఒక్కో ఫోన్‌లో ఒక్కో రేటు.. ఓలా, ఉబర్ ఛార్జీలపై కంపెనీల రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jan 25 , 2025 | 10:24 AM
ఢిల్లీ: భారతదేశంలో తమ ప్రైసింగ్ పాలసీ విధానంపై వస్తున్న ఆరోపణలను యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా ఖండించాయి. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను బట్టి సేవలకు భిన్నమైన ధరలు అమలు చేస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పాయి.
ఢిల్లీ: భారతదేశంలో తమ ప్రైసింగ్ పాలసీ విధానంపై వస్తున్న ఆరోపణలను యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా ఖండించాయి. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను బట్టి సేవలకు భిన్నమైన ధరలు అమలు చేస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పాయి. ఆయా సంస్థల ప్రైసింగ్ పాలసీపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. ఆ రెండు సంస్థలు ఫోన్ రకం, ధరలను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ పలువురు వినియోగదారులు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఒకే ప్రాంతం నుంచి ఆండ్రాయిడ్, ఐఫోన్లతో రైడ్స్ బుక్ చేస్తే ఒకే యాప్‌లో రెండు వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని ఆరోపించారు. ఐఫోన్‌లో ఛార్జీలు ఎక్కువగానూ, ఆండ్రాయిడ్‌లో తక్కువగానూ చూపిస్తున్నట్లు ఉన్న స్కీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యాపిల్ ఫోన్లు వాడే వారికి ఎక్కువ కొనుగోలు శక్తి ఉంటుందని ఆయా కంపెనీలు భావిస్తున్నాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓలా, ఉబర్ వివరణ ఇవ్వాలని సీసీపీఏ గురువారం నోటీసులు జారీ చేసింది. కాగా, తాము కస్టమర్లందరికీ ఒకే విధమైన ధరల విధానాన్ని కలిగి ఉన్నామని ఓలా ప్రతినిధి తెలిపారు. ఫోన్లను బట్టి ధరలు విధించడం లేదని వివరించారు. ఇదే విషయాన్ని సీసీపీఏకి వివరించామని పేర్కొన్నారు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఓలా ప్రతినిధి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలపై గూగుల్, యాపిల్ ఇంకా స్పందించలేదు.