Share News

T-Mobile CEO: భారత సంతతి వ్యక్తులను సీఈఓలుగా ఎంపిక చేసిన అమెరికన్ దిగ్గజ సంస్థలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 02:47 PM

అమెరికాకు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు భారత సంతతి వ్యక్తులను సీఈఓలుగా నియమించుకున్నాయి. టెలికం దిగ్గజం టీ-మొబైల్ శ్రీనివాసన్‌ను, పానీయాల సంస్థ మాల్సన్ కూర్స్.. రాహుల్‌ గోయల్‌ను సీఈఓలుగా ఎంపిక చేశాయి.

T-Mobile CEO: భారత సంతతి వ్యక్తులను సీఈఓలుగా ఎంపిక చేసిన అమెరికన్ దిగ్గజ సంస్థలు
Srinivas Gopalan (Left), Rahul Goyal

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ ట్రంప్ ప్రభుత్వం కలకలం రేపుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రరాజ్యంలోని రెండు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు భారత సంతతి వారిని తమ సీఈఓలుగా నియమించుకున్నాయి. టెలికం రంగ దిగ్గజం టీ మొబైల్ (T Mobile) తాజాగా శ్రీనివాస్ గోపాలన్ (శ్రీనీ)‌ను సీఈఓగా నియమించుకుంది. ప్రస్తుత సీఈఓ మైక్ సీవర్ట్ సంస్థ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందిన నేపథ్యంలో ఆయన స్థానంలో సంస్థ పగ్గాలు శ్రీని గోపాలన్ చేతుల్లోకి వెళ్లాయి (Indian origin CEOs).

ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో చదివిన శ్రీనివాస్ గోపాలన్ హిందుస్థాన్ యూనిలివర్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఆయన పలు దేశాల్లో అనేక రంగాల్లో సేవలందించారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డాయ్‌చ టెలికం‌లో (జర్మనీ సంస్థ) పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. గతంలో సంస్థకు సంబంధించి టెక్నాలజీ, కన్జ్యూమర్, బిజినెస్ విభాగాల్లో సేవలందించారు. 5జీ, ఏఐ, డిజిటల్ అంశాల్లో సంస్థ అభివృద్ధికి బాటలు పరిచారు.

సంస్థ ప్రస్తుత సీఈఓ సీవర్ట్.. గోపాలన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనకు తన రంగంపై అనురక్తి, నైపుణ్యాలు, అవగాహన మెండుగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఇక తనకీ అవకాశం దక్కినందుకు గోపాలన్ లింక్డ్‌ఇన్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధి సాధించిన తీరు తనకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. వైర్‌లెస్ టెక్నాలజీని టీమొబైల్ మునుపెన్నడూ చూడని విధానాల్లో కస్టమర్లకు చేరువ చేసిందని పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే, చికాగోలోని పానీయాల సంస్థ మోల్‌సన్ కూర్స్ (Molson Coors).. తాజాగా భారత సంతతికి చెందిన రాహుల్ గోయల్‌ను (Rahul Goyal) సంస్థ ప్రెసిడెంట్, సీఈఓగా నియమించింది. అక్టోబర్ 1 నుంచి ఆయన అధికారికంగా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. మైసూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రాహుల్ ఆ తరువాత వాణిజ్య విద్య కోసం డెన్వర్‌కు వెళ్లారు. మోల్‌సన్ కూర్స్ సంస్థలో వివిధ విభాగాల్లో అమెరికాతో పాటు , యూకే, భారత్‌లో సేవలందించారు. తదుపరి సీఈఓ ఎవరన్న దానిపై సుదీర్ఘ కసరత్తు అనంతరం రాహుల్ తగిన వ్యక్తి అని తాము విశ్వసిస్తున్నట్టు సంస్థ చైర్మన్ డేవిడ్ కూర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

జీవితకాల కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువెంత..

బంగారం ధర మరింత ముందుకు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 03:08 PM